
వీధినాటక కళలను పోషించాలి
తిరువళ్లూరు: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీధినాటక కళాకారులు క్రమశిక్షణతో తమ కళలను ప్రోత్సహించాలని తమిళనాడు వీధినాటక కళాకారుల సంఘం రాష్ట్ర అద్యక్షుడు కానై సత్యరాజ్ సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ కళాకారుల మహానాడును నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగానే తిరువళ్లూరు పట్టణంలోని కళాసంఘం మైదానంలో మహానాడును శనివారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు వీధినాటక కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేషన్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు కానై సత్యరాజ్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా సత్యరాజ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 13 లక్షల మంది కళాకారులు ఉన్నారని తెలిపారు. అయితే వీరిలో 50 శాతం మంది కూడా సంక్షేమ బోర్డులో తమ పేర్లును నమోదు చేసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని ప్రతి కళాకారుడు తమ పేర్లును సంక్షేమ బోర్డులో నమోదు చేసుకోవాలని కోరారు. అర్హులైన వారు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వీధి నాటకాల సమయంలో మద్యం సేవించి వృత్తికి కళంకం తేవద్దన్నారు. క్రమశిక్షణతో కళలలను ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం వీధినాటక కళాకారులకు ఉచిత బస్‌పాసు, అర్హులైన వారికి పింఛన్, కళాకారులు మృతి చెందితే వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం మహానాడులో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన కళాకారులకు ఆయన సర్టిఫికెట్‌లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రూబన్, రజినికాంత్ జిల్లా ఉన్నత కమిటీ సంబత్, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి బాబు, ఉపాధ్యక్షురాలు ధనలక్ష్మి, ఉపకార్యదర్శి రమేష్, సోమసుందరం, సలహాదారుడు అయ్యప్పన్, నివేదిత తదితరులు పాల్గొన్నారు.