
వరంగల్ : ‘ధర్మారెడ్డి.. తరిమికొట్టడం నీకేం తెలుసు.. తరిమికొట్టడమంటే కొండా మురళీకి తెలుసు.. మా కార్యకర్తలు నిన్ను ఉరికిస్తరు.. మైసమ్మ సాక్షిగా చెబుతున్నా.. పరకాలలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు నిలుచున్నా నిన్ను ఓడిస్తా’ ఖబర్దార్ అంటూ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు చల్లాపై మండిపడ్డారు. మంత్రి కేటీఆర్‌పై కొండామురళి వ్యాఖ్యలను ఖండిస్తూ చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. దీనిపై స్పందిస్తూ మంగళవారం వరంగల్ రత్నహోటల్‌లో కొండామురళి విలేకరుల సమావేశంలో ప్రతి విమర్శలు చేశారు. ‘ధర్మారెడ్డి నువ్వు నా ఇంటికి వచ్చి బతిమిలాడి రూ. 14 కోట్ల విలువైన ప్రగతి సింగారం బ్రిడ్జి పనులు తీసుకోలేదా’ అని గుర్తు చేశారు.
భూపాలపల్లి నియోజకవర్గంలో చలివాగు ప్రాజెక్టు, శాయంపేట మండల కేంద్రంలో 14 ఎకరాల్లో మోడల్ కాలేజీ, ఆత్మకూర్ పోలీస్‌స్టేషన్‌కు స్థలం ఈ పనులన్నీ తానే చేశానని, ఎమ్మెల్యే చేసింది ఏమిటని ప్రశ్నించారు. అక్రమాలను వెలికితీసే జర్నలిస్టులకే ఈ ప్రభుత్వంలో రక్షణ కరువైతే.. సామాన్యుల పరిస్థితి ఏమిటో అర్థమవుతుందన్నారు. మహిళలను అవమానించి కేసులు నమోదు చేయించే సంస్కృతి ధర్మారెడ్డి అయితే.. వారికి అండగా నిలిచే సంస్కృతి తనదన్నారు.
‘పరకాల ప్రజలకు నీ గురించి గొప్పగా తెలుసు.. నువ్వో మట్టి దొంగవు’ అని ఎద్దేవా చేశారు. మట్టి తీయడం, మొరం తీసి అమ్మడం, కాంట్రాక్టు పనుల్లో పర్సంటేజీ నొక్కడం ఇది ఎమ్మెల్యే సంస్కృతి అని మండిపడ్డారు. తూర్పులో కొండా సురేఖను, పరకాలలో కాంగ్రెస్ అభ్యర్థి తానే గెలిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తూర్పు, పరకాల నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment