దేశ రక్షణకు.. సగర్వంగా..!
ఓటీఏ అధికారులను
సత్కరిస్తున్న జాన్సన్
పి. మాథ్యూ పరమ్
సాక్షి, చైన్నె: ఓ సంవత్సర కాలం కఠోర ఆర్మీ శిక్షణను ముగించుకున్న యువ అధికారులు దేశ సేవకు తమను అంకితం చేసుకున్నారు. వీరిలో 24 మంది వీరనారీమణులు ఉన్నారు. ఇక సరిహద్దుల్లో విధుల నిమిత్తం చైన్నె నుంచి యువ అధికారులు శనివారం బయలుదేరి వెళ్లారు. ముందుగా ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో జరిగిన పరేడ్‌లో తమ ప్రతిభను చాటుకున్నారు. వివరాలు.. చైన్నెలోని ఆర్మీ అధికారుల శిక్షణ అకాడమీ నుంచి ఏటా 100 మందికి పైగా యువ అధికారులు దేశ సేవకు అంకింతం అవుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మొత్తం 133 మంది ఆఫీసర్ క్యాడెట్లు, 24 ఆఫీసర్ క్యాడెట్లు (మహిళలు) భారత సైన్యం సేవలకు ఎంపికయ్యారు. అలాగే మరో ఐదు స్నేహపూర్వక విదేశీ దేశాల నుండి ఐదుగురు ఫారిన్ ఆఫీసర్ క్యాడెట్లు ఏడుగురు ఫారిన్ ఆఫీసర్ క్యాడెట్లు (మహిళలు) తమ శిక్షణ, కోర్సును ఓటీఏలో విజయవంతంగా పూర్తి చేశారు. అంతర్జాతీయ సరిహద్దులలో స్నేహం, సహకార బంధాలను పెంపొందించేందుకు సిద్ధమయ్యారు. శిక్షణ ముగించి, దేశసేవకు తమను అంకితం చేసుకునే విధంగా శనివారం వీరి పరేడ్ జరిగింది. ఓ సంవత్సర శిక్షణ కాలంలో వీరు నేర్చుకున్న సాహసనాలను ఇందులో ప్రదర్శించారు. సెయింట్ థామస్ మౌంట్‌లోని ఓటీఏ అకాడమీ ఆవరణలో ఉన్న పరమేశ్వరన్ డ్రిల్ స్క్వైర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో యువ అధికారులు ఆహుతుల్ని మెప్పించారు. పరేడ్ అనంతరం దేశ సేవకు తమను అంకితం చేసుకుంటూ ప్రతిజ్ఞ చేశారు. దేశానికి నిస్వార్థ సేవ అందిస్తామని, విలువలకు కట్టుబడి ముందుకు సాగుతామన్న నినాదాల్ని యువ అధికారులు మార్మోగించారు. మంత్రముగ్ధులను చేసే మార్షల్ ట్యూనన్‌లకు అనుగుణంగా ఆఫీసర్ క్యాడెట్‌ల కవాతు ప్రేక్షకులను ఆకట్టుకుంది. శిక్షణ నైపుణ్యంతో థ్రిల్లింగ్ కంబైనడ్ డిస్‌ప్లే విన్యాసాలను నిర్వహించారు. అకాడమీ హార్స్ రైడింగ్ క్లబ్ క్యాడెట్‌లు, రైడింగ్ ఇనన్‌స్ట్రక్టర్‌లచే ఈక్వెస్ట్రియన్ డిస్‌ప్లేతో ప్రదర్శన జరిగింది. నైపుణ్యాలను చాటే విధంగా ఉత్కంఠభరితమైన యుక్తులను క్యాడెట్లు ప్రదర్శించారు. వీక్షకులలో ఉత్సాహాన్ని నింపే విధంగా క్యాడెట్లు, ఫిజికల్ ట్రైనింగ్ ఇనన్‌స్ట్రక్టర్‌లచే చక్కటి సమన్వయంతో కూడిన ప్రదర్శనలను అందించారు. పాసింగ్ అవుట్ పరేడ్‌ను ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ జాన్సన్ పి మాథ్యూ పరమ్ విశిష్ట సేవా పతకం, ఉత్తమయుద్ధ సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, విశిష్ట సేవా పతకాలను సమీక్షించారు.
దేశ సేవకు..
శనివారం శిక్షణ ముగించుకుని సర్టిఫికెట్లను అందుకుని దేశ సేవకు పయనం అయ్యే రీతిలో పరేడ్ జరిగింది. శిక్షణలో ఆరి తేరిన వీరంతా యువ అధికారుల హోదాతో భారత సైన్యంలో వివిధ సేవలు అందించేందుకు కదిలారు. శిక్షణ సమయంలో అత్యుత్తమ పనితీరు ప్రదర్శించిన శిక్షణాధికారులను మాథ్యూ పరమ్ సత్కరించారు. బీఓయూ మన్య ఎం. కుమార్‌కు స్వోర్డ్ ఆఫ్ హానర్, వెండి పతకం, ఏయూఓ ప్రగతి ఠాకూర్‌కు ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమి గోల్డె మెడల్, ఏసీఏ సుర్జీత్ యాదవ్‌కు కాంస్య పతకం ప్రదానం చేశారు. అలాగే యువ అధికారులకు నియామక ఉత్తర్వుల పంపిణీకి సంబంధించి ‘స్టార్స్’ గుర్తింపు అందజేశారు. కొత్తగా ఆర్మీ సేవకు ఎంపికై న వారి ఆదర్శవంతమైన విజయాలను ఈ సందర్భంగా మాథ్యూ ప్రశంసించారు, కొత్తగా నియమించబడిన అధికారులు ’దేశానికి నిస్వార్థ సేవ’ అనే కార్డినల్ సైనిక విలువలను, అన్ని ప్రయత్నాలలో శ్రేష్ఠతను స్థిరంగా సాధించాలని పిలుపునిచ్చారు. కాగా కొత్తగా నియమితులైన అధికారులు, తమ ర్యాంకులు, రెజిమెంటల్ దుస్తులు ధరించి, దేశ గౌరవాన్ని కాపాడడానికి ’గౌరవంగా సేవ చేయడానికి’ కట్టుబడి, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ పోర్టల్స్ నుంచి బయటకు అడుగుపెడుతూ దేశం, భారత రాజ్యాంగం పట్ల విధేయత చూపిస్తూ ప్రమాణం చేశారు. కాగా ఈసారి దేశ సేవకు పయనమైన వారిలో వీర నారీల సంఖ్య అధికంగా ఉండడం విశేషం. వీరిలో కొందరు ఆర్మీలో సేవలు అందించిన వీర మరణం పొందిన వీరుల కుటుంబాలకు చెందిన వారు, వారి సతీమణులు సైతం ఉన్నారు. తమ వారి అడుగు జాడలలో దేశ సేవకు తమను ఈ వీర నారీమణులు అంకితం చేసుకున్నారు.
ఆర్మీ సేవకు యువ అధికారులు
సరిహద్దులకు పయనం
ఓటీఏలో పరేడ్
పెరిగిన వీరనారీల సంఖ్య
దేశ రక్షణకు.. సగర్వంగా..!
Comments
Please login to add a commentAdd a comment