
రామనాథ స్వామి ఆలయంలో పూజలు
పట్టు పంచె, జరిగ చొక్కా ధరించి ప్రధాని నరేంద్ర మోదీ రామేశ్వరం రామనాథ స్వామి ఆలయానికి వెళ్లారు. శ్రీరామ నవమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్ధగంట పాటూ ఆలయంలోనే ఉన్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూల మాలతో సత్కరించి ప్రసాదాలు అందజేశారు. తమిళ సంప్రదాయం ఉట్టి పడే రీతిలో ప్రధాని వస్త్ర ధారణ కనిపించడం గమనార్హం. పూజల అనంతరం ఆలయం ప్రాకారాలను ప్రధాని చుట్టి వచ్చారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రామేశ్వరం ఆలయం మైదానానికి వెళ్లారు. ఈ మార్గంలో 2.50 కి.మీ దూరం మోదీ రోడ్ షో జరిగింది. రోడ్డుకు ఇరువైపులా బీజేపీ కార్యకర్తలు, జనం పెద్ద సంఖ్యలో నిలబడి ఆహ్వానం పలికారు. వారికి అభివాదం తెలుపుతూ కాన్వాయ్ ముందుకు సాగింది. ఆలయం మైదానం వేదిక నుంచి రూ.8,300 కోట్ల విలువైన కొత్త ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఇందులో వాలాజా పేట – రాణిపేటను కలుపుతూ ఆంధ్రా సరిహద్దుల వరకు 28 కి.మీ దూరం ఫోర్ వే, విల్లుపురం – పుదుచ్చేరి మధ్య 29 కి.మీ దూరం ఫోర్ వే, పూండియన్ కుప్పం – చట్టనాథపురం మధ్య 59 కి.మీ దూరం పోర్‌వే, చోలవరం – తంజావూరు మధ్య 48 కి.మీ దూరం పోర్ వే రోడ్డు పనులు ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీతో పాటూ ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర సహాయమంత్రి ఎల్. మురుగన్, సీఎం స్టాలిన్ హాజరు కాని నేపథ్యంలో ఆయన ప్రతినిధులుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు తంగం తెన్నరసు, రాజకన్నప్పన్ హాజరయ్యారు.

రామనాథ స్వామి ఆలయంలో పూజలు