సేలం: వందే భారత్ రైలు అత్యవసర డోర్ తెరుచుకున్న వ్యవహారంలో ఇద్దరు ఉద్యోగులను శుక్రవారం సస్పెండ్ చేశారు. చైన్నె– కోయంబత్తూరు మధ్య వందే భారత్ రైలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 26న ఈ రైలు అత్యవసర డోర్ తెరుచుకోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చైన్నెకు చెందిన రిటైర్డ్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ పౌలేష్ (70), ఆయన భార్య రోజ్ మార్గరేట్ ఈరోడ్‌కు ఈ రైలులో ఈ నెల 26న ప్రయాణించారు. సాయంత్రం 6.05 గంటలకు వందే భారత్ రైలు సేలం చేరుకుని ప్లాట్‌ఫామ్ 4 వద్ద ఆగింది.
ఈ సమయంలో పౌలేష్ తన సీటు నుంచి లేచి రైలు ఎమర్జెన్సీ డోర్ దగ్గర నిలబడ్డాడు. అప్పుడు అకస్మాత్తుగా డోర్ తెరుచుకోవడంతో పౌలేష్ అవతలివైపు ఉన్న 5వ ప్లాట్‌ఫారమ్‌పై పడి మృతిచెందాడు. ఈ ఘటనపై సేలం రైల్వే డివిజనల్ మేనేజర్ పంకజకుమార్ సిన్హా విచారించారు. సీ3 కంపార్ట్‌మెంట్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఇందులో సేలం రైల్వే స్టేషన్‌న్‌లోని 4వ ప్లాట్‌ఫారమ్‌లో వందే భారత్ రైలు ఆగి ఉన్న సమయంలో 5వ ప్లాట్‌ఫారమ్‌లో ఉన్న ఇద్దరు రైల్వే ఉద్యోగుల పనితీరుపై అనుమానాలు నెలకొన్నాయి.
ఈ ఇద్దరు మరో ప్లాట్‌ఫామ్‌కు వెళ్లేందుకు బలవంతంగా అత్యవసర డోర్ తెరిచినట్టు తేలింది. ఆ కొద్దిసేపటికే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు వెలుగుచూసింది. దీంతో సేలం రైల్వేస్టేషన్‌న్‌లో పాయింట్స్‌మన్లుగా పనిచేస్తున్న తామరైసెల్వన్, అదిమీనాగా గుర్తించారు. వీరిని సస్పెండ్ చేస్తూ శాఖాపరమైన చర్యలకు డివిజనల్ మేనేజర్ పంకజ్ కుమార్ సిన్హా ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment