‘గురుకుల’ సీట్లను పెంచండి | Number of Seats in Gurukul Schools Should Be Increased Says Malla reddy | Sakshi
Sakshi News home page

‘గురుకుల’ సీట్లను పెంచండి

Published Sun, Sep 15 2019 4:31 AM | Last Updated on Sun, Sep 15 2019 4:31 AM

Number of Seats in Gurukul Schools Should Be Increased Says Malla reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో సీట్ల సంఖ్యను పెంచాలని ప్రభుత్వానికి అధికారపక్ష ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. గురుకుల పాఠశాలల్లో సీట్లు పెంచాలని తల్లిదండ్రుల నుంచి విపరీతమైన డిమాండ్‌ ఉందని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. కొన్నిసార్లు విద్యార్థుల తల్లిదండ్రులకు సమాధానం చెప్పలేక ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేసుకుంటున్నామని వెల్లడించారు. శనివారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో పాఠశాలలు, వాటి నిర్వహణ తదితర అంశాలపై ఎమ్మెల్యేలు బాల్క సుమన్, బాజిరెడ్డి గోవర్ధన్, బాపూరావు రాథోడ్, సండ్ర వెంకటవీరయ్య ఈ సమస్యలను లేవనెత్తారు. క్షేత్రస్థాయిలో గురుకుల సీట్లకు పెద్ద ఎత్తున డిమాండ్‌ వస్తున్నందున ప్రస్తుతం ఉన్న పాఠశాలల్లో సీట్లు పెంచడంతోపాటు కొత్తవి మంజూరు చేయాలని బాల్క సుమన్, బాజిరెడ్డి కోరారు.

ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ.. ఎమ్మెల్యే బీఫాం అయినా సులభంగా ఇవ్వవచ్చేమో కానీ, గురుకుల పాఠశాలల్లో సీట్లు ఇప్పించడం చాలా కష్టంగా ఉందని, కొన్నిసార్లు విద్యార్థుల తల్లిదండ్రులకు సమాధానం చెప్పలేక ఫోన్లు స్విచ్ఛాఫ్‌ పెట్టాల్సిన పరిస్థితి ఉందని చమత్కరించారు. దీనిపై షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సమాధానమిస్తూ.. క్షేత్రస్థాయిలో గురుకులాల్లో చేరేందుకు అధిక డిమాండ్‌ ఉన్న మాట వాస్తవమేనన్నారు. ఈ ఏడాది గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో అడ్మిషన్‌ కోసం లక్షా 35 వేల 605 దరఖాస్తులు రాగా, అర్హులకు ఎంట్రెన్స్‌ పరీక్ష నిర్వహించి సీట్లు ఇస్తున్నా.. ఇంకా డిమాండ్‌ వస్తోందన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వంతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని మంత్రి కొప్పుల పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖలు కలిపి మొత్తం 602 ఆశ్రమ పాఠశాలల్లో 2,39,749 మంది విద్యార్థులకు విద్యనందిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. మొత్తం పాఠశాలల్లో కలిపి 11,785 మంది సిబ్బందిని నియమించామని, ఏటా రూ.2,243.46 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు.  

కార్మికులకు 10 సంక్షేమ పథకాలు: మంత్రి మల్లారెడ్డి  
రాష్ట్రంలోని భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర కారి్మక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. తీవ్రమైన ప్రమాద సహాయం, అంగవైకల్య సహాయం, వికలాంగుల సాధనలు, పరికరాలు, సహజ మరణ సహాయం, అంత్యక్రియల ఖర్చులు, పెళ్లి కానుక, ప్రసూతి ప్రయోజనం, వైద్య సహాయం, నైపుణ్యాభివృద్ధి, నమోదు చేసుకోని కారి్మకులకు సహాయం ఇలా మొత్తం పది పథకాలు అమలు చేస్తున్నట్టు మంత్రి వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement