
సాక్షి, హైదరాబాద్: గురుకుల కొలువులకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ) కీలక ప్రకటన చేసింది. ఆగస్టులో అర్హత పరీక్షలను నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఆగస్టు 1వ తేదీ నుంచి 23వ తేదీ మధ్యన అర్హత పరీక్షలను నిర్వహిస్తామని, ఇందుకు సంబంధించిన స్పష్టమైన తేదీలను రెండ్రోజుల్లో ప్రకటించనున్నట్లు వెల్లడించింది.
పూర్తి పరీక్షల షెడ్యూల్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు గురువారం టీఆర్‌ఈఐఆర్‌బీ కన్వినర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. 9 కేటగిరీల్లో 9,210 పోస్టుల భర్తీకి టీఆర్‌ఈఐఆర్‌బీ ప్రకటనలు విడుదల చేసి దరఖాస్తులు స్వీకరించింది. ప్రస్తుతం దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు అవకాశం కల్పించింది. ఈ ప్రక్రియ నెలాఖరులో పూర్తి కానుంది. 9,210 కొలువులకు 2,63.045 దరఖాస్తులు వచ్చాయి. ఈ లెక్కన ఒక్కో పోస్టుకు సగటున 29 మంది పోటీ పడుతున్నట్లు అంచనా.
సీబీటీ పద్ధతిలో పరీక్షలు: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిర్వహించే అర్హత పరీక్షలన్నీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) మోడ్‌లో నిర్వహించనున్నట్లు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు స్పష్టం చేసింది. తొలుత ఓఎంఆర్ పద్ధతిలో పరీక్షలు నిర్వహించాలని భావించినప్పటికీ... టీఎస్‌పీఎస్సీలో ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం నేపథ్యంలో పరీక్ష నిర్వహణకు సీబీటీ పద్ధతిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సీబీటీ పరీక్షల సామర్థ్యం కూడా అభ్యర్థుల సంఖ్యకు తగినట్లుగా ఉండడంతో టీఆర్‌ఈఐఆర్‌బీ ఈ దిశగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment