
లైంగిక దాడి కేసులో పన్నెండేళ్ల జైలు శిక్ష
తిరువళ్లూరు: ఇటుక బట్టీలో పనుల కోసం వచ్చిన దివ్యాంగురాలిపై లైంగిక దాడి చేసిన కేసులో నిందితుడికి పన్నెండేళ్ల జైలు శిక్షను విధిస్తూ తిరువళ్లూరు జిల్లా కోర్టు మంగళవారం తీర్పును వెలువరించింది. తిరువళ్లూరు జిల్లా పట్టాభిరామ్ అన్నంబేడు గ్రామంలో ప్రైవేటు వ్యక్తికి చెందిన ఇటుక బట్టీ ఉంది. ఈ చాంబర్‌లో 2007వ సంవత్సరంలో విల్లుపురం జిల్లాకు చెందిన దివ్యాంగులరాలు కన్నగి తన కుటుంబంతో పని చేయడానికి వచ్చారు. 2007, ఏప్రిల్ 8న పనులు ముగించుకుని ఇంటి బయట నిద్రిస్తున్న దివ్యాంగురాలిని అదే బట్టీలో పని చేస్తున్న తిరుమలై(27), ఆనందన్(26) తదితర ఇద్దరు రాత్రి సమయంలో బలవంతంగా తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. విషయాన్ని బయటకు చెబితే హత్య చేస్తామని సైతం బెదిరించారు. ఈ సంఘటనపై బాధితురాలి తండ్రి వరదరాజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టాభిరామ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కేసు విచారణలో ఉన్న సమయంలో గత పన్నెండుళ్లుగా ఆనందన్, తిరుమలై తదితర ఇద్దరు కోర్టుకు హాజరుకాకుండా పరారయ్యారు. దీంతో తిరువళ్లూరు జిల్లా న్యాయమూర్తి నిందితులపై నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేశారు. దీంతో పట్టాభిరామ్ పోలీసులు నిందితుల్లో ఒకరైన తిరుమలైను 2023లో పట్టుకుని కోర్టులో హాజరుపరిచి పుళల్ జైలుకు తరలించారు. ప్రస్తుతం పుళల్ జైలులో ఉండగా తిరుమలై కేసు విచారణ తిరువళ్లూరు జిల్లా కోర్టులో సాగింది. విచారణలో యువతిపై అత్యాచారం చేసినట్టు రుజువు కావడంతో నిందితుడికి పన్నెండేళ్ల జైలుశిక్ష, 10 వేల జరిమానా విధిస్తూ జిల్లా న్యాయమూర్తి జూలియట్ పుష్ప తీర్పును వెలువరించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలల పాటు శిక్షను అనుభవించాల్సి ఉంది. కేసులో మరో నిందితుడు ఆనంద్ పరారీలో ఉండడంతో అతడి కోసం పట్టాభింరామ్ అసిస్టెంట్ కమిషనర్ గిరి నేతృత్వంలో ప్రత్యేక బృందం అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టింది. కేసును పబ్లిక్ ప్రాసిక్యూటర్ తమిళియన్ వాదించారు.