
కలుషిత నీటిని పాలారులో వదలొద్దు
వేలూరు: పరిశ్రమల నుంచి వచ్చే నీటిని పాలారులో వదలకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రైతు నాయకులు ధ్వజమెత్తారు. వేలూరు కలెక్టరేట్‌లో కలెక్టర్ సుబ్బలక్ష్మి అధ్యక్షతన జిల్లాలోని రైతు నాయకులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన కుప్పం నుంచి చైన్నె వరకు పాలారు ఉందని వీటిలో వర్షం వస్తే నీరు ఏరులై పారడంతోపాటు పలు కుంటలు, చెరువులకు నీరు చేరుతోందన్నారు. అయితే వానియంబాడి నుంచి కాంచీపురం మీదుగా తిరువళ్లూరు వరకు వెళ్లే పాలారులో వివిధ పరిశ్రమల నుంచి వచ్చే కలుషిత నీటిని వదలడం ద్వారా పాలారు కలుషితమవుతోందన్నారు. వీటిని ద్వారా వ్యవసాయ పంటలు సైతం చేయలేక పోవడంతోపాటు తాగునీరు కూడా కలుషితమై అంటు రోగాల బారిన పడుతున్నామన్నారు. వీటిపై వెంటనే ప్రభుత్వానికి సిఫారసు పంపుతామని కలెక్టర్ తెలిపారు. రైతులు మాట్లాడుతూ ప్రస్తుతం వేసవి కాలం కావడంతో బోర్లు, బావుల్లో వచ్చే అరకొర నీటితో వ్యవసాయ పంటలు చేసుకుంటున్నామని అయితే అటవీ ప్రాంతాల్లో పండించే పంటలను పూర్తిగా అటవీ ఏనుగులు, పందులు నాశనం చేస్తున్నామని వీటికి ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని కోరారు. ప్రస్తుతం మామిడి పంటకు పిచికారీ చేస్తున్నందున అన్ని ప్రాంతాల్లో మందుల దుకాణాలు ఏర్పాటు చేసి తక్కువ ధరకు రైతులకు మందులు సరఫరా చేయాలని కోరారు. దీంతో కలెక్టర్ రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అనంతరం రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లను అందజేశారు. సమావేశంలో రైతులు, వ్యవసాయ శాఖల అధికారులు పాల్గొన్నారు.