సాక్షి, చైన్నె: బస్సులో వెళ్తున్న సమయంలో గుండెపోటుకు గురైన ఓ వంట మాస్టరు పట్ల ఆ బస్సు డ్రైవర్, కండెక్టర్ నిర్దయగా వ్యవహరించారు. మార్గం మధ్యలో ఆసుపత్రులు ఉన్నా పట్టించుకోకుండా బలవంతంగా రోడ్డు పక్కన ఓ టీ కొట్టు వద్ద బస్సు ఆపి దించేసి వెళ్లిపోయారు. దీంతో సకాలంలో చికిత్స అందక, సాయం చేసే వారు లేక రోడ్డుపైనే వంట మాస్టర్ గుండె ఆగింది. కాగా ఆ బస్సులోని ఓ ప్రయాణికుడు ఇచ్చిన సమాచారంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు.. విరుదునగర్ జిల్లా శ్రీవిళ్లిపుత్తూరు నల్ల కుట్రాలం ప్రాంతానికి చెందిన జ్యోతి భాస్కర్(55) వంట మాస్టర్, శంకరన్ కోయిల్‌లోని ఓ హోటల్‌లో పనిచేస్తాడు.
రోజూ శ్రీవిళ్లిపుత్తూరు – శంకరన్ కోయిల్ మధ్య బస్సు ప్రయాణంతో విధులకు వెళ్లేవాడు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎప్పటిలాగే వేకువజామున ఇంటి నుంచి శంకరన్ కోయిల్‌కు తిరునల్వేలి వైపుగా వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో బయలుదేరాడు. ఈ మార్గంలో చైన్నె వంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు అనధికారికంగా ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్లడం సహజం.
కనికరం లేకుండా..
ఈ బస్సులో ప్రయాణించే సమయంలో మార్గం మధ్యలో రాజ పాళయం వద్దకు జ్యోతి భాస్కర్‌కు ఛాతినొప్పి రావడంతో తల్లడిల్లిపోయారు. సమీపంలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ఉన్నా, డ్రైవర్, కండెక్టర్ మహేశ్, గోపాల్ కనికరించ లేదు. మానవత్వాన్ని మరిచి వ్యవహరించారు. కనీసం ప్రథమచికిత్స కూడా అందించకుండా శంకరన్ కోయిల్‌కు వెళ్లకుండా క్రాస్ రోడ్డులో బస్సును ఆపేశారు. ఛాతి నొప్పితో తల్లడిల్లుతున్న వంట మాస్టర్‌ను బలవంతంగా బస్సు నుంచి దించేశారు. రోడ్డు పక్కగా ఉన్న ఓ టీ దుకాణం వద్ద కూర్చోబెట్టి బస్సును లాగించేశారు. నిద్రలో ఉన్న ప్రయాణికులు పెద్దగా ఎవ్వరూ ఈ ఘటనను పట్టించుకోలేదు. అయితే, బస్సులో ఉన్న ఓ యువకుడు ఎవరినో బలంతంగా కిందకు దించుతుండడాన్ని గుర్తించాడు.
అయితే, అతడికి ఛాతినొప్పి విషయం తెలియనట్లుంది. చివరకు ఆ టీ కొట్టు వద్ద గుండె నొప్పితో కొట్టుకుని వంట మాస్టారు మరణించాడు. కాసేపటికి ఈ సమాచారం శంకరన్ కోయిల్ పరిసరాల్లో వ్యాపించింది. ఈ సమాచారం విన్న శంకరన్ కోయిల్ వరకు బస్సులో ప్రయాణించిన ఓ యువకుడి ద్వారా డ్రైవర్, కండెక్టర్‌ల దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. రోడ్డు పక్కగా భాస్కర్‌ను వదిలి పెట్టి వెళ్లిన ట్రావెల్స్ బస్సు, కండెక్టర్, డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మానవత్వం మరిచిన ఈ ఇద్దరిన కఠినంగా శిక్షించాలని ఆ ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment