ఉభయ సభల్లో సమరం
లోక్‌సభ, రాజ్యసభలలో డీఎంకే ఎంపీలు సమర భేరి మోగించేందుకు సిద్ధమయ్యారు. ఇతర రాష్ట్రాల ఎంపీల మద్దతు కూడగట్టుకునేందుకు నిర్ణయించారు. త్రిభాషా విధానానికి వ్యతిరేకంగా, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా కేంద్రంతో ఢీ కొట్టేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు ఆదివారం చైన్నెలో జరిగిన డీఎంకే ఎంపీల భేటీలో పలు తీర్మానాలు చేశారు.
● హక్కుల పరిరక్షణ కోసం గళం ● ఇతర రాష్ట్రాల ఎంపీల మద్దతు కూడగట్టుకునేందుకు నిర్ణయం ● త్రిభాషా, పునర్విభజనకు వ్యతిరేకంగా గళం ● డీఎంకే ఎంపీల సమావేశంలో తీర్మానం
సమావేశంలో స్టాలిన్, టీఆర్‌బాలు, కనిమొళి తదితరులు
సాక్షి, చైన్నె : సోమవారం నుంచి లోక్‌సభ సెషన్స్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇందులో డీఎంకే ఎంపీలు వ్యవహరించిన అంశాల గురించి సుదీర్ఘ చర్చ ఆదివారం జరిగింది. తేనాంపేటలోని డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలోని మురసోలి మారన్ సమావేశ మందిరంలో లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ సమావేశమయ్యారు. కొన్ని గంటల పాటూ జరిగిన ఈ భేటీకి ఎంపీలు టీఆర్‌బాలు, కనిమొళి, రాజ, దయానిధి మారన్, తిరుచ్చి శివ, జగద్రక్షకన్, తమిళచ్చి తంగ పాండియన్, ఆర్‌ఎస్ భారతీ, టీకేఎస్ ఇళంగోవన్,తదితరులు హాజరయ్యారు. లోక్‌సభ, రాజ్యసభలలో ఎంపీలు ప్రస్తావించాల్సిన అంశాలు, ప్రధానంగా తెర మీదకు తీసుకు రావాల్సిన ప్రశ్నలు, కేంద్రంతో ఢీకొట్టే విధంగా ముందుకు సాగే రీతిలో అస్త్రాలను సిద్ధం చేసుకున్నారు. తమిళనాడు హక్కులను పరిరక్షించే విధంగా పార్లమెంట్ వ్యవహారాలను స్తంభింపజేయడానికి వ్యూహరచన చేశారు. ఇందుకోసం ఇండియా కూటమి ఎంపీలతో పాటూ దక్షిణ భారతదేశంలోని ఎంపీల మద్దతును కూడగట్టుకునే దిశగా నిర్ణయించారు. ఒక్కో ఎంపి వ్యవహరించాల్సిన అంశాలతో పాటూ సభలోనే ప్రతి ఒక్కరూ ఉండే విధంగా, రాష్ట్ర హక్కులపై నిరంతర పోరాటాలు ఢిల్లీ వేదికగా సాగించేదిశగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం డీఎంకే కార్యాలయం ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తీర్మానాలుగా ప్రకటించాయి.
మద్దతుతో..
పునర్విభజన కారణంగా సీట్లు కోల్పోయే ఇతర రాష్ట్రాలతో కూడా ఐక్యంగా ఉండి, వారి మద్దతును కూడగట్టుని కలిసి పోరాడే విధంగా తీర్మానం చేశారు. డీలిమిటేషన్ పరిణామాలు తమిళనాడు చట్టబద్ధమైన హక్కులను ప్రభావితం చేస్తాయని, అందుకే జనాభా నియంత్రణ కారణంగా లోక్‌సభ స్థానాలను కోల్పోయే ప్రమాదం ఉన్న 7 రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, పంజాబ్‌లోని రాజకీయ పార్టీలను ఏకం చేసి పోరాట రంగంలోకి తీసుకురావడానికి కూటమి పార్టీల పార్లమెంటేరియన్లతో కలిసి తాము బాధ్యత తీసుకుంటామని డీఎంకే పార్లమెంటేరియన్లు స్పష్టం చేశారు. తమిళనాడులో గతంలో ఎన్నడూ లేని విధంగా, డీలిమిటేషన్ అంశంలో న్యాయం కోసం ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రికి మద్దతు గా, హక్కులను కాపాడే ధార్మిక ప్రయత్నంలో ఏమాత్రం తగ్గకుండా ముందుకెళ్తామని ఎంపీలు ప్రతిజ్ఞ చేశారు. నియోజకవర్గ పునర్విభజనలో రాష్ట్ర హక్కులను కాపాడటానికి తాము ఇతర పార్లమెంట్ సభ్యులతో కలిసి అడుగుల వేస్తామని, సోమ వారం నుంచి జరిగే పార్లమెంటరీ బడ్జెట్ సమావేశాల రెండవ సెషన్స్‌ల ఢిల్లీ వేదికగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి కట్టుబడి ఉన్నామని, మిత్రపక్ష సభ్యులు, ఇండియా అలయన్స్ సభ్యులు, అందరు ఎంపీలను ఒకచోట చేర్చడమే కాకుండా, రాష్ట్రాల హక్కులను కాపాడటానికి, పునర్విభజన ప్రభావిత రాష్ట్రాల సీట్ల సంఖ్య, నిష్పత్తిని కాపాడటానికి ఏమాత్రం తగ్గబోమని తీర్మానం చేశారు.
