రజనీకాంత్‌ని ఢీ కొట్టేందుకు రెడీ | director Seeman attacks Rajinikanth | Sakshi
Sakshi News home page

రజనీకాంత్‌ని ఢీ కొట్టేందుకు రెడీ

Published Fri, Nov 28 2014 10:18 AM | Last Updated on Sat, Sep 2 2017 5:14 PM

రజనీకాంత్‌ని ఢీ కొట్టేందుకు రెడీ

రజనీకాంత్‌ని ఢీ కొట్టేందుకు రెడీ

సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో ఢీ కొట్టేందుకు నామ్ తమిళర్ కట్చి నేత, దర్శకుడు సీమాన్ సిద్ధమయ్యారు. రజనీ రాజకీయాల్లోకి ఒంటరిగా వచ్చినా, మద్దతుతో వచ్చినా ఢీ కొట్టేందుకు రెడీ అని సవాల్ విసిరారు. తమిళుడే ఈ గడ్డను ఏలాలని, ఎవరు బడితే వాళ్లు జబ్బలు చరిస్తే ఊరుకోమన్నారు.
 
* తేల్చుకుందాం
* సీమాన్ సవాల్
* తమిళుడే ఈ గడ్డను ఏలాలి


సాక్షి, చెన్నై: దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్‌ను రాజకీయాల్లోకి ఆహ్వానించే విధంగా పలువురు వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాను మాత్రం రాజకీయాల్లోకి రాబోనని రజనీ స్పష్టం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సినీ దర్శకుడిగా, నటుడిగా తమిళనాట ప్రస్తానాన్ని ఆరంభించి నామ్ తమిళర్ కట్చి నేతగా ఎదిగిన సీమాన్ ఏకంగా రజనీ కాంత్‌ను టార్గెట్ చేసి సవాళ్లు విసరడం చర్చనీయాంశమైంది. ‘‘ఒంటరిగా వస్తావా..మద్దతుగా వస్తా వా.. రా...తేల్చుకుందాం’’ అంటూ వారిద్దరి మధ్య పాత పగ ఉన్నట్లు సీమాన్ వ్యాఖ్యలు చేయడాన్ని రజనీ అభిమానులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు నామ్ తమిళర్ కట్చి, రజనీ అభిమానుల మధ్య వివాదాన్ని రేపే అవకాశాలు కన్పిస్తున్నాయి.
 
టార్గెట్ రజనీ: ఎల్‌టీటీఈ నేత ప్రభాకరన్ జయంతి, మహావీరుల దినోత్సవం గురువారం తిరునెండ్రయూరులోని ఓ కల్యాణ మండపంలో జరిగింది. ఇందులో సీమాన్ ప్రసంగిస్తూ రజనీ కాంత్‌ను టార్గెట్ చేసి విరుచుకు పడ్డారు. రాష్ట్రంలో ప్రభాకరన్ మహా నేత అని, ఆయన్ను మహా నేతగా ప్రతి తమిళుడు అభివర్ణించాల్సిందేనన్నారు. ఆయనకు సరి తూగే నాయకుడెవ్వరు ఇక్కడ లేరని, అందరూ తమ ఉనికిని చాటుకునేందుకు రాజకీయాల్లోకి వస్తే, తమిళ జాతి కోసం తనువు చాలించేందు కు సిద్ధపడ్డ నేత ప్రభాకరన్ అని కొనియాడారు.

తమిళుల కోసం తమ పార్టీ ఆవిర్భవించిందని, తాను సీఎంను అవుతానో లేదో తనకు అనవసరం అని, తనకు తమిళ జాతి మనుగడ, సంక్షేమం, సంస్కృతి పరిరక్షణ ముఖ్యం అన్నారు. రజనీ కాంత్‌ను రాజకీయాల్లోకి రావాలని అనేక మంది ఆహ్వానిస్తుండడం విడ్డూరంగా ఉందన్నారు. తన జీవిత కాలంలో తమిళుల కోసం ఆయన ఏమి చేశారని రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నారని ప్రశ్నించారు. ఆయన్ను ఆహ్వానిస్తున్న వాళ్లంతా భజన ప్రియులేనని, తమిళ జాతి విలువ తెలియనివాళ్లేనని మండిపడ్డారు. తమిళుల కోసం సర్వాన్ని ఆర్పించిన అనేక మంది మహానుభావులు ఈ గడ్డ మీద ఉన్నారని, అలాంటి వారిని ఎందుకు రాజకీయాల్లోకి ఆహ్వానించడం లేదని ప్రశ్నించారు.

తమిళుడే ఈ గడ్డను ఏలాలి అని, ఎవరిని బడితే వారిని ఆహ్వానిచ్చేయడం ఇకనైనా మానుకోండని హితవు పలికారు. ఒక వేళ రజనీ కాంత్ రాజకీయాల్లోకి వస్తే, ఒంటరిగానైనా సరే, మద్దతుగానైనా సరే ఎన్నికల్లో నిలబడితే ఢీ కొట్టేందుకు తాను రెడీ అని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఆయన అడుగు బెడితే, తొలి ప్రత్యర్థిని తానేనని, తాను ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం అని ప్రకటించారు.

ఆయన వ్యాఖ్యలు నామ్ తమిళర్ కట్చి వర్గాల్ని ఉత్సాహంలో నింపినా, రజనీ అభిమానుల్లో మాత్రం ఆగ్రహాన్ని రేపుతోంది. సీమాన్ ఎల్‌టీటీఈ అస్త్రంతో మరింతగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు సైతం ఈ వేదిక మీద చేయడాన్ని పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పలు మార్లు వివాదాస్పద వ్యాఖ్యలతో కటకటాల్లోకి వెళ్లొచ్చిన సీమాన్‌కు తాజా వ్యాఖ్యలు ఎలాంటి చిక్కుల్ని సృష్టించబోతున్నాయో..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement