
అప్పటి కంటే పది రెట్లు ఎక్కువ లాభం
తమిళసినిమా: పబ్లిసిటీ కింగ్‌గా పేరుగాంచిన నిర్మాత కలైపులి ఎస్ ధాను. ఈయన 20 ఏళ్ల క్రితం విజయ్ కథానాయకుడిగా నిర్మించిన చిత్రం సచిన్. నటి జెలీనియా నాయకిగా నటించిన ఈ చిత్రానికి జాన్ మహేంద్రన్ కథా, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని, దివంగత కెమెరామెన్ జీవా ఛాయాగ్రహణం అందించారు. వైవిధ్య భరిత ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రం 2005 ఏప్రిల్ 14వ తేదీన విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కాగా తాజాగా డిజిటల్ ఫార్మెట్‌లో సరికొత్త హంగులతో గత వారం ప్రపంచవ్యాప్తంగా విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శనివారం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో నిర్మాత కలైపులి ఎస్. ధాను, దర్శకుడు జాన్ మహేంద్రన్, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, నత్య దర్శకుడు శోభి మాస్టర్ పాల్గొన్నారు. దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ తాను తమిళంలో సంగీతాన్ని అందించిన తొలి చిత్రం సచిన్ అని పేర్కొన్నారు. ఇందులో వాడి వాడి కై పడాద సీడీ అనే పాటను విజయ్‌తో పాడించినట్లు చెప్పారు. ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయని తాను ఏ కచేరి లోనైనా వాడి వాడి కై పడాద సీడీ పాటను పాడకుండా ఉండనన్నారు. చిత్రానికి సక్సెస్ మీట్ నిర్వహించడం అన్నది నిర్మాత ధానుకే చెల్లిందన్నారు. సచిన్ చిత్రం మొదట విడుదల చేసినప్పుడు 200 రోజులకు పైగా ప్రదర్శింపబడిందని, 20 ఏళ్లు తరువాత ఇప్పుడు రీ రిలీజ్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శింపబడుతోందని చెప్పారు. మొదటి రిలీజ్ కంటే ఇంప్పుడు 10 రెట్లు అధికంగా లాభాలు తెచ్చిపెడుతోందని తెలిపారు. చిత్రం 50 నుంచి 100 రోజులు వరకు పడుతుందని ఎగ్జిబిటర్లు చెబుతున్నారని, దీంతో త్వరలో సచిన్ చిత్ర సక్సెస్‌ను గ్రాండ్‌గా నిర్వహించనున్నట్లు నిర్మాత కలైపులి ఎస్ ధాను చెప్పారు.