సీట్ల బ్లాకింగ్‌లో వందల కోట్ల లావాదేవీలు | Private medical college seats scam Enforcement Directorate | Sakshi
Sakshi News home page

సీట్ల బ్లాకింగ్‌లో వందల కోట్ల లావాదేవీలు

Jun 23 2023 4:45 AM | Updated on Jun 23 2023 4:45 AM

Private medical college seats scam Enforcement Directorate - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వివిధ ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు రూ. లక్షల విలువ చేసే పీజీ సీట్లను రూ. కోట్లకు అమ్ముకున్నట్లు... ఈ కళాశాలల్లో రూ.వందల కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గుర్తించింది. ముఖ్యంగా మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో భారీ మొత్తంలో నగదును సీజ్‌ చేసినట్లు ఈడీ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.

బుధవారం నాటి సోదాల సందర్భంగా మల్లారెడ్డి మెడికల్‌ కాలేజీ కార్యాలయాల నుంచి రూ. 1.4 కోట్ల నగదును స్వా ధీనం చేసుకున్నామని... ఆ కాలేజీ బ్యాంకు ఖాతాలో మరో రూ. 2.89 కోట్ల నగదును స్తంభింపజేశామని వివరించింది.రాష్ట్రవ్యాప్తంగా 16 ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో బుధవారం జరిపిన సోదాల్లో పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలు, హార్డ్‌డిస్క్‌లు, ఇతర రికార్డులను స్వాదీనం చేసుకున్నట్లు వెల్లడించిన ఈడీ... మల్లారెడ్డి మెడికల్‌ కాలేజీ నుంచి నగదు స్వా«దీనం చేసుకున్నట్లు మాత్రమే ప్రకటనలో పేర్కొనడం గమనార్హం. 

లక్షల పెట్టుబడితో కోట్ల సంపాదన... 
కాళోజీ యూనివర్సిటీ అధికారులు గతేడాది చేసిన ఫిర్యాదు మేరకు మెడికల్‌ సీట్ల బ్లాకింగ్‌ దందాపై వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని మట్టెవాడ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో మనీలాండరింగ్‌ చట్టాల కింద కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు సీట్ల బ్లాకింగ్‌ దందాపై ఆరా తీశారు.

పూర్తిస్థాయిలో ప్రాథమిక ఆధారాలు సేకరించి బుధవారం హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, రంగారెడ్డి, సంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ తదితర 16 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు జరిపిన ఈ సోదాల్లో కీలక ఆధారాలు సేకరించారు. 

కొల్లగొట్లే దానిలో కొంత వాళ్లకు... 
మెరిట్‌ విద్యార్థులతో కుమ్మక్కై పీజీ మెడికల్‌ సీట్ల బ్లాకింగ్‌ దందాలో దండుకున్న డబ్బులో కొంత మొత్తాన్ని సీట్లు బ్లాక్‌ చేసేందుకు అంగీకరించిన విద్యార్థులకు సదరు కాలేజీలు చెల్లిస్తున్నట్లు ఈడీ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. ఆరోగ్య వర్సిటీల కౌన్సెలింగ్‌లు పూర్తయ్యాక కూడా మిగిలే సీట్లను ప్రైవేటు కాలేజీలు సొంతంగా భర్తీ చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు ఇచ్చింది.

ఈ వెసులుబాటును అనుకూలంగా మార్చుకొని కొన్ని ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు సీట్ల బ్లాకింగ్‌ దందాకు తెరతీశాయి. పీజీ నీట్‌ పరీక్షలో మెరిట్‌ ఆధారంగా ముందుగానే ఓ కళాశాలలో కన్వీనర్‌ కోటాలో పీజీ సీటు పొందిన విద్యార్థులతో మరో కళాశాలలోనూ కౌన్సెలింగ్‌ పూర్తయ్యే వరకు సీటు బ్లాక్‌ చేయిస్తున్నారు. ఇలా చివరకు మిగిలిపోయిన సీట్లలో ఒక్కో సీటును రూ. కోటి నుంచి రూ. 2.5 కోట్లకు విక్రయిస్తున్నట్లు ఈడీ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు.

కౌన్సెలింగ్‌లో సీట్లు తీసుకోని విద్యార్థులు చివరకు యూనివర్సిటీకి చెల్లించాల్సిన అపరాధ రుసుమును సైతం వారి తరఫున కాలేజీల యాజమాన్యాలే చెల్లిస్తున్నాయి. గుడ్‌విల్‌ కింద వారికి రూ. లక్షల్లో ముట్టజెప్పుతున్నాయి. ఇలా సీట్ల బ్లాక్‌ దందాతో రూ. లక్షలు ఖర్చు చేసి రూ. కోట్లు సంపాదిస్తున్నట్టు ఈడీ అధికారులు ఆధారాలు సేకరించారు. ఈ మొత్తం వ్యవహారంపై లోతుగా దర్యాప్తు కొనసాగుతుందని, త్వరలోనే మరికొన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని ఈడీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement