Telangana Formation Day: పండుగ వాతావ‘రణం’ | BRS Congress BJP Ready For Telangana Formation Day Celebrations | Sakshi
Sakshi News home page

Telangana Formation Day: పండుగ వాతావ‘రణం’

Published Fri, Jun 2 2023 3:07 AM | Last Updated on Fri, Jun 2 2023 7:33 AM

BRS Congress BJP Ready For Telangana Formation Day Celebrations - Sakshi

స్టేట్‌: సచివాలయంలో

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం శుక్రవారం పదో ఏడాదిలోకి అడుగుపెడుతున్న వేళ.. రాజకీయ పార్టీలు పోటాపోటీ కార్యక్రమాల నిర్వహణకు సిద్ధమయ్యాయి. రాష్ట్ర ఏర్పాటు నాటి నుంచి అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఇటు పార్టీ తరఫున, అటు సర్కారు తరఫున ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతుంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు తరఫున గోల్కొండ కోటలో అధికారికంగా ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి.

మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ కూడా తెలంగాణను ఇచ్చింది తమ పార్టీయేనంటూ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేదిశగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. వామపక్షాలతోపాటు మిగతా పార్టీలు కూడా వేడుకలకు ఏర్పాట్లు చేసుకున్నాయి. మరికొన్ని నెలల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. ప్రజలకు దగ్గరయ్యేందుకు రాజకీయ పార్టీలన్నీ దూకుడుగా ముందుకు వెళ్తుండటం చర్చనీయాంశంగా మారింది. 

సెంటర్‌: గోల్కొండలో 

కొత్త సచివాలయంలో బీఆర్‌ఎస్‌ సర్కారు 
నూతన సచివాలయం వేదికగా ఈసారి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ అవతరణ వేడుకలను నిర్వహిస్తోంది. శుక్రవారం సీఎం కేసీఆర్‌ సచివాలయంలో జాతీయజెండాను ఎగురవేసి.. గత తొమ్మిదేళ్ల ప్రగతి వివరించనున్నారు. అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమాల్లో ఆయా జిల్లాల మంత్రులు, ముఖ్య ప్రజాప్రతినిధులు జాతీయ పతాకాలు ఆవిష్కరిస్తారు.  

గోల్కొండలో కేంద్రంలోని బీజేపీ సర్కారు 
కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను గోల్కొండ కోటలో అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకల్లో గోల్కొండ కోటపై కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.

గతేడాది ఢిల్లీలో ఈ వేడుకలను నిర్వహించిన కేంద్రం తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది. ‘‘ఎందరో అమరవీరుల బలిదానాలు, మరెందరో పోరాటాల ఫలితంగా తెలంగాణ ఏర్పడింది. ఈ పోరాటాలు, త్యాగాలను స్మరించుకుందాం. మా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా ఒక వేడుకగా నిర్వహిస్తున్నాం’’ అని కేంద్ర సాంస్కృతికశాఖ ప్రకటించడం గమనార్హం. 

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై.. 
మరోవైపు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రాష్ట్ర ప్రథమ పౌరురాలి హోదాలో రాజ్‌భవన్‌లో జాతీ య పతాకాన్ని ఎగురవేసి అవతరణ వేడుకలను నిర్వహించనున్నారు. అనంతరం ప్రజలతో గవర్నర్‌ మాట్లాడుతారు. వారి సమస్యలను తెలుసుకునేందుకు ప్రజాదర్బార్‌ నిర్వహించనున్నారు. రాజ్‌భవన్‌ వేడుకల్లో గవర్నర్‌ ప్రసంగం ఏవిధంగా ఉండబోతున్నదన్నది ఆసక్తికరంగా మారింది. 

గాంధీభవన్‌లో కాంగ్రెస్‌.. 
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ బిల్లు పాస్‌ అయిన సమయంలో లోక్‌సభ స్పీకర్‌గా ఉన్న మీరాకుమార్‌ రా ష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల్లో పాల్గొనడానికి వస్తున్నారు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో నిర్వహించే వేడుకల్లో ఆమె పాల్గొంటారు. దీనితోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహించేందుకు టీపీసీసీ ఏర్పాట్లు చేసింది.  తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీనే అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లేలా కార్యక్రమాలను రూపొందించింది. 
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా విద్యుత్‌ వెలుగుల్లో తళుకులీనుతున్న హైదరాబాద్‌లోని అసెంబ్లీ భవనం, ఖమ్మంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం 

ఎన్నికలతో.. ఏడాది చివరిదాకా.. 
► కేంద్రంలో మోదీ ప్రభుత్వం, కేసీఆర్‌ సర్కార్‌ తొమ్మిదేళ్ల పాలనను ముగించుకుని పదో ఏడాదిలోకి ప్రవేశించాయి. ఈ ఏడాది డిసెంబర్‌లోగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏప్రిల్‌లో లోక్‌సభ జరగనున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి అత్యంత ప్రాధాన్యత లభిస్తోందనే వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. తెలంగాణ సాధనలో ప్రధాన పార్టీలన్నీ తమ భాగస్వామ్యం, పాత్ర, ప్రాధాన్యతను చాటుకునేందుకు ఈ ఉత్సవాలను వేదికగా చేసుకున్నాయి. ఇందుకోసం రాష్ట్ర అవతరణ దినోత్సవంతోనే ఆపేయకుండా.. ఆ తర్వాతా వివిధ కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాయి. 

► తొమ్మిదేళ్ల పాలనలో వివిధ రంగాల్లో సాధించిన విజయాలను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లేలా ‘ద శాబ్ది ఉత్సవాల’ పేరిట 21 రోజుల కార్యక్రమాలకు బీఆర్‌ఎస్‌ సర్కారు ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ శాఖలను ఇందులో భాగస్వాములను చేసి పకడ్బందీ ప్రణాళికలు అమలుచేస్తోంది. 

► కేంద్రంలోని మోదీ సర్కారు 9 ఏళ్లలో సాధించిన అభివృద్ధి, సంక్షేమంపై, వివిధ వర్గాల ప్రజలకు చేకూరిన ప్రయోజనాలపై దేశవ్యాప్తంగా మే 30 నుంచి జూన్‌ 30దాకా ‘మహాజన సంపర్క్‌ అభియాన్‌’ పేరిట ప్రచార కార్యక్రమాలకు బీజేపీ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తెలంగాణలో మోదీ ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడంతోపాటు.. బీఆర్‌ఎస్‌ సర్కార్‌ వైఫల్యాలను ఎండగట్టాలని నిర్ణయించింది. 

గోల్కొండ ఖిల్లా కార్యక్రమమిదీ
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. గోల్కొండ కోటపై శుక్రవారం ఉదయం 7.10 గంటలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జాతీయ జెండా ఎగురవేస్తారు. తర్వాత సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరిస్తారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో– పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తారు.

సాయంత్రం 6.10 గంటలకు భారత సాంస్కృతిక వైభవం, కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు అంశాలపై రెండు చిత్రాల ప్రదర్శన ఉంటుంది. తర్వాత కిషన్‌రెడ్డి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో డా.ఆనంద శంకర్‌ బృందం, మంజుల రామస్వామి బృందం శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, మంగ్లి, మధుప్రియల గానం, ప్రముఖ సంగీత దర్శకుడు శంకర్‌ మహదేవన్‌ దేశభక్తి గీతాల ఆలాపన ఉంటాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement