మేక తలతో పోలీస్ స్టేషన్‌కు..!
● చోరీ చేసి వధించారని ఫిర్యాదు ● కసాయి దుకాణం యజమాని అరెస్ట్
అన్నానగర్: తాను పెంచుకుంటున్న మేకను చోరీ చేసి కసాయి దుకాణంలో వధించి ఉండడంతో రగిలిపోయిన ఓ మహిళ తిన్నగా ఆ మేకను తలను తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. కసాయి దుకాణం యజమానిని అరెస్ట్ చేయాలని ఫిర్యాదు చేసింది. వివరాలు..నాగై సమీపంలోని ఉత్తర బొయికై నల్ ఊరు కు చెందిన పూంగోడి (31 ఓ మేకను పెంచుకుంటోంది. మంగళవారం ఆ మేక చోరీకి గురైంది. దీంతో పూంగోడి నాగైలోని పలు మటన్ షాపుల్లో గాలించింది. నాగై కల్లార్ ప్రాంతంలోని ఓ మాంసం దుకాణంలో తన మేకను వధించి, దాని తలను వేరు చేసి ఉండడం చూసి రగిలిపోయింది. స్టోర్ మేనేజర్‌ను నిలదీసింది. మేక తలను తీసుకుని నాగై టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కసాయి దుకాణం యజమాని సేదు అహ్మద్‌ను అరెస్టు చేశారు.