టీఎన్‌సీసీలో ఫిర్యాదుల హోరు
సాక్షి, చైన్నె : తమిళనాడు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ గిరీష్ చొదన్కర్ వచ్చి రాగానే గ్రూపుల రూపంలో సమస్యలు తప్పలేదు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సెల్వపెరుంతొగైకు వ్యతిరేకంగా జిల్లాల కార్యదర్శులు ఫిర్యాదులను హోరెత్తించారు. వివరాలు.. రాష్ట్ర కాంగ్రెస్‌లోని గ్రూపుల గురించి తెలిసిందే. అధ్యక్షులుగా ఎవరు ఉన్నా ఈ గ్రూపుల సమరంలో నలిగిపోవాల్సిందే. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న సెల్వ పెరుంతొగైకు సైతం గ్రూపు సెగ తప్పలేదు. పార్టీ బలోపేతం దిశగా ఆయన చేపట్టిన వినూత్న కార్యక్రమాలు, విధానాలను రచ్చకెక్కాయి. ఆయనకు వ్యతిరేకంగా 20కు పైగా జిల్లాల కార్యదర్శులు తిరుగు బావుట ఎగురవేశారు. అధ్యక్షుడిని తప్పించాల్సిందేనని ఢిల్లీ వరకు వెళ్లి అఽధిష్టానం పెద్దలకు ఫిర్యాదులు చేసి వచ్చారు. కొందరు ముఖ్య నేతలు సైతం సెల్వ పెరుంతొగైకు వ్యతిరేకంగా తెర వెనుక నుంచి పావులుకదిపే పనిలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో తమిళనాడు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా అజోయ్‌కుమార్‌ను తొలగించి ఆయన స్థానంలో కొత్త ఇన్‌చార్జ్‌గా గిరీష్ చొదన్కర్ నియమితులయ్యారు. ఆయన ఈ పదవిలో నియమితులైన తర్వాత ఆదివారం చైన్నెకు వచ్చారు. రాష్ట్ర పార్టీ నేతలతో సత్యమూర్తి భవన్‌లో సాయంత్రం నుంచి రాత్రిపొద్దు పోయే వరకు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సెల్వ పెరుంతొగై వ్యతిరేకులు ఆయన వద్ద ఫిర్యాదులు హోరెత్తించారు. అధ్యక్షుడ్ని మార్చాల్సిందేననిపట్టుబట్టినట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో సోమవారం ఆయాజిల్లాల అధ్యక్షులను కొత్త ఇన్‌చార్జ్ వేర్వేరుగా పిలిపించి మాట్లాడడం గమనార్హం. అంతర్గత సమరాన్ని కొలిక్కి తెచ్చి పార్టీ కార్యక్రమాలను విస్తృతంచేయడానికి గిరిష్ చొదన్కర్ నిర్ణయించినట్టు టీఎన్‌సీసీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment