శంషాబాద్ విమానాశ్రయంలో కిషన్‌రెడ్డి, ఈటల
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: పార్టీలో సమన్వయ లోపం, పదవులు దక్కని అసంతృప్తులు, పాత–కొత్త నేతల మధ్య భేదాభిప్రాయాలను సరిదిద్దడం ఓ వైపు.. అధికార బీఆర్‌ఎస్‌ను, సీఎం కేసీఆర్ వ్యూహాలను ఎదుర్కొంటూ, విమర్శలను తిప్పికొడుతూ పార్టీని ముందుకు దూకించాల్సిన బాధ్యత ఇంకోవైపు.. ముంచు కొస్తున్న అసెంబ్లీ ఎన్నికలు మరోవైపు.. రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డికి ముప్పేట ముసిరిన సవాళ్లు ఇవి.
వీటన్నింటినీ చక్కదిద్ది రాష్ట్రంలో బీజేపీని విజయతీరాలకు నడిపించేందుకు ఆయనకు ఉన్న సమయం కూడా నాలుగైదు నెలలే.. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై అవగాహన, సంఘ్ పరివార్ అండదండలున్న కిషన్‌రెడ్డికి తోడుగా.. కేసీఆర్ వ్యూహాలు, ఎత్తుగడలపై పూర్తి అవగాహన ఉన్న ఈటల రాజేందర్‌ను రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా నియమించిన నేపథ్యంలో వారు పరిస్థితులను ఎలా అధిగమిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఇంత తక్కువ సమయంలోనే పార్టీని చక్కదిద్ది, ఎన్నికలకు సిద్ధం చేయడం కత్తిమీద సామేనని బీజేపీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. అన్నింటికన్నా ముందు ఈ నెల 8న ప్రధాని మోదీ వరంగల్ పర్యటన, బహిరంగ సభను విజయవంతం చేయడం కిషన్‌రెడ్డి ముందున్న ప్రథమ లక్ష్యమని అంటున్నాయి.
పార్టీని చక్కదిద్దడమే ప్రధాన ఎజెండాగా..
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడిన నేపథ్యంలో రాష్ట్ర బీజేపీలో అయోమయ, గందరగోళ పరిస్థితులను చక్కదిద్దడం ప్రధాన ఎజెండాగా మారిందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బండి సంజయ్ స్థానంలో అధ్యక్షుడిగా నియమితుడైన కిషన్‌రెడ్డి ఈ దిశగా అవసరమైన చర్యలు చేపట్టి పార్టీ నాయకులు, కేడర్‌లో విశ్వాసాన్ని నింపే చర్యలు చేపట్టాల్సి ఉంటుందని అంటున్నాయి.
దాదాపు నాలుగేళ్లుగా (ఎంపీగా ఎన్నిక, కేంద్ర మంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి) రాష్ట్ర పార్టీ వ్యవహారాలు, నిర్ణయాల్లో పెద్దగా జోక్యం చేసుకోకుండా ఉన్న కిషన్‌రెడ్డి.. ఇప్పుడు పార్టీని గాడిలో పెట్టేందుకు పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రకరించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొంటున్నాయి.
పార్టీలో సంస్థాగత మార్పులతో..
బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన రాష్ట్ర కార్యవర్గం, పదాధికారులు, జిల్లా అధ్యక్షుల మార్పు వంటి సంస్థాగత చర్యలు కిషన్‌రెడ్డికి తలకు మించిన భారంగా మారే అవకాశం ఉందని పార్టీ నేతలు అంటున్నారు. అధ్యక్ష మార్పు, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ఈటల రాజేందర్‌కు కీలక పదవి ఇవ్వడంపై పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలను బుజ్జగించడం, పార్టీ మారకుండా చూడటంపైనా కిషన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు.
అధికార బీఆర్‌ఎస్ వైఫల్యాలను ఎండగట్టడం, రాష్ట్ర ప్రభుత్వంపై, కేసీఆర్‌పై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను బీజేపీకి అనుకూలంగా మార్చుకోవడం కూడా కీలకమని అంటున్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ప్రాధాన్యత తగ్గించి.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒక్కటేననే భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అనేలా ప్రజల్లో అభిప్రాయం కలిగించేందుకు చర్యలు చేపట్టాల్సి ఉందని పేర్కొంటున్నారు. నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరిగే నేపథ్యంలో ఆలోగా వీటన్నింటినీ ఏ మేరకు చక్కదిద్దగలరనే చర్చ జరుగుతోంది.
అయిష్టత.. అసంతృప్తి మధ్య..
తనకు అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టడంపై కిషన్‌రెడ్డి ఒకింత అసంతృప్తిగా ఉన్నారని.. అయిష్టంగానే బాధ్యతల స్వీకరణకు సిద్ధమవుతున్నారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. బుధవారం ఢిల్లీలో జరిగిన కేబినెట్ భేటీకి ఆయన హాజరుకాకపోవడంతో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారనే ప్రచారం జరిగింది. తర్వాత ఆయన పొడిపొడిగానే మీడియాతో మాట్లాడారు. అనారోగ్య కారణాలతోనే కేబినెట్ భేటీకి వెళ్లలేదన్నారు. అధిష్టానం నిర్ణయం శిరోధార్యమని, పార్టీ ఏది ఆదేశిస్తే దానిని సైనికుడిగా పాటిస్తానని సాయంత్రం మీడియాతో పేర్కొన్నారు.
ఢిల్లీలోనే బండి సంజయ్.. పెద్దలతో చర్చలు
అత్యంత కీలకమైన ఎన్నికల సమయంలో తనను అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించడంపై బండి సంజయ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. ఈ క్రమంలో కేంద్ర మంత్రి పదవి ఇస్తామన్నా స్వీకరించేందుకు అయిష్టత చూపుతున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ విషయాన్ని ఆయన పార్టీ జాతీయాధ్యక్షుడు నడ్డాతోపాటు ఇతర పెద్దలకు వివరించినట్టు ప్రచారం జరుగుతోంది. సంజయ్‌తో సునీల్ బన్సల్ భేటీ అయి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వెనక్కి తగ్గలేదని అంటున్నారు.
అయితే తనకు వ్యతిరేకంగా పనిచేసిన కొందరు నేతల అంశాన్ని బన్సల్ వద్ద ప్రస్తావించారని.. తనతోపాటు అధిష్టానం పెద్దలపై ఎమ్మెల్యే రఘునందన్‌రావు చేసిన వ్యాఖ్యల విషయాన్ని వివరించారని చెప్తున్నారు. ఈ క్రమంలో రఘునందన్‌రావుపై చర్యలు తీసుకునే విషయంపై అధిష్టానం సమాలోచనలు చేస్తున్నట్టు పేర్కొంటున్నారు. మరోవైపు పార్టీ తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని సంజయ్ ఢిల్లీలో మీడియాకు చెప్పారు. రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌తో అపాయింట్‌మెంట్ ఉన్న కారణంగా బుధవారం ఢిల్లీలోనే ఆగి.. గురువారం హైదరాబాద్ వెళుతున్నట్టు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment