● ఇఫ్తార్ విందు
రంజాన్ ఉపవాస దీక్షల్లో భాగంగా ఎంజీఆర్ యువజన విభాగం సంయుక్త కార్యదర్శి డాక్టర్ సునీల్ నేతృత్వంలో టీ నగర్‌లోని కార్యాలయంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం జరిగింది. అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ తమిళ్ మగన్ హుస్సేన్, మాజీ ఎంపీ జయవర్దన్, హాజీ బషీర్ అహ్మద్, డాక్టర్ ఉమర్ షరీఫ్, షనావాజ్, జాకీర్ హుస్సేన్, జమాల్ బాయ్, ఎంపీ ముస్తఫా, మైనారిటీ నేతలు, టీనగర్‌లోని అన్నాడీఎంకే నేతలు, ముస్లింలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. – సాక్షి, చైన్నె
● రివార్డు
చైన్నెలో గంటల వ్యవధిలో చైన్ స్నాచర్లను పట్టుకున్న విమానాశ్రయ పోలీస్ ఇన్‌స్పెక్టర్ పాండిని తన కార్యాలయానికి బుధవారం పిలిపించి కమిషనర్ అరుణ్ రివార్డుతో సత్కరించారు. – సాక్షి, చైన్నె
ట్రాఫిక్ జరిమానాలు రూ.2,800 కోట్లు
● రవాణా శాఖ కమిషనర్ చుంజోంగ్
కొరుక్కుపేట: వివిధ ఉల్లంఘనలకు సంబంధించి ట్రాఫిక్ పోలీసులు విధించిన రూ.2,800 కోట్లు జరిమానాలు ఇంకా వసూలు కాలేదని రవాణా శాఖ కమిషనర్ చుంజోంగ్ ఖమ్ జడక్ తెలిపారు . తమిళనాడులోని రహదారి భద్రత పటిష్టతకు సంబంధించి కార్యచరణ ప్రణాళికల రూపకల్పనపై సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, గత ఏడాది తమిళనాడులో 18,347 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారని, ఒక్క చైన్నెలోనే 504 మంది చనిపోయారని వెల్లడించారు. రోడ్డు భద్రత విషయంలో తమిళనాడు అగ్రగామిగా ఉందని, 2030 నాటికి రోడ్డు ప్రమాదాలను 50 శాతం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ దిశగా ఒడిశా, ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న పద్ధతులను అధ్యయనం చేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు.
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లన్నీ నిండాయి. క్యూలైన్ ఎంబీసీ వద్దకు చేరుకుంది. మంగళవారం అర్ధరాత్రి వరకు 64,252 మంది స్వామివారిని దర్శించుకోగా 25,943 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.68 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలాఉండగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది.
● ఇఫ్తార్ విందు