
వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చూడాలి
వేలూరు: వేలూరు జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో పాటూ కొన్ని ప్రాంతాల్లో తాగునీటి బోర్లు కూడా ఎండి పోవడంతో జిల్లావ్యాప్తంగా ఎక్కడా నీటి సమస్య రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ సుబ్బలక్ష్మి తెలిపారు. వేలూరు జిల్లా గుడియాత్తం మున్సిపాలిటీ పరిధిలోని వినాయకపురం నుంచి మున్సిపాలిటీకి సరఫరా చేస్తున్న తాగునీటి పైపులైన్‌లను ఆమె తనిఖీ చేశారు. వేసవిలో నీటి సమస్య లేకుండా చూడాలని పంచాయతీలోని నిధులు తాగునీటికి మాత్రమే ఉపయోగించాలని ఇప్పటికే ఆయా బ్లాకు డెవలప్‌మెంట్ అధికారులకు, గ్రామ సర్పంచ్‌లకు తెలియజేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం గుడియాత్తం ప్రాంతంలో అమృత్ 2.0 పథకం కింద రూ: 1,292 లక్షల వ్యయంతో తాగునీటి ట్యాంకు పైపులైన్ తదితర వాటిని ఏర్పాటు చేసి మున్సిపాలిటీలోని అన్ని వార్డులకు సరఫరా చేస్తున్నామన్నారు. నీటిని వృథా చేయకుండా సంబంధిత అధికారులు తరచూ పైపులైన్‌లను తనిఖీ చేయాలన్నారు. అనంతరం గుడియాత్తంలోని మున్సిపల్ పాఠశాలకు వెల్లి విద్యార్థులకు అవసరమైన వసతులున్నాయా తాగునీటి సదుపాయం కల్పించారా? అని తనిఖీ చేయడంతో పాటూ వసతులపై విద్యార్థుల వద్ద అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌తో పాటూ గుడియాత్తం మున్సిపల్ కమిషనర్ మంగయకరసర్, తహసీల్దార్ మెర్లిన్ జ్యోతిక అఽధికారులున్నారు.