తమిళ సినిమా: తాజాగా కోలీవుడ్లో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇందులో నిజం ఎంత అన్నది పక్కన పెడితే అది రజనీకాంత్ దర్శకుడు లోకేష్ కనకరాజు కాంబినేషన్లో రూపొందనున్న చిత్రం గురించే అన్నది గమనార్హం. రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వంలో జైలర్ చిత్రంలో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరోపక్క తన కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న లాల్ సలాం చిత్రంలో రజినీకాంత్ అతిథి పాత్రను పోషిస్తున్నారు. తదుపరి జై భీమ్ చిత్రం జ్ఞానవేల్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మించే చిత్రంలో నటించడానికి కమిట్ అయ్యారు.
తాజాగా రజనీకాంత్ 171వ చిత్రం గురించి చర్చ జరుగుతోంది. ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. దీన్ని నిర్మించడానికి పలువురు నిర్మాతలు క్యూ కడుతున్నారు. అందులో నటుడు కమలహాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ సంస్థ కూడా ఉండటం విశేషం. అయితే ఇప్పుడు సన్ పిక్చర్స్ సంస్థ ఈ అవకాశాన్ని తన్నుకుపోయినట్లు సమాచారం. అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహించడానికి దర్శకుడు లోకేష్ కనకరాజ్ నిర్మాతకు ఓ కండిషన్ పెట్టినట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తనకు రూ. 40 కోట్లు పారితోషికం ఇస్తేనే రజిని చిత్రానికి దర్శకత్వం ఇస్తానని లోకేష్ కనకరాజ్ డిమాండ్ చేశారన్నదే ఆ టాక్.
అయితే అంత మొత్తం ఇవ్వడానికి సన్ పిక్చర్స్ సంస్థ సుముఖంగా లేదని, దీంతో మరో దర్శకుడితో ఈ చిత్రాన్ని చేయాలని భావించినట్లు సమాచారం. కానీ తనకు దర్శకుడు లోకేష్ కనకరాజ్ కావాలని రజనీకాంత్ పట్టుపట్టారని, దీంతో వేరే దారి లేక లోకేష్ కనకరాజ్ డిమాండ్‌కు తలొగ్గిన సన్ పిక్చర్స్ సంస్థ ఆయనకు రూ.40 కోట్లు పారితోషికం ఇవ్వడానికే సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఇందులో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment