రోడ్లపై తిరిగే ఆవులను బంధించడానికి రూ.కోటి వ్యయంతో కొట్టం
అన్నానగర్: తాంబరంలో రోడ్డుపై తిరుగుతున్న ఆవులను అడ్డుకునేందుకు రూ.కోటితో గొట్టం నిర్మిస్తామని బడ్జెట్‌లో తెలియజేశారు. తాంబరం కార్పొరేషనన్ సమావేశం మేయర్ వసంతకుమారి కమలకన్ననన్ అధ్యక్షతన డిప్యూటీ మేయర్ కామరాజ్, కమిషనర్ బాలచందర్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఫైనానన్స్ కమిటీ చైర్మన్ రమణి ఆదిమూల్ 2025, 26 సంవత్సరాలకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మేయర్ వసంతకుమారి బడ్జెట్‌ను స్వీకరించారు. రోడ్డుపై తిరుగుతున్న ఆవులను ఉంచడానికి రూ. కోటితో గొట్టం ఏర్పరచనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఈ బడ్జెట్ సమర్పణలో 71 ముఖ్యమైన అంశాలు పొందుపరిచారు. ఈ సమావేశంలో మండల కమిటీ అధ్యక్షులు డి.కామరాజ్, ఎస్.ఇంద్రన్, వి. కరుణానిధి, జయప్రదీప్ చంద్రన్, ప్రతిపక్షనేత వర్సైలెయూర్ శంకర్, 70వ వార్డు కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు.
వృద్ధురాలి మృతి
అన్నానగర్: చైన్నె సమీపంలోని బీసెంట్‌నగర్‌లోని అరండేల్ బీచ్ రోడ్ అపార్ట్‌మెంట్‌కి చెందిన త్రిలోక సుందరి (79) రిటైర్డ్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు. ఈమె భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. ఈ స్థితిలో మానసిక వ్యాధికి గురైన త్రిలోకసుందరి కనిపించకుండా పోయింది. తదనంతరం అతని కుమారుడు ఆనంద్ కన్నన్ తన తల్లి కోసం చాలా చోట్ల వెతికాడు. కానీ ఆమె ఆచూకీ తెలియలేదు. ఈ స్థితిలో త్రిలోక సుందరి అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని వాటర్ ట్యాంక్‌లో శవమై కనిపించినట్లు గురువారం సమాచారం అందింది. ఆ తర్వాత తిరువాన్మియూర్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సాయంతో వాటర్ ట్యాంక్‌లో పడి ఉన్న త్రిలోక సుందరి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం రాయపేట ప్రభుత్వ మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె నీటి తొట్టిలో ఎలా పడిపోయింది. ఎవరైనా తోసేసారా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
హత్యకేసులో
దంపతుల అరెస్టు
సేలం : కన్యాకుమారి జిల్లా అగస్తీశ్వరం సమీపంలోని కరుంకుళత్తాన్‌విలై ప్రాంతానికి చెందిన పరమేష్ (37). మాజీ ఓడ సిబ్బంది అయిన ఇతనికి, పక్క ఇంటికి చెందిన గణపతి (45) భార్య ఝాన్సీతో గొడవలు ఉన్నాయి. బుధవారం రాత్రి పరమేష్ వద్ద ఝాన్సీ, గణపతి గొడవపడ్డారు. తర్వాత కత్తితో పరమేష్‌ను నరికారు. తీవ్రంగా గాయపడిన పరమేష్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఝాన్సీ, గణపతిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరమేష్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణలో ఆస్తిపరుడైన పరమేష్‌కు ఎవరూ లేకపోవడంతో ఒంటరిగా ఉంటూ మద్యం సేవిస్తూ వచ్చారు. ఈ స్థితిలో ఝాన్సీతో పరిచయం ఏర్పడడంతో వారి మధ్య డబ్బు లావాదేవీలు ఏర్పడినట్టు తెలుస్తోంది. అదే విధంగా ఇటీవల కొన్ని రోజులుగా పరమేష్‌తో ఝాన్సీ మాట్లాడడం మానివేయడంతో అతను మద్యం తాగి వచ్చి అప్పుడప్పుడు గొడవ పడుతూ వచ్చాడు. ఈ క్రమంలో ఝాన్సీ, భర్త గణపతితో కలిసి పరమేష్‌ను హత్య చేశారు. ఆ సమయంలౌఓ పరమేష్ ముఖంపై కారం కొట్టి నరికి హత్య చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.
నవ వధువు గొంతుకోసి హత్య
● భర్త కోసం పోలీసులు గాలింపు
సేలం : మన్నార్‌కుడి సమీపంలో పరుత్తికోట్టైకు చెందిన తమిళరసన్ – రేవతి దంపతుల కుమార్తె భువనేశ్వరి (20). ఈమెకు ఒరత్తనాడు కీళవన్నిపట్టు అంబలకారన్ వీధికి చెందిన శబరి (23)తో గత ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి అకస్మాత్తుగా భువనేశ్వరి, శబరి కాపురముంటున్న ఇంటిలో నుంచి కేకలు వినిపించాయి. ఇరుగుపొరుగు వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరగా భువనేశ్వరి గొంతుకోసిన స్థితిలో రక్తపు మడుగులో పడి ప్రాణాలకు పోరాడుతూ కనిపించింది. జనం రావడం చూసిన శబరి అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం తంజావురు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స ఫలించక భువనేశ్వరి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి, పరారైన శబరి కోసం గాలిస్తున్నారు.
స్పృహ తప్పిన
లొకోపైలెట్ మృతి
సేలం : అస్సాం రాష్ట్రం దిబ్రూకర్ నుంచి నాగర్‌కోవిల్‌కు వివేక్ ఎక్స్‌ప్రెస్ రైలు వచ్చింది. ఈ రైలు ఇంజన్ డ్రైవర్, సహాయక డ్రైవర్లను మార్చారు. సహాయక డ్రైవర్‌గా కేరళకు చెందిన ప్రతీప్ (45) రైలులో ఎక్కాడు. నాగర్‌కోయిల్ నుంచి బయలుదేరిన రైలు కన్యాకుమారికి బుధవారం అర్థరాత్రి 12.15 గంటలకు చేరుకుంది. తర్వాత కన్యాకుమారి నుంచి బయలుదేరిన రైలు 1.10 గంటలకు నాగర్‌కోవిల్ రైల్వే స్టేషన్‌కు వచ్చి చేరింది. రైలు నిలిపిన తర్వాత డ్రైవర్ ప్రతీప్ రైలు నుంచి కిందికి దిగాడు. అప్పుడు అకస్మాత్తుగా ప్రతీప్ స్ఫృహతప్పి కింద పడిపోయాడు. రైల్వే పోలీసులు ప్రతీప్‌ను హుటాహుటిన ఆచారిపల్లం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే ప్రతీప్ మృతి చెందినట్టు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment