
అకాల వర్షం తాండవం
● కుమరి, తిరుప్పూర్‌లలో కుండపోత
సాక్షి, చైన్నె: వేసవిలో అకాల వర్షం శనివారం తాండవం చేసింది. కన్యాకుమారి, తిరుప్పూర్‌లతో పాటూ ఏడు చోట్ల అతి భారీ వర్షం పడింది. గత రెండు మూడు రోజులుగా అకాల వర్షం చెదరు ముదురుగా కురుస్తున్న విషయం తెలిసిందే. చైన్నె శివారులలో ఉదయం పలు చోట్ల చిరుజల్లుల వాన పడింది. నగరంలో అనేక చోట్ల మోస్తారుగా వర్షం పడింది. కన్యాకుమారిలో అతిభారీ వర్షం పడింది. ఇక్కడి కోలికోవిలై ప్రాంతంలో 19 సెం.మీ వర్షం పడింది. ఈ పరిసరాలన్నీ జలమయం అయ్యాయి. తిరుప్పూర్‌లో 15 సెం.మీ వర్షం పడింది. ఇక్కడి లోతట్టు ప్రాంతాలలోని నివాసాలలోకి వర్షపు నీరు చేరడంతో జనం అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తేని కోయంబత్తూరు, నీలగిరి, తిరుప్పూర్ జిల్లాల పరిధిలోని పశ్చిమ కనుమలలో వర్షాలు కురుస్తున్నాయి. అడవులలో వర్షం కురుస్తుండటంతో అక్కడి నుంచి వచ్చే నీటి ప్రవాహం పై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ఉన్నారు. అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఆదివారం కూడా వర్షాలు ఈరోడ్, దిండిగల్‌లోనూ కురిసే అవకాశాలు ఉన్నాయి. మరికొన్ని జిల్లాలో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. శనివారం కన్యాకుమారి, తిరుప్పూర్‌లతో పాటూ ఏడు చోట్ల అతి భారీ వర్షం పడినట్టు పేర్కొన్నారు. మరి కొన్ని చోట్ల మోస్తారుగా వర్షం పడిందని వాతావరణ అధికారులు వివరించారు.