
దద్దరిల్లిన ప్రభుత్వాస్పత్రి
తిరుత్తణి: రోడ్డు ప్రమాద మృతుల కుటుంబసభ్యుల ఆందోళన, రోదనలతో శనివారం తిరుత్తణి ప్రభుత్వాస్పత్రి దద్దరిల్లింది. ప్రభుత్వం మంజూరు చేసిన ఎక్స్‌గ్రేషియా స్వీకరించేందుకు మృతుల కుటుంబాల సభ్యులు నిరాకరించి, ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఎక్స్‌గ్రేషియా పెంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో ఆస్పత్రి ప్రాంగణంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తిరుత్తణి సమీపంలోని కేజీ.కండ్రిగ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో 30 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.3లక్షలు, తీవ్ర గాయాలుపాలైన వారికి రూ.లక్ష, స్వల్ప గాయాలైన వారికి రూ. 50 వేలు ఎక్స్‌గ్రేసియాగా ప్రకటించింది. ఈ మొత్తం పంపిణీ చేసేందుకు శనివారం మధ్యాహ్నం మంత్రి నాజర్, కలెక్టర్ ప్రతాప్ ఆస్పత్రికి చేరుకున్నారు. మృతుల కుటుంబాల సభ్యులతో చర్చించి, ఎక్స్‌గ్రేషియా పంపిణీకి ముందుకు వచ్చారు. అయితే ప్రభుత్వ సాయం స్వీకరించేందుకు బాధితులు నిరాకరించారు. తమ కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగంతోపాటు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు వారికి నచ్చజెప్పి బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందజేశారు. అయితే బాధితుల కుటుంబాల సభ్యులు కొంత సేపటికే తమ కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం, ఎక్స్‌గ్రేషియా పెంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆస్పత్రి ఎదుట బైఠాయించి, ఆందోళన చేపట్టారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆందోళనకారులతో ఆర్డీఓ దీప, డీఎస్పీ కందన్ చర్చలు జరిపారు. అయినా వారు ఆందోళన విరమించక భీష్మించి కూర్చున్నారు. దీంతో తిరుత్తణి ఆస్పత్రి ఆవరణలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఈ క్రమంలో 13 మంది మహిళలసహా 168 మందిని పోలీసులు అరెస్టు చేసి వాహనాల్లో పోలీసుల బస కేంద్రానికి తరలించారు.
టిప్పర్ డ్రైవర్ అరెస్టు
ప్రమాదానికి కారణమై, పరారీలో ఉన్న టిప్పర్ డ్రైవర్ తిరువళ్లూరుకు చెందిన భాస్కరన్ (53) అనే వ్యక్తిని తిరుత్తణి పోలీసులు శనివారం ఉదయం అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగం, ఎక్స్‌గ్రేషియా పెంచాలని డిమాండ్
ప్రభుత్వాస్పత్రి ఆవరణలో ఉద్రిక్తత
13 మంది మహిళలసహా 168 మంది అరెస్టు

దద్దరిల్లిన ప్రభుత్వాస్పత్రి
Comments
Please login to add a commentAdd a comment