‘సహకార’ సంక్రాంతి
రాష్ట్రంలో సంక్రాంతి సందడి ప్రారంభమవుతోంది. ఈమేరకు ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం సంక్రాంతి కిట్‌లను సిద్ధం చేస్తోంది. పొంగల్ పండుగకు ఉపయోగ పడే పలు రకాల వస్తువులతో ఈ కిట్ల విక్రయాలను బుధవారం ఆ శాఖ మంత్రి పెరియకరుప్పన్ చైన్నెలో ప్రారంభించారు.
సాక్షి, చైన్నె : సహకార శాఖ నేతృత్వంలోని టీయూసీఎస్ కామదేను కో– ఆపరేటివ్ స్టోర్స్, అముదం అంగాడిలలో సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక ప్యాకేజీ కిట్స్ విక్రయాలకు శ్రీకారం చుట్టారు. పొంగల్ పండుగకు ఉపయోగ పడే పలు రకాల వస్తువులతో ఈ కిట్ల విక్రయాలకు బుధవారం ఆ శాఖ మంత్రి పెరియకరుప్పన్ చైన్నెలో ప్రారంభించారు. తేనాం పేట్‌లోని స్టోర్‌లో ఈ విక్రయాలను ప్రారంభించినానంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ, పొంగల్ పండుగను తమిళ ప్రజలు నాలుగు రోజుల పాటు జరుపుకోవడం జరుగుతోందని గుర్తు చేశారు. ఈ పొంగల్ పండుగను పేదలు, సామాన్యులు, మధ్య తరగతి వర్గాలు అంటూ అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. తమ వంతుగా సహకార రంగం ద్వారా సహకారాన్ని అందించేందుకు ఈ కిట్ల విక్రయాల మీద దృష్టి పెట్టామన్నారు. సహకార పొంగల్ పేరుతో బయటి మార్కెట్‌లో కంటే తక్కువ ధరకు వివిధ వస్తువులను ఈ కిట్ ద్వారా అందిస్తున్నామన్నారు. పొంగల్ ప్యాకేజీ, సహకార ప్రత్యేక పొంగల్ ప్యాకేజీ, గ్రాండ్ పొంగల్ సేకరణ అంటూ మూడు కేటగిరీలుగా ఈ కిట్లను సిద్ధం చేశామన్నారు.
ప్యాకేజీలో ధరలు...
పొంగల్ ప్యాకేజీలో పచ్చి బియ్యం 500 గ్రాములు, బెల్లం 500 గాములు, ఏలకలు 5 గ్రాములు, జీడి పప్పు 50 గ్రామలు, ఆముదం నెయ్యి 50 గ్రా, పప్పు – 100 గ్రా, ఎండుద్రాక్ష – 50 గ్రాములతో చిన్న బ్యాగ్ ద్వారా ఏడు వస్తువులను పొంగల్ సెట్‌గా రూ.199కి అందజేయనున్నామన్నారు. ప్రత్యేక పొంగల్ ప్యాకేజీలో పసుపు పొడి–50గ్రా, చక్కెర – 500 గ్రా, కంది పప్పు – 250 గ్రా, కడలై పరుప్ప(చిక్పిస్) 100 గ్రా, పెసర పప్పు – 100 గ్రా, ఉద్ది పప్పు – 250 గ్రా,ర ఉప్పు–1 కేజీ, మిర్చి–250గ్రా, దనియా–250గ్రా, చింతపండు– 250గ్రాములు, శెనగపప్పు–200గ్రా, కారంపొడి–50గ్రా, వేరుశెనగ నూనె 1/2 లీటర్, ఆవాలు–100 గ్రా, జీలకర్ర –50 గ్రా, మిరియాలు– 25గ్రా, మెంతులు–100గ్రా, సోంపు–50గ్రా, వంటి 19 రకాల వస్తువులతో కూడిన కిటు కిరాణా బ్యాగ్‌తో పాటుగా రూ. 499కు అందించనున్నారు. అలాగే, గ్రేట్ పొంగల్ ప్యాకేజీలో పై వస్తువులతో పాటుగా గోదుమ, సాంబార్‌పొడి, కొత్తిమిర పొడి, తోట కూర పొడి, సేమియ, జొన్న తదితర అనేక వస్తువలుతో కూడిన పెద్ద ప్యాక్‌గా రూ.999కు అందించనున్నారు.ఈ ప్యాకేజీలన్నీ బయటి మార్కెట్‌లో లభించే వాటి కంటే చాలా తక్కువ ధరకు సహకార శాఖ పరిధిలోని అన్ని స్టోర్లలో , కో ఆపరేటివ్ సొసైటీ, సెల్ఫ్ సర్వీస్ యూనిట్లు, రిటైల్ అవుట్ లెట్ తదితర ప్రాంతాలలో లభిస్తాయారు. ఈ కార్యక్రమంలో సహకార, ఆహారం భద్రతా విభాగం అదనపు ప్రధాన కార్యదర్శి జే రాధాకృష్ణన్, రిజిస్టార్ సుబ్బయ్యన్, అదనపు రిజిస్టార్ గాయత్రీ కృష్ణన్, తదితరులుపాల్గొన్నారు.
ప్రత్యేక విక్రయ ప్యాకేజీకు శ్రీకారం
ప్రారంభించిన మంత్రి పెరియకరుప్పన్
Comments
Please login to add a commentAdd a comment