క్లుప్తంగా
బీజేపీ సంతకాల సేకరణకు మద్దతు
–అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే సస్పెన్షన్
తిరువళ్లూరు: త్రిభాషా అమలుకు మద్దతు కోరుతూ బీజేపీ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని మద్దతు తెలపడంతో పాటు సంతకం చేసిన అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే, యూనియన్ కార్యదర్శి కేఎస్ విజయకుమార్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో త్రిభాషా విధానాన్ని అమలుకు మద్దతుగా బీజేపీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే బీజేపీ ఆధ్వర్యంలో తిరువళ్లూరు జిల్లా మంజాకారణి వద్ద సంతకాల సేకరణ చేశారు. ఈ సమయంలో మాజీ ఎమ్మెల్యే, అన్నాడీఎంకే నేత విజయకుమార్ పాల్గొని సంతకాలు చేశారు. ఈ విషయం రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపింది. బీజేపీ, అన్నాడీఎంకే లోపాయికారి ఒప్పందం కారణంగా అన్నాడిఎంకే నేతలు సంతకాల సేకరణకు మద్దతు ఇస్తున్నారని డీఎంకే నేతలు ఆరోపణలు చేయడం ప్రారంభించారు. ఈ వ్యవహరం అన్నాడీఎంకే అధిష్టానానికి తలనొప్పిగా మారడంతో విజయకుమార్‌ను యూనియన్ కార్యదర్శితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళనిస్వామి ఉత్తర్వులు జారీ చేశారు.
మున్సిపాలిటీ బిల్ కలెక్టర్ అరెస్టు
తిరువళ్లూరు: ఇంటి పన్ను తక్కువగా మదింపు చేయడానికి లంచం తీసుకుంటూ మున్సిపాలిటీ బిల్ కలెక్టర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. తిరువళ్లూరు జిల్లా తిరునిండ్రవూర్ ప్రాంతానికి చెందిన విశ్రాంతి పొందిన ఉద్యోగి మాయాండి. ఇతడి కోడలు తమిళ్‌సెల్వి తిరునిండ్రవూర్ తిరువెంగడం నగర్‌లో ఇంటిని నిర్మించుకున్నారు. ఇటీవల ఇల్లు నిర్మాణం పూ ర్తయిన క్రమంలో ఇంటి పన్ను చెల్లింపునకు మున్సిపాలిటీ అధికారులను ఆశ్రయించాడు. ఈ సమయంలో బిల్ కలెక్టర్ షణ్ముగం ఇంటిని పూర్తిగా పరిశీలించిన తరువాతే మొత్తాన్ని నిర్ణయిస్తామని చెప్పడంతో ఇందుకోసం తమిళ్‌సెల్వి వేచి ఉన్నారు. ఈ క్రమంలో ఇంటిని కొలత వేసిన తరువాత బిల్ కలెక్టర్ షణ్ముగం ఇంటి యజమానులతో పన్నును తక్కువగా మదింపు చేయడానికి రూ.15 వేలు లంచం డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే మొదట శుక్రవారం ఉదయం బిల్ కలెక్టర్ షణ్ముగం రూ.5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. అనంతరం అతడ్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
15 కిలోల గంజాయి పట్టివేత
– ఒకరి అరెస్టు
తిరువళ్లూరు: ఆంధ్రా నుంచి గంజాయిని తీసుకొచ్చి విక్రయించడానికి యత్నించిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి 15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తిరువళ్లూరు జిల్లా పూందమల్లి సమీపంలోని చెన్నీర్‌కుప్పం వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా వచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. విచారణలో పట్టుబడిన వ్యక్తి పశ్చిమబెంగాల్‌కు చెందిన ప్రశాంత్‌బిశ్వాస్(32)గా గుర్తించారు. ఇతడు ఆంధ్రా నుంచి గంజాయిని తీసుకొచ్చి యువతే లక్ష్యంగా విక్రయిస్తున్నట్టు నిర్ధారించారు. ఇతడి నుంచి 15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, అతన్ని అరెస్ట్ చేసి నిందితుడిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు.
హత్య కేసులో ముగ్గురి అరెస్ట్
తిరువొత్తియూరు: న్యాయవాది హత్య కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. రామనాథపురం జిల్లా ముద్దుగులత్తూరు తాలూకా విక్రవాండిపురంలోని వల్లరసు గ్రామానికి చెందిన ఇరులాండి కుమారుడు ఉత్తరకుమార్ (35) న్యాయవాది. గురువారం రాత్రి ఉత్తరకుమార్ ఇంటి నుంచి సోదరి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ సమయంలో హెల్మెట్‌లు ధరించి బైక్‌లో వచ్చిన ముగ్గురు వ్యక్తుల కత్తులతో దాడి చేసి ఉత్తరకుమార్‌ను హత్య చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హత్య కేసుకు సంబంధించి రామనాథపురంలో పరమక్కుడి వైగై నగర్‌కు చెందిన దీనదయాళన్, అబ్దుల్ కలాం, కిరణ్ అనే ముగ్గురిని గురువారం రాత్రి పరమక్కుడినగర్ పోలీసులు అరెస్టు చేశారు.
క్లుప్తంగా
క్లుప్తంగా
Comments
Please login to add a commentAdd a comment