సాక్షి, చైన్నె: వీసీకే నేత తిరుమావళవన్ ఈ సారి డీఎంకే కూటమిలో సీట్ల చర్చకు తెర లేపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా ఆయన ఆదివారం ఓ కార్యక్రమంలో స్పందించారు. చాలీచాలని సీట్లతో కాదు.. ఇక అదనపు స్థానాలు అవసరమని ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. రాష్ట్రంలో నలుగురు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తింపును సైతం ఈ పార్టీ దక్కించుకుంది. అయితే ఈ పార్టీలో ద్వితీయ శ్రేణి నేతలు ఇటీవల కాలంగా చేస్తూ వస్తున్న వ్యాఖ్యలు వివాదాలకు దారి తీస్తున్నాయి. ఇందులో అదవ్ అర్జున ఏకంగా డీఎంకే కూటమిలో చిచ్చు పెట్టే విధంగా వ్యవహరించడంతో ఆయన బయటకు వెళ్లాల్సి వచ్చింది. మరో నేత ఒకరు సీట్లు అధికంగా ఆశించాల్సిందేనని స్పందిస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితులలో రానున్న ఎన్నికలలో తమకు సింగిల్ డిజిట్ కాదు, డబుల్ డిజిట్ సీట్లు అవశ్యం అన్నట్టుగా తిరుమా వ్యూహాలకు పదును పెట్టి ఉన్నారు. తమ బలం పెరిగిందని చాటే విధంగా డీఎంకే కూటమిలో ఈసారి అధిక సీట్లను ఆశించే దిశగా ఇప్పటి నుంచి తిరుమా స్వరం పెంచడం గమనార్హం. స్థానికంగా ఆయన స్పందిస్తూ అదనపు సీట్లు అవశ్యం, అదనపు స్థానాలలో గెలుపు అవసరమని వ్యాఖ్యలు చేశారు. అధిక సీట్ల గురించి ఈసారి స్పందించక తప్పదన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు చేయడంతో డీఎంకే కూటమిలో సీట్ల పందేరం చిచ్చు ఇప్పటి నుంచి బయల్దేరిందేమోనన్న చర్చ ఊపందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment