అన్నాడీఎంకేలో చీలికకు బీజేపీ యత్నం | - | Sakshi
Sakshi News home page

అన్నాడీఎంకేలో చీలికకు బీజేపీ యత్నం

Published Sun, Oct 1 2023 1:06 AM | Last Updated on Sun, Oct 1 2023 9:04 AM

ఎస్పీ వేలుమణి, అన్నామలై  - Sakshi

ఎస్పీ వేలుమణి, అన్నామలై

అన్నాడీఎంకేలో చిచ్చుపెట్టే దిశగా బీజేపీ వ్యూహాలు పన్నుతోందనే ప్రచారం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆ పార్టీలో సీనియర్‌గా ఉన్న ఎస్పీ వేలుమణిని అస్త్రంగా చేసుకుని పళణి స్వామికి వ్యతిరేకంగా కేంద్రపెద్దలు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఫలితంగా అన్నాడీఎంకే నుంచి త్వరలో ఓ ఏక్‌నాథ్‌ షిండే వస్తారని, మహారాష్ట్ర తరహా రాజకీయం తమిళనాడులో చూడబోతున్నామనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో ఊపందుకుంది.

సాక్షి, చైన్నె: ఎన్డీయే కూటమి నుంచి అన్నాడీఎంకే ఇటీవల బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో పళణిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే వర్గాలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైను టార్గెట్‌ చేసి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టే పనిలో పడ్డారు. రాయబారానికి, సామరస్యానికి చోటు లేదని స్పష్టం చేస్తూ, ఇక బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ఈ పరిణామాలను బీజేపీ అధిష్టానం పెద్దలు నిశితంగా పరిశీలిస్తున్నారు. అయితే అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా సంయమనం పాటిస్తున్నారు. అదే సమయంలో కొత్త వ్యూహాలకు సైతం పదును పెట్టినట్లు తెలుస్తోంది.

చిచ్చు ప్రయత్నాలు
అన్నాడీఎంకే సీనియర్లలో ఎస్పీ వేలుమణి కీలక నేత. ఆయనపై అనేక కేసులు సైతం పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసులను అస్త్రంగా చేసుకుని ఆయన్ని తమ దారికి తెచ్చుకునేందుకు బీజేపీ వ్యూహ రచన చేస్తున్నట్టు ప్రచారం ఊపందుకుంది. ఎస్పీ వేలుమణి ద్వారా అన్నాడీఎంకేలో చిచ్చు పెట్టే అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నట్లు చర్చ జోరందుకుంది. అన్నాడీఎంకేలో ఎస్పీ వేలుమణి ఓ ఏక్‌నాథ్‌ షిండే (మహారాష్ట్ర సీఎం) అన్న ట్యాగ్‌లైన్‌తో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్‌గా మారాయి. మహారాష్ట్రలో శివసేన నేత ఉద్దవ్‌ ఠాక్రేను ఏవిధంగా ఏక్‌నాథ్‌ షిండే కూల దోశాడో..అదే తరహాలో పళణిస్వామికి ఎస్పీ వేలుమణి చుక్కలు చూపించబోతున్నట్లు ప్రచారం ఊపందుకుంది.

ఇది కాస్త అన్నాడీఎంకేలో కొత్త చర్చకు దారి తీశాయి. దీంతో ఎస్పీ వేలుమణి స్పందించారు. తాను అప్పుడు.. ఇప్పుడు..ఎల్లప్పుడూ అన్నాడీఎంకేకు విశ్వాస పాత్రుడినే అని స్పష్టం చేశారు. తాను సైకిల్‌ యాత్ర చేసిన ఫొటోను ట్యాగ్‌ చేస్తూ తన సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాలకు ముగింపు పలికే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా, అన్నాడీఎంకే కూటమి సీఎం అభ్యర్థిగా అన్నామలైను ప్రకటించాలని బీజేపీ ఒత్తిడి తీసుకు రావడంతోనే కూటమి నుంచి తాము బయటకు వచ్చామని అన్నాడీఎంకే సీనియర్‌ నేత, మాజీ మంత్రి కరుప్పన్నన్‌ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బీజేపీకి వారి బలం ఏమిటో లోక్‌ సభ ఎన్నికలు స్పష్టం చేస్తాయని మరో సీనియర్‌ నేత కేపీ మునుస్వామి వ్యాఖ్యానించారు.

నేడు అమిత్‌ షాతో అన్నామలై
అన్నాడీఎంకే కటీఫ్‌ ప్రకటన నేపథ్యంలో ఢిల్లీ నుంచి వచ్చిన పిలుపుతో అన్నామలై అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఆదివారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌ షాతో ఆయన భేటీ కానున్నారు. దూకుడు మీదున్న అన్నామలై అమిత్‌ షా ముందు కొత్త ప్రతిపాదనను ఉంచేందుకు సిద్ధమైనట్లు చర్చ ఊపందుకుంది. రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేయడానికి అనుమతి ఇవ్వాలని అమిత్‌షాను ఆయన కోరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అప్పుడే తమిళనాడులో బీజేపీ బలం ఏమిటో తెలుస్తుందని, అందుకు అనుగుణంగా భవిష్యత్తుకు కార్యాచరణ సిద్ధం చేయవచ్చు అనే విషయాన్ని తెలియజేస్తూ ఓ నివేదికను సిద్ధం చేసుకుని మరీ ఆయన ఢిల్లీ వెళ్తున్నట్లు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.

పళణి కొత్త ప్రయత్నాలు
బీజేపీతో ఇక దోస్తీ లేదని తేల్చిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి కొత్త కూటమి ప్రయత్నాల్లో నిమగ్నమైనట్లు సమాచారం. బలమైన కూటమి దిశగా తమతో కలిసి రావాలని పీఎంకే, తమిళ మానిల కాంగ్రెస్‌, డీఎండీకేలకు ఆహ్వానం పలికేవిధంగా రాయబార ప్రయత్నాలు మొదలెట్టినట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఈ మూడు పార్టీలతోపాటు కొన్ని చిన్న పార్టీలను తన వైపునకు తిప్పుకునే దిశగా ప్రయత్నాలను జరుగుతున్నట్లు చర్చ జరుగుతోంది. డీఎంకేలో అసంతృప్తిగా ఉన్న కొన్ని చిన్న పార్టీలను సైతం కలుపుకునే ప్రయత్నంలో పళణిస్వామి ఉన్నట్లు అన్నాడీఎంకే నేతలు పేర్కొంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement