
బైక్‌ను ఢీకొన్న కారు
● ముగ్గురు దుర్మరణం ● తిరుపోరూర్‌లో ఘటన
సేలం: తిరుపోరూర్ సమీపంలో బైక్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. కేళంబాక్కం సమీపంలోని తయ్యూరు పలమానగర్ ప్రాంతానికి చెందిన హరిదాస్ (34) ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి. ఇతని భార్య సుగంధి (33). వీరి కుమారులు లియో డేనియల్ (10), జో డేనియల్ (5). ఈక్రమంలో హరిదాస్ భార్య, ఇద్దరు కుమారులను ఒకే బైక్‌లో తిరుపోరూర్ సమీపంలోని కయార్ గ్రామంలోని అత్తమామల ఇంటికి మంగళవారం సాయంత్రం వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి నలుగురు ఒకే బైక్‌లో రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇంటికి బయలుదేరారు. తైయూర్ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ పాఠశాల వద్ద వెళుతుండగా ఆమార్గంలో వేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొంది. ఈప్రమాదంలో హరిదాస్, కుమారుడు లియో డేనియల్ సంఘటన స్థలంలోనే దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడి ప్రాణాలతో పోరాడుతున్న సుగంధి, చిన్న కుమారుడు జో డేనియల్‌లను స్థానికులు కేలంబాక్కంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే సుగంధి మృతిచెందింది. జో డేనియల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేయగా, కారు డ్రైవర్ కాయర్ గ్రామానికి చెందిన అశ్విన్ కుమార్ (43), భార్య బిందు (35), వారి కుమారుడు అభినేష్ పాల్మోని (6) కారులో ఉన్నారని తేలింది. అశ్విన్ కుమార్ కేలంబాక్కంలో ఒక షూ దుకాణం నడుపుతున్నాడు. మంగళవారం రాత్రి దుకాణం వ్యాపారం ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అశ్విన్ కుమార్, భార్య, కుమారుడు కూడా స్వల్పంగా గాయపడ్డారు. ఈముగ్గురిని కేలంబాక్కంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.