
ఘనంగా మార్గబందేశ్వరాలయ బ్రహ్మోత్సవాలు
వేలూరు: వేలూరు జిల్లా విరింజిపురంలో వెలిసిన మార్గ బందేశ్వరాలయ బ్రహ్మోత్సవాలు బుధవారం ఉదయం ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. తమిళ పంగుణి ఉత్తర మాసంలో ప్రతి సంవత్సరం ఆలయ బ్రహ్మోత్సవాలు పది రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా ఆలయ ఈఓ ప్రియ ఆధ్వర్యంలో శివాచార్యులు వేద మంత్రాల నడుమ ఉదయం స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, పుష్పాలంకరణలు చేసి దీపారాధన పూజలు చేశారు. అనంతరం ఆలయ ముఖ ద్వారంలో ఉన్న వెండి ధ్వజస్తంభానికి పూజలు చేసి పుష్పాలంకరణలు చేసి వేద మంత్రాల నడుమ హరోంహరా నామ స్మరణాల మధ్య ధ్వజారోహణం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామివారు వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ధ్వజారోహణ పూజల్లో దేవదాయ శాఖ జిల్లా చైర్మన్ అశోక్ కుమార్, రత్నగిరి బాలమురుగన్ స్వామీజీ పాల్గొని ధ్వజస్తంభానికి కర్పూర హారతులు పట్టి పూజలు చేశారు. ముందుగా స్వామి వార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పుష్పాలంకరణలు చేసి దీపారాధన పూజలు చేశారు. అనంతరం స్వామివారిని మేళ తాళాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి ధ్వజస్తంభం వద్ద ఉంచారు. తులవర్ బ్రహ్మణ సంఘం అధ్యక్షుడు పాండియన్, కార్యదర్శి రామలింగం, కోశాధికారి సెల్వకుమార్, జాయింట్ కార్యదర్శి జ్ఞానవేల్, హరిక్రిష్ణన్ పాల్గొన్నారు.