Gurukul posts
-
ఆగస్టులో గురుకుల కొలువుల పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: గురుకుల కొలువులకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ) కీలక ప్రకటన చేసింది. ఆగస్టులో అర్హత పరీక్షలను నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఆగస్టు 1వ తేదీ నుంచి 23వ తేదీ మధ్యన అర్హత పరీక్షలను నిర్వహిస్తామని, ఇందుకు సంబంధించిన స్పష్టమైన తేదీలను రెండ్రోజుల్లో ప్రకటించనున్నట్లు వెల్లడించింది. పూర్తి పరీక్షల షెడ్యూల్‌ను వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు గురువారం టీఆర్‌ఈఐఆర్‌బీ కన్వినర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. 9 కేటగిరీల్లో 9,210 పోస్టుల భర్తీకి టీఆర్‌ఈఐఆర్‌బీ ప్రకటనలు విడుదల చేసి దరఖాస్తులు స్వీకరించింది. ప్రస్తుతం దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు అవకాశం కల్పించింది. ఈ ప్రక్రియ నెలాఖరులో పూర్తి కానుంది. 9,210 కొలువులకు 2,63.045 దరఖాస్తులు వచ్చాయి. ఈ లెక్కన ఒక్కో పోస్టుకు సగటున 29 మంది పోటీ పడుతున్నట్లు అంచనా. సీబీటీ పద్ధతిలో పరీక్షలు: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిర్వహించే అర్హత పరీక్షలన్నీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) మోడ్‌లో నిర్వహించనున్నట్లు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు స్పష్టం చేసింది. తొలుత ఓఎంఆర్ పద్ధతిలో పరీక్షలు నిర్వహించాలని భావించినప్పటికీ... టీఎస్పీఎస్సీలో ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం నేపథ్యంలో పరీక్ష నిర్వహణకు సీబీటీ పద్ధతిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సీబీటీ పరీక్షల సామర్థ్యం కూడా అభ్యర్థుల సంఖ్యకు తగినట్లుగా ఉండడంతో టీఆర్‌ఈఐఆర్‌బీ ఈ దిశగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. -
గురుకుల దరఖాస్తుకూ ‘పరీక్షే’! హెల్ప్‌డెస్క్ ఉంది.. కానీ, సాయం అందదు
సాక్షి, హైదరాబాద్: గురుకుల ఉద్యోగాల దరఖా స్తు ప్రక్రియ ప్రహసనంగా మారింది. నోటిఫికేషన్లు జారీచేసి నెలైనా సాంకేతిక సమస్యలు తీరకపోవ డంతో ఆభ్యర్థులు సతమతమవుతున్నారు. వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్)లో తలెత్తుతున్న సమస్యలతో దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగట్లేదు. ఒకే అభ్యర్థి పలు పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే ప్రతిసారీ వివరాలు నమోదు కష్టమని భా వించి తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ఈ విధానాన్ని తెచ్చింది. ఈ క్రమంలోనే బోర్డు గత నెల 5న 9 ఉద్యోగ ప్రకటనలు జారీచేయగా.. ఏప్రిల్ 17 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. కానీ ఓటీఆర్, దరఖాస్తు ప్రక్రియలోని సాంకేతిక సమస్యలు అభ్యర్థులను చికాకుపెడుతున్నాయి. ‘దరఖాస్తు’కే చుక్కెదురు.. సంక్షేమ గురుకులాల్లో 9 కేటగిరీల్లో ఉద్యోగాల భర్తీకి తొమ్మిది నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇందులో జేఎల్, డీఎల్ తదితర పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఈనెల 17తో ముగిసింది. గురుకుల పాఠశాలల్లో టీజీటీ, పీజీటీ తదితర పోస్టులకు దరఖాస్తు గడువు వచ్చే వారంలో ముగియనుంది. అయితే, ఆయా పోస్టులకు తొలి వారం రోజులు సర్వర్ సమస్యలతో దరఖాస్తు ప్రక్రియ నెమ్మదించింది. పెద్దసంఖ్యలో యూజర్లు వెబ్‌సైట్‌ను తెరవడంతో సర్వర్‌పై ఒత్తిడి పెరిగిందని అధికారులు చెబుతున్నారు. కానీ, దరఖాస్తు గడువు ముగిసే వరకు కూడా సాంకేతిక సమస్యలు అలాగే ఉండడంతో చాలామంది దరఖాస్తు చేయలేకపోయారు. కనీసం గురుకుల పాఠశాలల్లో కొలువులకు దరఖాస్తు ప్రక్రియలోనైనా సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఇక, దరఖాస్తు, ఇతర సాంకేతిక సమస్యలపై క్షేత్రస్థాయిలో ఫిర్యాదుల పరిష్కారానికి గురుకుల బోర్డు ఫోన్‌నంబర్, ఈ–మెయిల్‌తో హెల్ప్‌డెస్క్ ఏర్పాటుచేసింది. అయితే ఇది వినతుల స్వీకరణకే పరిమితమైందని అభ్యర్థులు మండిపడుతున్నారు. ఎన్నిసార్లు ఫోన్లుచేసినా స్పందించట్లేదని బోర్డుకు ఫిర్యాదులు అందుతున్నాయి. వారం పట్టింది గురుకులాల్లో జూనియర్, డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలకు దరఖాస్తుకు వారం పట్టింది. ఓటీఆర్ కోసం వరుసగా ఐదురోజుల పాటు ప్రయత్నించాను. ఏడాదిన్నరగా జేఎల్, డీఎల్ ఉద్యోగాలకు సన్నద్ధమవుతుండగా.. కేవలం దరఖాస్తు ప్రక్రియే కష్టమైపోయింది. – డి.నర్సింగ్‌రావు, కొడంగల్, వికారాబాద్ జిల్లా ఓటీఆర్ నమోదు కాక దరఖాస్తుకు దూరమయ్యాను ఓటీఆర్ కోసం పదిరోజులు ప్రయత్నించాను. మాసాబ్‌ట్యాంక్‌లోని బోర్డు కార్యాలయానికి వెళ్లి చెప్పాను. ప్రయోజనం లేకపోగా, చివరకు దరఖాస్తు చేయకుండానే జేఎల్, డీఎల్ గడువు ముగిసిపోయింది. గడువును వారమైనా పొడిగించాలి. – చీపురు ప్రవీణ్‌కుమార్, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా -
గురుకులాల్లో కొలువులు 12,000.. అతి త్వరలో నోటిఫికేషన్లు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరిన్ని ప్రభు త్వ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే పోలీసు, గ్రూప్స్ కొలువులకు నోటిఫికేషన్లు జారీకాగా.. తాజాగా గురుకులాల్లో 12 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) చర్యలు చేపట్టింది. ఈ నెల మూడో వారంలోగా నోటిఫికేషన్లు విడుదల కానున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 17వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి నియామకాల ప్రక్రియను వేగంగా కొనసాగిస్తోంది. గ్రూప్–1, గ్రూప్–4 పోస్టులతో పాటు పలు శాఖల్లో ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నోటిఫికేషన్లు ఇచ్చింది. ఇప్పుడు గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వరుసగా నోటిఫికేషన్లు వస్తుండటం, భారీగా ఉద్యోగాల భర్తీ చేపడుతుండటంతో నిరుద్యోగుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. పెరిగిన కొలువులు.. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్), మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్)ల పరిధిలో 9,096 పోస్టుల భర్తీకి గతంలోనే ఆమోదం వచ్చింది. వాటికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే గురుకుల నియామకాల బోర్డుకు చేరాయి. తాజాగా మరో 3వేల పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. వీటికి ఆర్థిక శాఖ అనుమతులు జారీచేసిన వెంటనే భర్తీ ప్రక్రియ మొదలుకానుంది. దీనితో మొత్తంగా ఉద్యోగ ఖాళీలు 12 వేలకు పెరిగాయి. 12వేలకు పెరిగిన కొలువులు సీఎం ప్రస్తుతం ఆమోదించిన పోస్టులన్నీ కొత్త విద్యా సంస్థల్లోనివే. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా 33 బీసీ గురుకుల పాఠశాలలు, 15 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలను ప్రారంభించింది. మరోవైపు 119 బీసీ గురుకుల పాఠశాలలు, మైనార్టీ సొసైటీ పరిధిలో 97 పాఠశాలలు జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ అయ్యాయి. ఇలా కొత్తగా ప్రారంభించిన, అప్‌గ్రేడ్ చేసిన పాఠశాలల్లో బోధన కేటగిరీలో 3వేల కొలువుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఏకకాలంలో నోటిఫికేషన్లు గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగ ఖాళీలకు ఏకకాలంలో నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి అంతర్గత పరిశీలన దాదాపు పూర్తి కావచ్చింది. 9,096 పోస్టులకు సంబంధించి గురుకుల సొసైటీలు ఇప్పటికే టీఆర్‌ఈఐఆర్‌బీ (ట్రిబ్)కు సమర్పించగా.. రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు, ఇతర అంశాలపై లోతుగా పరిశీలన చేపట్టింది. దీనికితోడు ఇప్పుడు మరో 3వేల పోస్టుల భర్తీకి ఆమోదం వచ్చింది. వీటికి ఆర్థికశాఖ ఓకే చెప్పగానే అన్నిపోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్లు ఇస్తే నియామకాల ప్రక్రియ సులభతరం అవుతుందని ట్రిబ్ అధికారులు భావిస్తున్నారు. కాస్త ఆలస్యమైనా పెద్ద సంఖ్యలో పోస్టుల భర్తీతో నిరుద్యోగులకు సైతం ఉత్సాహం వస్తుందని అంటున్నారు. చాలా వరకు బోధన పోస్టులే.. గురుకులాల్లో భర్తీ చేయనున్న 12వేల పోస్టుల్లో చాలా వరకు టీజీటీ (ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్), పీజీటీ (పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్) పోస్టులే ఉన్నాయి. ఈ రెండు కేటగిరీల్లో పోస్టుల భర్తీకి ఏకకాలంలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు. వీటితోపాటు ప్రిన్సిపల్, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, పీఈటీ, ఫిజికల్ డైరెక్టర్ తదితర కేటగిరీలకు వరుసగా ప్రకటనలు జారీ చేయనున్నట్టు అధికారులు చెప్తుతున్నారు. మొత్తంగా ఈనెల మూడో వారం నాటికి నోటిఫికేషన్ల జారీ మొదలయ్యే అవకాశం ఉందని వివరిస్తున్నారు. -
గురుకులాల్లో మరో 1,000 కొలువులు!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో కొత్తగా మరో వెయ్యి కొలువుల భర్తీకి సన్నాహాలు మొదలయ్యాయి. ఇటీవల నాలుగు గురుకుల సొసైటీల్లో 9,096 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇవన్నీ బోధన విభాగానికి సంబంధించినవే. తాజాగా మరో వెయ్యి బోధనేతర ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో అనుమతులు ఇవ్వనుంది. ఇందుకు సంబంధించి ఉద్యోగ ఖాళీల వివరాలను సంబంధిత గురుకుల సొసైటీలు ప్రభుత్వానికి నివేదించాయి. తాజాగా గుర్తించిన ఖాళీలన్నీ జూనియర్ అసిస్టెంట్ కేడర్‌కు చెందినవే. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పెద్ద సంఖ్యలో గురుకుల విద్యా సంస్థలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ వచ్చింది. విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తున్నప్పుడు కేటగిరీల వారీగా పోస్టులను మంజూరు చేసిన ప్రభుత్వం.. తాజాగా వాటిని శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తోంది. ఇప్పటికే దాదాపు 10 వేల ఉద్యోగాలను మూడేళ్ల క్రితం భర్తీ చేయగా..ఇప్పుడు మరిన్ని ఖాళీల భర్తీకి ఉపక్రమించింది. అత్యధికంగా బీసీ గురుకులంలో.. ప్రస్తుతం ప్రభుత్వం అనుమతిం చనున్న వెయ్యి జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లో అత్యధికం బీసీ గురుకుల సొసైటీలోనే ఉన్నాయి. దాదాపు 450 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కేవలం బీసీ గురుకుల సొసైటీలోనే భర్తీ కానున్నాయి. ఆ తర్వాత 300 పోస్టులు మైనార్టీ, 150 పోస్టులు ఎస్సీ, మరో 100 పోస్టులు ఎస్టీ గురుకుల సొసైటీలో భర్తీ కానున్నట్లు సమాచారం. ఈ పోస్టులను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. గురుకుల విద్యా సంస్థల్లోని ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రత్యేకంగా తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ఉన్నప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్–4 ఉద్యోగాల భర్తీ బాధ్యతలు టీఎస్పీఎస్సీకే ప్రభు త్వం అప్పగించింది. దీంతో ఈ పోస్టులు కూడా టీఎస్పీఎస్సీ ద్వారానే భర్తీ చేయనున్నారు. వారాంతంలో ట్రిబ్ సమావేశం తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు ఈ వారాంతంలో సమావేశం కానుంది. ఇప్పటికే ప్రభుత్వం ఆమోదించిన 9,096 ఉద్యోగాలకు గురుకుల సొసైటీల ద్వారా ఇండెంట్లు గురుకుల బోర్డుకు చేరుతున్నాయి. ఒకట్రెండు రోజుల్లో అన్ని సొసైటీల నుంచి ప్రతిపాదనలు వచ్చిన తర్వాత సమావేశమై పోస్టుల భర్తీకి రిజర్వేషన్లు, రోస్టర్, జోనల్, మల్టీజోనల్, జిల్లా కేడర్ల వారీగా పోస్టుల వివరాలను సరిచూసుకోనుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు బోర్డు వర్గాలు చెబుతున్నాయి. -
విజిల్స్ మోత.. దారులు మూసివేత
పంజగుట్ట(హైదరాబాద్): కట్టుదిట్టమైన భద్రత.. బారులుగా బారికేడ్లు.. ఒక్కసారిగా విజిల్స్ మోత.. హోరెత్తిన నినాదాలు.. అటుగా దూసుకొచ్చిన యువతీయువకులు.. ప్రధాన ద్వారం వైపు పరుగులు.. ద్వారాలు, దారులు మూసివేత... అప్రమత్తమైన పోలీసులు ఎక్కడికక్కడ అడ్డగింపు.. ఇదీ ప్రగతిభవన్ వద్ద సోమవారం చోటుచేసుకున్న సన్నివేశం. గురుకుల వ్యాయామ ఉపాధ్యాయ పోస్టుల భర్తీని వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ గురుకుల పీఈటీ అభ్యర్థులు సోమవారం ఇక్కడి ప్రగతిభవన్ ముట్టడికి యత్నించారు. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, విజిల్ సౌండ్లతో ప్రగతిభవన్ వద్దకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడ భారీగా మోహరించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని గోషామహల్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా గురుకుల పీఈటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాదగోని సైదులుగౌడ్ మాట్లాడుతూ 616 గురుకుల వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులకు 2017 ఏప్రిల్ 20న నోటిఫికేషన్ విడుదల చేయగా, 2017 సెప్టెంబర్ 17, 18వ తేదీల్లో అర్హత పరీక్షలు రాశామని తెలిపారు. 2018 మే 17న ఒక్క పోస్టుకు ఇద్దరు చొప్పున 1,232 మంది అభ్యర్థులను ఎంపిక చేసి, 2018 మే 18 నుండి 23 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేశారని, తర్వాత కోర్టు తీర్పు పేరుతో నియామకాలు ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నియామకాలు చేపట్టాలని కోరారు. పీఈటీ టీచర్ల పోరుకు బీసీ సంఘం సంఘీభావం వెంటనే పోస్టింగ్‌లు ఇవ్వాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ హైదరాబాద్ (గన్‌ఫౌండ్రీ): పీఈటీ ఉపాధ్యాయులకు తక్షణమే పోస్టింగ్ ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం ప్రగతిభవన్ ముట్టడికి యత్నించి అరెస్టయి గోషామహల్ పోలీస్ స్టేడియంలో ఉన్న పీఈటీ ఉపాధ్యాయులను ఆయన కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా పీఈటీ టీచర్ల ఆందోళనకు సంఘీభావం ప్రకటించి కృష్ణయ్య మాట్లాడారు. 1,232 మంది పీఈటీ ఉపాధ్యాయులుగా ఎంపికై మూడేళ్లు గడిచినా నేటికీ పోస్టింగ్‌లు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టింగ్ వచ్చిందనే ఆశతో ఇతర పనులకు వెళ్లలేక, పోస్టింగ్ రాక ఎంపికైన వారు ఎంతో మానసిక క్షోభకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థను ఒక పథకం ప్రకారం ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఖాళీగా ఉన్న పోస్టులకు వెంటనే ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, ప్రతినిధులు వేముల రామకృష్ణ, ఉదయ్, సుధాకర్ పాల్గొన్నారు. ధర్నాలో పాల్గొన్న బీసీ సంఘం నాయకులు -
‘గురుకుల’ సీట్లను పెంచండి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో సీట్ల సంఖ్యను పెంచాలని ప్రభుత్వానికి అధికారపక్ష ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. గురుకుల పాఠశాలల్లో సీట్లు పెంచాలని తల్లిదండ్రుల నుంచి విపరీతమైన డిమాండ్ ఉందని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. కొన్నిసార్లు విద్యార్థుల తల్లిదండ్రులకు సమాధానం చెప్పలేక ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకుంటున్నామని వెల్లడించారు. శనివారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో పాఠశాలలు, వాటి నిర్వహణ తదితర అంశాలపై ఎమ్మెల్యేలు బాల్క సుమన్, బాజిరెడ్డి గోవర్ధన్, బాపూరావు రాథోడ్, సండ్ర వెంకటవీరయ్య ఈ సమస్యలను లేవనెత్తారు. క్షేత్రస్థాయిలో గురుకుల సీట్లకు పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్నందున ప్రస్తుతం ఉన్న పాఠశాలల్లో సీట్లు పెంచడంతోపాటు కొత్తవి మంజూరు చేయాలని బాల్క సుమన్, బాజిరెడ్డి కోరారు. ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ.. ఎమ్మెల్యే బీఫాం అయినా సులభంగా ఇవ్వవచ్చేమో కానీ, గురుకుల పాఠశాలల్లో సీట్లు ఇప్పించడం చాలా కష్టంగా ఉందని, కొన్నిసార్లు విద్యార్థుల తల్లిదండ్రులకు సమాధానం చెప్పలేక ఫోన్లు స్విచ్ఛాఫ్ పెట్టాల్సిన పరిస్థితి ఉందని చమత్కరించారు. దీనిపై షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమాధానమిస్తూ.. క్షేత్రస్థాయిలో గురుకులాల్లో చేరేందుకు అధిక డిమాండ్ ఉన్న మాట వాస్తవమేనన్నారు. ఈ ఏడాది గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో అడ్మిషన్ కోసం లక్షా 35 వేల 605 దరఖాస్తులు రాగా, అర్హులకు ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహించి సీట్లు ఇస్తున్నా.. ఇంకా డిమాండ్ వస్తోందన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వంతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని మంత్రి కొప్పుల పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖలు కలిపి మొత్తం 602 ఆశ్రమ పాఠశాలల్లో 2,39,749 మంది విద్యార్థులకు విద్యనందిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. మొత్తం పాఠశాలల్లో కలిపి 11,785 మంది సిబ్బందిని నియమించామని, ఏటా రూ.2,243.46 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. కార్మికులకు 10 సంక్షేమ పథకాలు: మంత్రి మల్లారెడ్డి రాష్ట్రంలోని భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర కారి్మక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. తీవ్రమైన ప్రమాద సహాయం, అంగవైకల్య సహాయం, వికలాంగుల సాధనలు, పరికరాలు, సహజ మరణ సహాయం, అంత్యక్రియల ఖర్చులు, పెళ్లి కానుక, ప్రసూతి ప్రయోజనం, వైద్య సహాయం, నైపుణ్యాభివృద్ధి, నమోదు చేసుకోని కారి్మకులకు సహాయం ఇలా మొత్తం పది పథకాలు అమలు చేస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. -
2,444 ‘గురుకుల’ పోస్టులకు ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో 2,444 ఖాళీ పోస్టులను గుర్తిస్తూ తెలంగాణ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ గురుకుల విద్యాలయ సంస్థల సొసైటీల పరిధిలో ఉన్న ఖాళీలన్నింటినీ సమీక్షించిన ప్రభుత్వం ఈ జాబితాను వెల్లడించింది. పోస్టులవారీగా ఖాళీల వివరాలతో ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 758 పోస్టులు, ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో 313, బీసీ సంక్షేమ గురుకులాల్లో 307, గిరిజన సంక్షేమ గురుకులాల్లో 436, మైనారిటీ సంక్షేమ శాఖ గురుకులాల్లో 630 పోస్టులు గుర్తించిన వాటిలో ఉన్నాయి. డెరైక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిన ఈ పోస్టులను భర్తీ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టే బాధ్యతలను టీఎస్పీఎస్సీకి ప్రభుత్వం అప్పగించింది. ఆయా విభాగాలు అందించే లోకల్ కేడర్, సబ్జెక్ట్‌లవారీగా ఖాళీల వివరాలు, రోస్టర్ పాయింట్లు, అర్హతలను ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. పోస్టులవారీగా ఈ వివరాలను వెంటనే టీఎస్పీఎస్సీకి అందించాలని సంబంధిత విభాగాలను ఆర్థిక శాఖ ఆదేశించింది. వీలైనంత త్వరగా ఈ నియామకాలకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. విభాగాల వారీగా పోస్టులు, ఖాళీల వివరాలు: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ పరిధిలో మొత్తం 758 పోస్టులున్నాయి. వీటిలో 12 ప్రిన్సిపల్, 560 టీజీటీ, 79 పీఈటీ, 52 ఆర్ట్/మ్యూజిక్, 3 క్రాఫ్ట్, 34 లైబ్రేరియన్, 18 స్టాఫ్ నర్స్ పోస్టులున్నాయి. తెలంగాణ గురుకుల విద్యాలయాల సొసైటీ పరిధిలో ఉన్న 313 పోస్టుల్లో 6 జూనియర్ లెక్చరర్లు(ఇంటర్), 136 పీజీటీ, 74 టీజీటీ, 22 పీఈటీ, 43 ఆర్ట్/క్రాఫ్ట్/మ్యూజిక్ టీచర్, 32 స్టాఫ్ నర్స్ పోస్టులున్నాయి. మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ పరిధిలో 307 పోస్టులున్నాయి. వీటిలో 7 ప్రిన్సిపల్, 83 పీజీటీ, 99 టీజీటీ, 16 పీఈటీ, 28 ఆర్ట్ టీచర్, 16 స్టాఫ్ నర్స్, 22 జూనియర్ లెక్చరర్(ఇంటర్), 36 డిగ్రీ కాలేజీ లెక్చరర్ల పోస్టులున్నాయి. తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ పరిధిలో 436 పోస్టులున్నాయి. వీటిలో 41 జూనియర్ లెక్చరర్లు(ఇంటర్), 26 లైబ్రేరియన్, 40 పీజీటీ, 271 టీజీటీ, 6 పీడీ, 33 పీఈటీ, 19 ఆర్ట్/క్రాఫ్ట్/మ్యూజిక్ టీచర్ పోస్టులున్నాయి. తెలంగాణ మైనారిటీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ పరిధిలో 630 పోస్టులున్నాయి. 70 ప్రిన్సిపల్, 350 టీజీటీ, 70 పీఈటీ, 70 స్టాఫ్ నర్స్, 70 క్రాఫ్ట్/ఆర్ట్/మ్యూజిక్ టీచర్ పోస్టులున్నాయి.