Seeman Comments
-
పెరియార్‌కు వ్యతిరేకంగా సీమాన్ వ్యాఖ్యలు
సాక్షి, చైన్నె: ద్రావిడ సిద్ధంతకర్త పెరియార్‌కు వ్యతిరేకంగా నామ్ తమిళర్ కట్చి కన్వీనర్ సీమాన్ చేసిన వ్యాఖ్యలు రచ్చకెక్కాయి. ఆయన వ్యాఖ్యలను తందై పెరియార్ ద్రావిడ ఇయక్కం వర్గాలు సీమాన్ ఇంటిని ముట్టడించారు. కారు అద్దాలను పగుల కొట్టారు. వివరాలు.. నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో సమస్యలను కొని తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. అయితే, ఏమాత్రం తగ్గకుండా ఆయన తన దూకుడును ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కడలూరులో జరిగిన కార్యక్రమంలో ద్రావిడ సిద్ధాంతకర్త పెరియార్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈ సమాజానికి ఏమి చేశారోనని ప్రశ్నిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిని పెరియార్ మద్దతుదారులు, తందై పెరియర్ ద్రావిడ ఇయక్కం వర్గాలు తీవ్రంగా పరిగణించాయి. సీమాన్‌కు వ్యతిరేకంగా పలు చోట్ల ఆందోళనలకు దిగాయి. చైన్నె తిరువాన్మియూరులోని ఆయన నివాసాన్ని ఆ ఇయక్కం ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణన్ నేతృత్వంలో కార్యకర్తలు ముట్టడించారు. ఆయన ఇంటి వద్ద హంగామా చేయడమే కాకుండా కారు అద్దాలను పగుల కొట్టారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు నిరసన కారులను బలవంతంగా అరెస్టు చేశారు. గురువారం సీమాన్ పుదుచ్చేరిలో పర్యటించగా ఆయనకు వ్యతిరేకంగా అక్కడ కూడా నిరసనలు చోటు చేసుకున్నాయి. అయితే తన వ్యాఖ్యల విషయంలో సీమాన్ ఏమాత్రం తగ్గలేదు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌తో పెరియార్‌ను పోల్చవద్దని, వల్లలార్ తర్వాతే పెరియార్ అంటూ మరింతగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ పరిణామాలు మున్ముందు ఎలాంటి పరిస్థితులకు దారి తీయనున్నాయో అన్న ఉత్కంఠ తప్పడం లేదు. -
విద్వేష ప్రసంగంపై ప్రశాంత్ కిశోర్ ట్వీట్.. ఎన్టీకే నేత సీమన్పై కేసు
చెన్నై: ఉత్తరాది రాష్ట్రాల వలస కార్మికులను ఉద్దేశించి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన నామ్ తమిళర్ కచ్చి(ఎన్టీకే) నేత సెంథామిళన్ సీమన్పై తమిళనాడు ఈరోడ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ట్వీట్ అనంతరం ఈమేరకు చర్యలు తీసుకున్నారు. ఫిబ్రవరి 13న ఓ పబ్లిక్ ర్యాలీలో సీమన్ మాట్లాడుతూ.. తమిళనాడులో హిందీలో మాట్లాడేవారిని కొడతానని, ఈ దెబ్బతో వాళ్లు బ్యాగులు సర్దుకుని పారిపోతారని వ్యాఖ్యానించారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రశాంత్ కిషోర్ ఈ విషయాన్ని లేవనెత్తారు. సీమన్ విద్వేష ప్రసంగాన్ని ట్విట్టర్లో షేర్ చేసి.. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోరా? అని ప్రశ్నించారు. ఫేక్ వీడియోలతో హింస, విద్వేషం సృష్టించే వారిపై చర్యలు తీసుకున్నట్లే.. ప్రజలను రెచ్చగొట్టే ఇలాంటి వారిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఈ రోడ్ పోలీసులు సీమన్పై కేసు నమోదు చేశారు. All those who used fake videos to incite hate & violence must be dealt with as per the law. But this doesn’t absolve those who’re openly calling for violence against #Hindi speaking people in #TN Why no action against likes of @SeemanOfficial for their vitriolic utterances? pic.twitter.com/vyu2EkjBQu — Prashant Kishor (@PrashantKishor) March 10, 2023 కాగా.. తమిళనాడులో ఉత్తరాది నుంచి వచ్చిన వలసకార్మికులపై దాడులు జరుగుతున్నాయని, ఈ ఘటనల్లో ఇద్దరు చనిపోయారని వార్తలు వ్యాప్తి చెందాయి. దీంతో బిహార్ సీఎం ఈవిషయంపై విచారణకు నిజనిర్ధరణ కమిటీ కూడా వేశారు. అయితే ఇందులో వాస్తవం లేదని, ఉత్తరాది రాష్ట్రాల కార్మికులు తమకు సోదరులతో సమానమని సీఎం ఎంకే స్టాలిన్ చెప్పారు. వారికి ఎలాంటి హాని ఉండదని హామీ ఇచ్చారు. చదవండి: ఇదేం ధమ్కీరా నాయనా.. అండ్రాయిడ్ ఫోన్ ఫ్రీగా ఇచ్చి తెలివిగా రూ.లక్షలు కాజేశారు.. -
రజనీకాంత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు
‘రజనీకాంత్ ‘తలైవర్’ (నాయకుడు) అయితే మరి వారంతా ఎవరు’ అని దర్శకుడు, నామ్ తమిళర్ కచ్చి పార్టీ అధినేత సీమాన్ ప్రశ్నించారు. మహిళా పోలీసుల కథాంశంతో వి హౌస్ ప్రొడక్షన్స్ బ్యానరుపై సురేష్ కామాక్షి ‘మిగ మిగ అవసరం’ అనే సినిమాను రూపొందిస్తున్నారు. శ్రీప్రియాంక పోలీసుగా అధికారిగా, హరీష్ కుమార్ ఓ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాలో సీమాన్ పోలీసు ఉన్నతాధికారిగా నటించారు. ఇషాన్ దేవ్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. సీనియర్ దర్శకుడు భాగ్యరాజ్, దర్శకుడు చేరన్, సీమాన్, నిర్మాత జేకే రితీష్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని పాటలను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత సురేశ్ కామాక్షి మాట్లాడుతూ ‘తానెప్పుడూ చర్చనీయాంశ వ్యాఖ్యలే చేస్తానంటారని, సమస్యల గురించి మాట్లాడడం చర్చనీయాంశం అంటే తాను అలానే మాట్లాతానని’ అన్నారు. ఈ చిత్రం గురించి, పని చేసిన వారి గురించి చిత్ర సక్సెస్ మీట్లో మాట్లాడతానని సురేశ్ కామాక్షి పేర్కొన్నారు. అనంతరం సీమాన్ మాట్లాడుతూ ‘‘తలైవర్’ (అధినేత) అనే పదానికి అర్థం తెలియకుండానే ఇక్కడ ఎంతో మంది జీవిస్తున్నారు. టీవీలో చర్చావేదికలను చూస్తే అందులో పాల్గొనేవారంతా రజనీకాంత్ గురించి మాట్లాడేటప్పుడు ‘తలైవర్’తో నటించాను, ‘తలైవర్’తో మాట్లాడాను, ‘తలైవర్’ను కలిశాను అంటున్నారు. రజనీకాంత్‌ను ‘తలైవర్’ అంటూ పొగుడుతున్నారు. ఆయన ‘తలైవర్’ అయితే.. కామరాజర్ ఎవరు.. ప్రభాకరన్ ఎవరు.. అంటే వాళ్లంతా దేశ ద్రోహులా..?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రజనీకాంత్‌ని ఢీ కొట్టేందుకు రెడీ
సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో ఢీ కొట్టేందుకు నామ్ తమిళర్ కట్చి నేత, దర్శకుడు సీమాన్ సిద్ధమయ్యారు. రజనీ రాజకీయాల్లోకి ఒంటరిగా వచ్చినా, మద్దతుతో వచ్చినా ఢీ కొట్టేందుకు రెడీ అని సవాల్ విసిరారు. తమిళుడే ఈ గడ్డను ఏలాలని, ఎవరు బడితే వాళ్లు జబ్బలు చరిస్తే ఊరుకోమన్నారు. * తేల్చుకుందాం * సీమాన్ సవాల్ * తమిళుడే ఈ గడ్డను ఏలాలి సాక్షి, చెన్నై: దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్‌ను రాజకీయాల్లోకి ఆహ్వానించే విధంగా పలువురు వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాను మాత్రం రాజకీయాల్లోకి రాబోనని రజనీ స్పష్టం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సినీ దర్శకుడిగా, నటుడిగా తమిళనాట ప్రస్తానాన్ని ఆరంభించి నామ్ తమిళర్ కట్చి నేతగా ఎదిగిన సీమాన్ ఏకంగా రజనీ కాంత్‌ను టార్గెట్ చేసి సవాళ్లు విసరడం చర్చనీయాంశమైంది. ‘‘ఒంటరిగా వస్తావా..మద్దతుగా వస్తా వా.. రా...తేల్చుకుందాం’’ అంటూ వారిద్దరి మధ్య పాత పగ ఉన్నట్లు సీమాన్ వ్యాఖ్యలు చేయడాన్ని రజనీ అభిమానులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు నామ్ తమిళర్ కట్చి, రజనీ అభిమానుల మధ్య వివాదాన్ని రేపే అవకాశాలు కన్పిస్తున్నాయి. టార్గెట్ రజనీ: ఎల్టీటీఈ నేత ప్రభాకరన్ జయంతి, మహావీరుల దినోత్సవం గురువారం తిరునెండ్రయూరులోని ఓ కల్యాణ మండపంలో జరిగింది. ఇందులో సీమాన్ ప్రసంగిస్తూ రజనీ కాంత్‌ను టార్గెట్ చేసి విరుచుకు పడ్డారు. రాష్ట్రంలో ప్రభాకరన్ మహా నేత అని, ఆయన్ను మహా నేతగా ప్రతి తమిళుడు అభివర్ణించాల్సిందేనన్నారు. ఆయనకు సరి తూగే నాయకుడెవ్వరు ఇక్కడ లేరని, అందరూ తమ ఉనికిని చాటుకునేందుకు రాజకీయాల్లోకి వస్తే, తమిళ జాతి కోసం తనువు చాలించేందు కు సిద్ధపడ్డ నేత ప్రభాకరన్ అని కొనియాడారు. తమిళుల కోసం తమ పార్టీ ఆవిర్భవించిందని, తాను సీఎంను అవుతానో లేదో తనకు అనవసరం అని, తనకు తమిళ జాతి మనుగడ, సంక్షేమం, సంస్కృతి పరిరక్షణ ముఖ్యం అన్నారు. రజనీ కాంత్‌ను రాజకీయాల్లోకి రావాలని అనేక మంది ఆహ్వానిస్తుండడం విడ్డూరంగా ఉందన్నారు. తన జీవిత కాలంలో తమిళుల కోసం ఆయన ఏమి చేశారని రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నారని ప్రశ్నించారు. ఆయన్ను ఆహ్వానిస్తున్న వాళ్లంతా భజన ప్రియులేనని, తమిళ జాతి విలువ తెలియనివాళ్లేనని మండిపడ్డారు. తమిళుల కోసం సర్వాన్ని ఆర్పించిన అనేక మంది మహానుభావులు ఈ గడ్డ మీద ఉన్నారని, అలాంటి వారిని ఎందుకు రాజకీయాల్లోకి ఆహ్వానించడం లేదని ప్రశ్నించారు. తమిళుడే ఈ గడ్డను ఏలాలి అని, ఎవరిని బడితే వారిని ఆహ్వానిచ్చేయడం ఇకనైనా మానుకోండని హితవు పలికారు. ఒక వేళ రజనీ కాంత్ రాజకీయాల్లోకి వస్తే, ఒంటరిగానైనా సరే, మద్దతుగానైనా సరే ఎన్నికల్లో నిలబడితే ఢీ కొట్టేందుకు తాను రెడీ అని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఆయన అడుగు బెడితే, తొలి ప్రత్యర్థిని తానేనని, తాను ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం అని ప్రకటించారు. ఆయన వ్యాఖ్యలు నామ్ తమిళర్ కట్చి వర్గాల్ని ఉత్సాహంలో నింపినా, రజనీ అభిమానుల్లో మాత్రం ఆగ్రహాన్ని రేపుతోంది. సీమాన్ ఎల్టీటీఈ అస్త్రంతో మరింతగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు సైతం ఈ వేదిక మీద చేయడాన్ని పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పలు మార్లు వివాదాస్పద వ్యాఖ్యలతో కటకటాల్లోకి వెళ్లొచ్చిన సీమాన్‌కు తాజా వ్యాఖ్యలు ఎలాంటి చిక్కుల్ని సృష్టించబోతున్నాయో..!