పోరాటం ఆగదు: సీఎం
అంతకు ముందు ఈ సమావేశంలో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, డీఎంకే అఖిల పక్షం భేటీ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చకు దారితీస్తోందని, ప్రస్తుతం అందరి దృష్టి డీఎంకే కార్యాచరణ వైపుగా మరలి ఉన్నట్టు వ్యాఖ్యానించారు. పునర్విజన ప్రభావానికి గురి అయ్యే ఏడు రాష్ట్రాలలోని 29 పార్టీల నేతలకు, సీఎం, మాజీ సీఎంలకు తాను లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. ఒక్కోరాష్ట్రానికి డీఎంకే తరపున ఒక ఎంపీ, ఒక మంత్రి వెళ్లి పునర్విభజన ప్రక్రియ వల్ల జరగబోయే నష్టాలను ఆయా పార్టీల నేతలను కలిసి వివరించే విధంగా కార్యాచరణ సిద్ధచేశామన్నారు. ఇది ప్రారంభం మాత్రమే అంటూ, హక్కుల సాధనలో పూర్తిగా విజయంసాధించే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కేంద్రం చేస్తున్న కుట్రలు, రచిస్తున్న వ్యూహాలన్ని తిప్పి కొట్టి తీరుతామని ఇందుకోసం ఎంపీలందరూ కలిసి కట్టుగా పనిచేయాలని పిలుపు నిచ్చారు.
తీర్మానాలు ఇవే..
ఉదయం 10.30 గంటల నుంచి కొన్ని గంటల పాటుగా జరిగిన డీఎంకే పార్లమెంటరీ సభ్యుల సమావేశంలో ఆమోదించినట్టుగా పేర్కొంటూ తీర్మానాలు ప్రకటించారు. తమిళనాడు లోక్‌సభ నియోజకవర్గాలను పరిరక్షించుకునే విధంగా పార్లమెంట్, రాజ్యసభలలో తమ గళాన్ని, స్వరాన్ని పెంచేందుకు తీర్మానించారు. తమిళనాడు ప్రయోజనాలను పరిరక్షించడమే కాకుండా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల హక్కుల సంరక్షణ కోసం కూడా గళాన్ని వినిపించనున్నారు. సీఎం స్టాలిన్ మార్గ దర్శకత్వంలో భారత పార్లమెంట్‌లో తమ గొంతుకను బలంగా వినిపిస్తామని హామీ ఇచ్చారు. తమిళనాడుకు నిధుల పంపిణీలో నిరంతరం వివక్ష చూపుతూ, అనేక రంగాలలో తమిళనాడు సాధించిన పురోగతికి ఆధారమైన ద్విభాషా విధానానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను ఖండించారు. హిందీని బలవంతంగా రుద్దడానికి చేస్తున్న ప్రయత్నాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడును నిరంతరం మోసం చేస్తున్న బీజేపీ పాలకులు, ప్రస్తుతం జనాభా ఆధారిత నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణకు స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా గందరగోళం సృష్టిస్తున్నట్టు ధ్వజమెత్తారు. జనాభా నియంత్రణ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసిన తమిళనాడు వంటి దక్షిణ భారత రాష్ట్రాలకు ప్రస్తుతం కుట్ర పూరితంగా పార్లమెంటరీ సీట్ల సంఖ్యను తగ్గించే ప్రయత్నంలో ఉన్నారని మండిపడ్డారు. బీజెపి కుట్రను స్పష్టంగా గ్రహించి, ఈ అంశాన్ని అస్త్రంగా చేపట్టి ఒక్క తమిళనాడే కాదు, దక్షిణ భారత దేశంలోని రాష్ట్రాలను ఏకం చేసే విధంగా ముందుకెళ్తున్న సీఎం స్టాలిన్‌ను అభినందించారు. నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణ అంశంపై ముఖ్యమంత్రి చేపట్టే అన్ని ప్రయత్నాలకు పూర్తిగా మద్దతు ఇస్తామని ఎంపీలు ప్రకటించారు. అలాగే ఈ అంశాలను పార్లమెంటులో తెర మీదకు తెచ్చి తమిళనాడులో ఒక్క పార్లమెంటరీ సీటు కూడా తగ్గకుండా చూసుకోవడంలో, పార్లమెంటులో తమిళనాడుకు చెందిన సీట్ల నిష్పత్తిని కొనసాగించడంలో విజయం సాధించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment