ఘనంగా అవతార దినోత్సవం
సాక్షి, చైన్నె: మేల్ మరువత్తూరు ఆది పరాశక్తి సిద్ధర్ పీఠంలో ఆథ్యాత్మిక గురువు శ్రీఅమ్మశ్రీ బంగారు అడిగళార్ జయంతి, అవతార దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం ప్రత్యేక పూజలు జరిగాయి. మేల్ మరువత్తూరులో ఆది పరాశక్తి సిద్ధర్ పీఠాన్ని నెలకొల్పి నాలుగు దశాబ్దాలకు పైగా ఆధ్యాత్మిక సేవలో నిమగ్నమైన బంగారు అడిగళార్ శివైక్యం పొందిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితులలో మేల్ మరువత్తూరు ఆది పరాశక్తి సిద్ధర్‌పీఠంలో బంగారు అడిగళార్ విగ్రహ ప్రతిష్ట గత ఏడాది జరిగింది. ఈ పరిస్థితులలో శనివారం నుంచి ఇక్కడ బంగారు సిద్ధుల 85వ అవతార దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు సిద్ధర్‌పీఠంలో ప్రత్యేక పూజలు, వెండి రథోత్సవం నిర్వహించారు. రెండో రోజు ఆదివారం గర్భగుడిలో కొలువై ఉన్న ఆదిపరాశక్తి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలంకరణలు జరిగాయి. సిద్ధర్ పీఠాన్ని రంగురంగుల దీపాలు, సప్తవర్ణ పుష్పాలతో అలంకరించారు. మంగళ వాయిద్యాలు, పూజలతో బంగారు అడిగళార్ విగ్రహ ప్రతిష్టాపన జరిగిన ప్రదేశంలో పాద పూజ అత్యంత వేడుకగా సాగింది. బంగారు రథోత్సవం నిర్వహించారు. అడిగళార్ విగ్రహానికి, అక్కడి పాద ప్రతిమకు భక్తులు పూజలు చేశారు. దీపారాధనలు, జ్యోతి పూజలు చేపట్టారు. మేల్ మరువత్తూరు ఆధ్యాత్మిక ఉద్యమం అధ్యక్షురాలు లక్ష్మీ బంగారు అడిగళార్ అధ్యక్షతన పలు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తజనం తరలి వచ్చారు. అడిగళార్ విగ్రహం వద్ద పూజలు, గర్భగుడిలో జ్ఞాన దీపం వెలిగించి పూజలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment