సాక్షి, చైన్నె: ప్రభుత్వ ప్రత్యక్ష వరి కొనుగోలు కేంద్రాలలో ఎదురయ్యే సమస్యలపై రైతులు ఫిర్యాదు చేయడానికి వీలుగా వాట్సాప్ హెల్ప్‌లైన్‌ను తమిళనాడు కన్స్యూమర్ గూడ్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆదివారం ప్రకటించారు. రాష్ట్రం 2,600 కంటే అధికంగా ప్రత్యక్ష వరి కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. రోజుకు సుమారు 12,800 మంది రైతుల నుంచి సుమారు 60,000 మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేస్తున్నారు. అయితే కొన్ని కొనుగోలు కేంద్రాలలో రైతులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నట్టు, ఇక్కడి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు ఫిర్యాదులు హోరెత్తుతున్నాయి. దీంతో రైతుల కోసం 180059 93540 నంబరుతో చైన్నె ప్రధాన కార్యాలయంలో 24 గంటల హెల్త్‌లైన్‌ను అందుబాటులోకి తెచ్చారు. అలాగే అన్ని ప్రత్యక్ష వరి సేకరణ కేంద్రాల జోనల్ మేనేజర్, డైరెక్టర్ సీనియర్ రీజినల్ మేనేజర్‌ల మొబైల్ నంబర్లు కూడా అందుబాటులో ఉంచారు. ఆ ఫోన్ నంబర్లను కూడా సంప్రదించి రైతులు ఫిర్యాదులు చేయవచ్చు. ఫిర్యాదులపై తక్షణ విచారణ, న్యాయం, పరిష్కారం దిశగా అదనపు రిజిస్ట్రార్ స్థాయిలో ఒక ప్రత్యేక పర్యవేక్షణ అధికారిని నియమించారు. ఆయన ఆధ్వర్యంలో 8 కమిటీలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేశారు. అలాగే తమిళనాడు కన్స్యూమర్ గూడ్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మొబైల్ నంబర్ 94452 57000కు వాట్సాప్ ద్వారా సైతం ఫిర్యాదులు చేసే అవకాశం కల్పించారు.
నేను క్షేమంగానే ఉన్నా..!
తమిళసినిమా: ప్రముఖ హాస్యనటుడిగా, కథానాయకుడిగా పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న నటుడు యోగిబాబు. కాగా ఒక షూటింగ్‌లో పాల్గొనడానికి వెళ్లిన ఈయన ఏలగిరి నుంచి బెంగళూరు హైవే రోడ్‌లో ఆదివారం వేకువజామున చైన్నెకి కారులో ప్రయాణం చేస్తుండగా రాణిపేట, వాలాజా సమీపంలోని చెన్న సముద్రం టోల్‌గేట్ వద్ద కారు అదుపు తప్పడంతో ప్రమాదానికి గురైనట్లు అందులో ప్రయాణిస్తున్న యోగిబాబు, ఆయన అనుచరులు గాయాల పాలైనట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అయ్యింది. కాగా ఈ ప్రచారంపై నటుడు యోగిబాబు స్పందించారు. ఆయన మీడియాకు విడుదల చేసిన ఒక ప్రాంతంలో తాను ఎలాంటి ప్రమాదానికి గురి కాలేదని క్షేమంగా ఉన్నానని తెలిపారు. నిజానికి తాను పయనిస్తున్న కారు ప్రమాదానికి గురి కాలేదని, తన వెనుక చిత్ర యూనిట్ ప్రయాణం చేస్తున్న కారు పంచర్ కావడంతో ఆగిపోయిందని, అందులో ప్రయాణం చేస్తున్న వారికి కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. కాగా తాను ప్రయాణం చేస్తున్న కారు ప్రమాదానికి గురైనట్లు జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని పేర్కొన్నారు. ఇలాంటి వార్తలు విని తన మిత్రులు, సినీ ప్రముఖులు ,అభిమానులు, పత్రికల వారు పలువురు తనకు ఫోన్ చేసి విచారించారని, అలా తనపై అక్కర కలిగిన వారందరికీ ఈ సందర్భంగా తన ప్రేమతో కూడిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment