No Headline
సాక్షి, చైన్నె: ద్రావిడ సిద్ధంతకర్త పెరియార్‌కు వ్యతిరేకంగా నామ్ తమిళర్ కట్చి కన్వీనర్ సీమాన్ చేసిన వ్యాఖ్యలు రచ్చకెక్కాయి. ఆయన వ్యాఖ్యలను తందై పెరియార్ ద్రావిడ ఇయక్కం వర్గాలు సీమాన్ ఇంటిని ముట్టడించారు. కారు అద్దాలను పగుల కొట్టారు. వివరాలు.. నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో సమస్యలను కొని తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. అయితే, ఏమాత్రం తగ్గకుండా ఆయన తన దూకుడును ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కడలూరులో జరిగిన కార్యక్రమంలో ద్రావిడ సిద్ధాంతకర్త పెరియార్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈ సమాజానికి ఏమి చేశారోనని ప్రశ్నిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిని పెరియార్ మద్దతుదారులు, తందై పెరియర్ ద్రావిడ ఇయక్కం వర్గాలు తీవ్రంగా పరిగణించాయి. సీమాన్‌కు వ్యతిరేకంగా పలు చోట్ల ఆందోళనలకు దిగాయి. చైన్నె తిరువాన్మియూరులోని ఆయన నివాసాన్ని ఆ ఇయక్కం ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణన్ నేతృత్వంలో కార్యకర్తలు ముట్టడించారు. ఆయన ఇంటి వద్ద హంగామా చేయడమే కాకుండా కారు అద్దాలను పగుల కొట్టారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు నిరసన కారులను బలవంతంగా అరెస్టు చేశారు. గురువారం సీమాన్ పుదుచ్చేరిలో పర్యటించగా ఆయనకు వ్యతిరేకంగా అక్కడ కూడా నిరసనలు చోటు చేసుకున్నాయి. అయితే తన వ్యాఖ్యల విషయంలో సీమాన్ ఏమాత్రం తగ్గలేదు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌తో పెరియార్‌ను పోల్చవద్దని, వల్లలార్ తర్వాతే పెరియార్ అంటూ మరింతగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ పరిణామాలు మున్ముందు ఎలాంటి పరిస్థితులకు దారి తీయనున్నాయో అన్న ఉత్కంఠ తప్పడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment