
పోలీసు తూటాకు మరో రౌడీ హతం
సాక్షి, చైన్నె: రాష్ట్రంలో రౌడీల ఏరివేతలో ఎన్‌కౌంటర్ల పర్వం కొనసాగుతోంది. వారం వ్యవధిలో నాలుగో ఎన్‌కౌంటర్ బుధవారం జరిగింది. కడలూరులో పోలీసు తూటాలకు పుదుచ్చేరి రౌడీ మొట్టై విజయ్ (19) హతమయ్యాడు. గత బుధవారం (మార్చి 26 ) చైన్నెలో ముంబయి ఇరానీ దొంగల ముఠాకు చెందిన జాఫర్ గులాం హుస్సైన్‌ను పోలీసు ఎన్‌కౌంటర్‌లో మట్టు బెట్టిన విషయం తెలిసిందే. ఆ తదుపరి మదురైలో రౌడీ సుభాష్ చంద్ర బోస్‌ను ఎన్‌కౌంటర్‌లో హతం చేశారు. తేనిజిల్లా ఉసిలం పట్టిలో పోలీసును హతమార్చిన గంజాయి వ్యాపారి పొన్ వణ్ణన్ కంబం కొండలలో ఎన్‌కౌంటర్ ద్వారా మట్టుబెట్టారు. ఈ ఎన్‌కౌంటర్లు రౌడీల గుండెల్లో గుబులు రేపాయి. రౌడీల ఏరివేతలో ఓ వైపు ఎన్‌కౌంటర్, మరో వైపు తుపాకీతో కాల్చి పట్టుకోవడం వంటి ప్రక్రియతో పోలీసులు దూకుడు పెంచారు. దీంతో రౌడీలు పొరుగు రాష్ట్రాలకు పారి పోయే పనిలో పడ్డారు. ఈపరిస్థితులలో బుధవారం మధ్యాహ్నం కడలూరులో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. పుదుచ్చేరికి చెందిన రౌడీ మొట్టై విజయ్ (19) మీద సుమారు 30 కేసులు ఉన్నాయి. ఇతడి కోసం ఓ వైపు పుదుచ్చేరి పోలీసులు గాలిస్తూ వస్తున్నారు. ఇతగాడు పుదుచ్చేరి నుంచి తప్పించుకుని పొరుగున ఉన్న తమిళనాడుకు చెందిన కడలూరులోకి ప్రవేశించారు. ఎం పుదూర్ ప్రాంతంలో రౌడీ మొట్టై విజయ్ ఉన్న సమాచారంతో కడలూరు పోలీసులు గోపి, గణపతి బృందం పట్టుకునేందుకు వవెళ్లింది. వీరిపై విజయ్ కత్తితో దాడి చేశారు. గోపి, గణపతి చేతికి గాయాలు అయ్యాయి. దీంతో ఆత్మరక్షణ కోసం శివపై తుపాకీ ఎక్కు బెట్టారు. తుపాకీ తూటాలకు అతడు నేలకొరిగాడు. విజయ్ ఎన్‌కౌంటర్‌లో మరణించిన సమాచారాన్ని పుదుచ్చేరి పోలీసులకు కడలూరు పోలీసులు చేర వేశారు. అతడి మృతదేహాన్ని కడలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ పోలీసులకు చికిత్స అందించారు. సమాచారం అందుకున్న కడలూరు జిల్లా ఎస్పీ జయకుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. గాయపడ్డ పోలీసులను పరామర్శించారు.