ఆదివారం ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న రాహుల్ గాంధీ, భట్టి విక్రమార్క , పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్న రాహుల్. చిత్రంలో రేవంత్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రధాని మోదీ చేతిలో తెలంగాణ సీఎం కేసీఆర్ రిమోట్ కంట్రోల్ ఉందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. మోదీకి ఏం కావాలో కేసీఆర్ అదే చేస్తారని, మోదీ చేతిలో కేసీఆర్ రిమోట్ కంట్రోల్ ఉండటమే ఇందుకు కారణమని చెప్పారు. బీఆర్‌ఎస్ అంటే ‘బీజేపీ రిష్తేదార్ (బీజేపీ బంధువుల) సమితి’ అని పేర్కొన్నారు. కర్ణాటకలో ఏం జరిగిందో తెలంగాణలోనూ అదే జరగబోతోందని, అక్కడ బీజేపీని ఓడిస్తే, ఇక్కడ బీజేపీ బీ టీం అయిన బీఆర్‌ఎస్‌ను ఓడించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక లాంటి కార్యకర్తలకు ఇది పెద్ద పని కాదని, సునాయాసంగా బీఆర్‌ఎస్‌ను ఓడించి చూపెడతామని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చాక చేయూత పేరుతో వితంతువులు, వృద్ధులకు నెలకు రూ.4 వేల పింఛన్ అందజేస్తామని హామీ ఇచ్చారు. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో పాటు ఆయన బృందం కాంగ్రెస్‌లో చేరిక, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా..జనగర్జన పేరిట ఆదివారం ఖమ్మంలోని వైరా రోడ్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు.
ఖమ్మం కాంగ్రెస్ పార్టీకి ఇల్లు లాంటిది..
‘భారత్ జోడో యాత్ర తర్వాత మరోసారి తెలంగాణకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఓ వైపు కాంగ్రెస్ పార్టీ దేశంలోని ప్రజలందరినీ ఐక్యంగా ఉంచేందుకు ఆలోచిస్తుంటే, ఇంకోపక్క బీజేపీ విద్వేషం, విభజన సిద్ధాంతాల వ్యాప్తికి ప్రయత్నం చేస్తోంది. దేశ వ్యాప్తంగా జోడో యాత్ర చేసి బీజేపీ విద్వేష సిద్ధాంతాన్ని విచ్ఛిన్నం చేశాం. ఖమ్మం కాంగ్రెస్ పార్టీకి ఇల్లు లాంటిది. ఇక్కడి ప్రజలు ప్రతిసారీ కాంగ్రెస్‌కు అండగా ఉన్నారు. మీ మనసు, మీ హృదయంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కష్టసమయాల్లో కూడా ఇక్కడ ప్రజలు మా ఆలోచనలు, పార్టీని వీడలేదు.
బీఆర్‌ఎస్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా మమ్మల్ని వదలిపెట్టనందుకు మీ అందరికీ ధన్యవాదాలు. వేల కిలోమీటర్లు నడిచి తెలంగాణ ప్రజలు, అణగారిన వర్గాల సమస్యలు తెలుసుకున్న ఖమ్మం జిల్లా నాయకుడు భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీలోకి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని స్వాగతిస్తున్నాం. ఆయన పార్టీలోకి రావడం సంతోషదాయకం..’ అని రాహుల్ అన్నారు.
అది బీజేపీ బంధువుల పార్టీ..
‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇక్కడి ప్రజల కల. పేదల స్వప్నం. రైతులు, కారి్మకులు తెలంగాణ రాష్ట్రాన్ని కాంక్షించారు. కానీ తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్ పాలన ఆ కలలను చిధ్రం చేసింది. మీరు కన్న కలలన్నీ కల్లలయ్యాయి. టీఆర్‌ఎస్‌గా ఆవిర్భవించిన ఆ పార్టీ పేరు మార్చుకుని ఇప్పుడు బీఆర్‌ఎస్‌గా మారింది. బీఆర్‌ఎస్ అంటే ‘బీజేపీ రిస్తేదార్ సమితి’. అది బీజేపీ బంధువుల పార్టీ. ఆ పార్టీకి బీ టీంగా పనిచేస్తోంది. పార్లమెంట్‌లో మేం బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాం. కానీ బీఆర్‌ఎస్, సీఎం కేసీఆర్ మాత్రం బీజేపీకి బీ టీంగా పనిచేశారు. మేం రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తే బీజేపీకి బీఆర్‌ఎస్ మద్దతునిచ్చింది..’ అని చెప్పారు.
వాళ్లు వస్తే మేం రాబోమని చెప్పాం..
‘ఈ మధ్య ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీలన్నీ భేటీ అయ్యాయి. ఆ భేటీకి బీఆర్‌ఎస్‌ను పిలవాలని కొందరు ప్రతిపక్ష నేతలు కాంగ్రెస్ పార్టీని కోరారు. కానీ బీఆర్‌ఎస్ వస్తే ఆ మీటింగ్‌కు మేం రాబోమని కాంగ్రెస్ పార్టీ పక్షాన స్పష్టంగా చెప్పాం. బీజేపీ బీ టీం వాళ్ల పక్కన కూర్చునేది లేదని స్పష్టం చేశాం. బీజేపీ బీ టీంతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం ఉండదు. కాంగ్రెస్ పార్టీని వదిలివెళ్లిన వాళ్లకు ఓ మాట చెబుతున్నా. మీ కోసం మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఉన్న నేతల కోసం మా ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. టీఆర్‌ఎస్, బీజేపీ ఆలోచనా విధానంతో ఉన్న వారితో మాత్రం మాకు సంబంధం లేదు..’ అని స్పష్టం చేశారు.
కేసీఆర్ తాను రాజు అనుకుంటున్నారు.
‘సీఎం కేసీఆర్ తాను తెలంగాణకు రాజు అనుకుంటున్నారు. ఈ నేల ఆయన జాగీరు అనుకుంటున్నారు. అందుకే ఇందిరమ్మ హయాంలో కాంగ్రెస్ పార్టీ ఆదివాసీలు, దళితులు, పేదలకు వచ్చిన భూములను కేసీఆర్ ప్రభుత్వం లాక్కుంటోంది. ఆ భూమి మీది. అది మీ హక్కు. ఆ భూమిపై మీకు హక్కులను కల్పించిన కాంగ్రెస్ పార్టీ ఆ హక్కులను కాపాడుతుంది. అవినీతి విషయంలో సీఎం కేసీఆర్ ఏ ఒక్కదాన్నీ విడిచిపెట్టలేదు.
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల రూపాయల అవినీతి చేశారు. ధరణి పోర్టల్ పేరుతో పేదల భూములు ఏ రకంగా గుంజుకుంటున్నారో భారత్ జోడో యాత్ర సమయంలోనే తెలుసుకున్నా. మిషన్ కాకతీయలో అవినీతికి పాల్పడ్డారు. సమాజంలోని అన్ని వర్గాల నుంచి ఎంతో కొంత బీఆర్‌ఎస్ ప్రభుత్వం దోచుకుంది. రైతులు, దళితులు, ఆదివాసీలు, యువత... ఇలా అందరినీ కేసీఆర్ దోచుకుంటున్నారు.
కేసీఆర్ అవినీతి వెనుక నరేంద్ర మోదీ ఒత్తిడి ఉంది. లిక్కర్ కుంభకోణం జరిగిందని అన్ని దర్యాప్తు సంస్థలకూ తెలుసు. కానీ ఎలాంటి చర్యలూ తీసుకోరు. అందుకే బీఆర్‌ఎస్ అనేది బీజేపీకి బీ టీం అని చెబుతున్నాం. అందుకే బీఆర్‌ఎస్ కూడా బీజేపీ రిస్తేదార్ సమితిగా పేరు మార్చుకుంది..’ అని రాహుల్ విమర్శించారు.
ఇక్కడా అదే జరగబోతోంది..
‘కొన్ని నెలల ముందు కర్ణాటక ఎన్నికల్లో పోరాడాం. అక్కడ కూడా అవినీతి సర్కార్, పేదల వ్యతిరేక ప్రభుత్వం ఉండేది. ఆ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఓడించింది. ఈ క్రమంలో ప్రతి పేద వ్యక్తి కాంగ్రెస్‌తో నిలబడ్డాడు. ఒకవైపు బీజేపీ, కొందరు సంపన్నులు, మరోవైపు రైతులు, కార్మికులు, దళితులు, చిన్నచిన్న దుకాణాల వారు, మైనార్టీలు, వెనుకబడిన ప్రజలు. వీరంతా కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడారు. బీజేపీని ఓడించారు.
అదే తెలంగాణలోనూ జరగబోతోంది. కేసీఆర్, ఆయన కుటుంబం, మరో 10–15 మంది డబ్బున్నవారు ఒకవైపు, తెలంగాణలోని పేదలు, దళిత, ఆదివాసీలు, రైతులు, కార్మికులు, కాంగ్రెస్ పార్టీ మరోవైపుగా పోరాడబోతున్నారు. తెలంగాణలో కూడా కర్ణాటకలో జరిగిందే జరగబోతోంది. మొన్నటి వరకు తెలంగాణలో త్రిముఖ పోటీ ఉంటుందని చెప్పారు.
బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఉందని భావించారు. కానీ ఇప్పుడు తెలంగాణలో బీజేపీ లేదు. ఖతం అయిపోయింది. ఆ పార్టీ ఎక్కడుందో కూడా తెలియకుండా పోయింది. బీజేపీ బండి హైవేపై వెళ్తుంటేనే నాలుగు టైర్లు పంక్చర్ అయ్యాయి. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ బీ టీం(బీఆర్‌ఎస్) మధ్వే పోటీ ఉంటుంది..’ అని రాహుల్ అన్నారు.
విద్వేషపు దారిలో ప్రేమ కుటీరం తెరిచాం..
‘వరంగల్ సభలో రైతు డిక్లరేషన్, హైదరాబాద్‌లో యూత్ డిక్లరేషన్ చేశాం. ఇప్పుడు ఖమ్మంలో మరో అడుగు ముందుకు వేస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేయూత పేరుతో వయోవృద్ధులు, వితంతువులకు నెలకు రూ.4వేల పింఛ¯న్ ఇస్తాం. ఇది పేదలకు సాయం చేయడంలో పెద్ద ముందడుగు. పోడు భూములన్నీ ఆదివాసీలకు ఇస్తాం.
భారత్ జోడో యాత్ర సందర్భంగా మీరు చూపిన ప్రేమకు ధన్యవాదాలు. బీజేపీది విద్వేషం అయితే, కాంగ్రెస్ పార్టీది ప్రేమ సిద్ధాంతం. అందుకే చెబుతున్నా విద్వేషపు దారిలో ప్రేమ కుటీరం తెరిచాం. (నఫ్రత్ కీ బజార్‌మే మొహబ్బత్‌కీ దుకాణ్ ఖోలే) అందరికీ నమస్కారం.’ అంటూ రాహుల్ గాంధీ తన ప్రసంగాన్ని ముగించారు. రాహుల్ ప్రసంగాన్ని ఎంపీ ఉత్తమకుమార్‌రెడ్డి తెలుగులోకి అనువదించారు. తొలుత వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన సీఎల్పీ నేత భట్టికి ధన్యవాదాలు తెలిపి సన్మానించిన రాహుల్.. పొంగులేటితో పాటు ఆయన ముఖ్య అనుచరులకు కండువాలు కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.
Comments
Please login to add a commentAdd a comment