
ఆగస్టు నుంచి నెల వారీ విద్యుత్ లెక్కింపు
● ప్రభుత్వం కసరత్తు ● వడ్డనకు సైతం జూలైలో ఛాన్స్
సాక్షి, చైన్నె: అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాన్ని నాలుగేళ్ల తర్వాత అమలు చేయడానికి డీఎంకే సర్కారు కసరత్తులు చేపట్టింది. ఆగస్టు నుంచి లెక్కింపునకు అవకాశాలు ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి.అ దే సమయంలో జూలైలో చార్జీల వడ్డకు అవకాశం ఉన్నట్టుసంకేతాలు వెలువడ్డాయి. వివరాలు.. రాష్ట్రంలో రోజు రోజుకు విద్యుత్ వాడకం పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో 2014లో విద్యుత్ చార్జీలను వడ్డించారు. ఆతర్వాత విద్యుత్ చార్జీలు పెరగలేదు. 2016 ఎన్నికల అనంతరం 100 యూనిట్ల ఉచిత పథకం అమల్లోకి రావడంతో పాటుగా ఇతర వ్యయాలు పెరగడంతో విద్యుత్ బోర్డుకు కష్టాలు ఎదురై అప్పులు అమాంతంగా పెరిగాయి. దీంతో చార్జీల వడ్డనపై విద్యుత్ బోర్డు కసరత్తు చేసింది. 2022 సెప్టెంబర్‌లో డీఎంకే ప్రభుత్వం చాక చక్యంగా విద్యుత్‌చార్జీలను పెంచే రీతిలో వడ్డనమోత మోగించింది. అలాగే 2027 వరకు ఏటా జూలైలలో చార్జీలను పెంచే దిశగా విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ దిశగా 2023లో చార్జీల వడ్డన మోపినా, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో డీఎంకే పాలకులు ముందు జాగ్రత్తలలో పడ్డారు. గృహాలకు మాత్రం పెంపును రద్దు చేస్తూ, ఆ భారాన్ని భర్తీ చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లోక్ సభ ఎన్నికలు ముగియగానే చడీ చప్పుడు కాకుండా, 4.83 శాతం పెంపు వడ్డను మోగించారు.
ఆగస్టులో నెలవారీ వసూళ్లు..
రాష్ట్రంలో రెండు నెలలకు ఒక పర్యాయం విద్యుత్ యూనిట్ల లెక్కింపు జరుగుతోంది. ఈ కారణంగా విద్యుత్ చార్జీలు అధికంగానే చెల్లించాల్సి ఉంది. 100 యూనిట్లకు ఒక చార్జీ ఆ పైన ఒక్కో వంద చొప్పున యూనిట్ పెరిగే కొద్ది అధిక చార్జీ చెల్లించుకోవాల్సిన పరిస్థితి వినియోగ దారులకు ఉంది. రెండు నెలల అనేది ఒక నెలకు తగ్గించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచే ఉంది. 2021 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో డీఎంకే నెల వారీ విద్యుత్ లెక్కింపు, చార్జీల వసూళ్ల ప్రకటన చేసినా అమలు చేయలేదు. తాజాగా రాష్ట్రంలో నెలకొంటున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 2026లో మళ్లీ అధికారం కోసం ప్రయత్నాలలో ఉన్న డీఎంకే నెల వారీ లెక్కింపుపై దృష్టి పెట్టెందుకు సిద్ధమవుతోన్నది. ఇందుకు సంబంధించిన కసరత్తులు సాగుతున్నాయి. జూలైలో నామ మాత్రంగా చార్జీలను వడ్డించి, ఆ తదుపరి ఆగస్టు నుంచి నెలవారీ మీటర్ రీడింగ్, చార్జీల వసూళ్ల మీద దృష్టి పెట్టేవిధంగా ఈ కసరత్తులు జరుగుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అదే సమయంలో 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కొనసాగుతుందని, గుడిసెలకు ఉచిత విద్యుత్, వ్యవసాయం, చేనేత, హ్యాండ్ లూం, ఆలయాలు, ప్రార్థనా మందిరాలు తదితర వాటికి విద్యుత్ రాయితీలు యథా ప్రకారం కొనసాగించే దిశగా అధికారులు కసరత్తులలో ఉన్నట్టు విద్యుత్ బోర్డు వర్గాలు పేర్కొంటున్నాయి.