సాక్షి ప్రతినిధి, చెన్నై : స్నేహితురాలు రంజాన్ విందుకు ఆహ్వానిస్తే బిర్యానీతో సహా నగలు భోంచేసిన యువకుడి ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. చెన్నై సాలగ్రామం అరుణాచలం రోడ్డులోని ఒక అపార్టుమెంట్‌లో నివసించే దాక్షాయణి (34) ప్రముఖ బంగారునగల దుకాణంలో పనిచేస్తోంది.
అదే దుకాణంలో మేనేజర్‌గా పనిచేసే తారా అనే మహిళను రంజాన్ విందుకు దాక్షాయణి ఆహ్వానించింది. తార తన బాయ్‌ఫ్రెండ్ మహమ్మద్ అబూబకర్ (27)తో కలిసి ఈనెల 3వ తేదీన విందుకు వెళ్లింది. ఇద్దరూ కలిసి వేడివేడి బిర్యానీ ఆరగించి ఇళ్లకు వెళ్లిపోయారు. ఆ తరువాత దాక్షాయణి తాను బయటకు వెళ్లేందుకు బీరువా తెరిచి చూడగా రూ.1.45 లక్షల విలువైన మూడు బంగారు గొలుసులు, వజ్రాల దండ కనిపించలేదు.
అయితే, తార, అబూబకర్ మినహా వేరెవ్వరూ ఇంటికి రాకపోవడంతో దాక్షాయణి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అబూబకర్‌ను విచారించగా పొంతనలేని సమాధానం ఇచ్చాడు. దీంతో అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లి పొట్టభాగాన్ని స్కాన్ చేయగా నగలు కనపడ్డాయి. రంజాన్ వేళ మద్యం తాగేందుకు డబ్బు లేకపోవడంతో చోరీకి పాల్పడ్డానని చెప్పాడు.
బిర్యానీ తయారీలో దాక్షాయణి బిజీగా ఉన్న సమయంలో బీరువా తెరిచి నగలు దొంగలించానని, బిర్యానీ మధ్యలో నగలు పెట్టి మింగేశానని నిందితుడు వాంగ్మూలం ఇచ్చాడు. అతడికి వెంటనే ఎనిమా ఇచ్చి నగలను బయటకు తీసి దాక్షాయణికి అప్పగించారు. నిందితుడిని అరెస్ట్ చేయగా ఫిర్యాది వేడుకోవడంతో హెచ్చరించి వదిలిపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment