Konda Muralidhar Rao
-
మీసం మెలేసిన కొండా.. తొడగొట్టిన ఇనగాల
సాక్షి, హనుమకొండ: మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు మీసం మెలేయగా.. మరో నేత ఇనగాల వెంకట్రామ్రెడ్డి తొడకొట్టడం.. ఇరువర్గాల కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు...వెరసి హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం ఆత్మకూర్ మండలం అగ్రంపహాడ్‌లోని జరిగిన సమావేశానికి పార్టీ వరంగల్ పార్లమెంట్ ఇన్చార్జ్ రవీంద్ర ఉత్తమ్‌రావు దల్వీ హాజరయ్యారు. సమావేశం ప్రారంభంకాగానే మాజీ ఎమ్మెల్సీ కొండా, పరకాల నియోజకవర్గ ఇన్చార్జ్ ఇనగాల వెంకట్రామ్రెడ్డి వర్గీయులు.. పోటాపోటీ నినాదాలు చేశారు. పీసీసీ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ శోభారాణి కలగజేసుకుని వ్యక్తిగత నినాదాలు చేయొద్దని.. పార్టీ నినాదాలు, జాతీయ నేతల నినాదాలు చేయాలని చెప్పినా ఫలితం కనిపించలేదు. నినాదాలు చేస్తే పంపిస్తామని చెప్పినా కార్యకర్తలు శాంతించలేదు. దీంతో మధ్యలోనే దల్వీ కార్యకర్తలను ఉదేశించి మాట్లాడి వెళ్లిపోయారు. ఆయనతో పాటు వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ, నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య బయటికి వెళ్లిపోవడంతో సమావేశం ముగిసింది. సమావేశప్రాంగణం బయట కొండా, ఇనగాల ఒకరినొకరు ఎదురు పడ్డారు. ఆ సమయంలో కొండా మీసం మెలేయడం, ఇనగాల తొడ గట్టడం చర్చనీయాంశంగా మారింది. చదవండి: కోరుట్ల దీప్తి కేసు.. వెలుగులోకి అసలు నిజాలు? -
ధర్మారెడ్డి.. తరిమికొట్టడం నీకేం తెలుసు.. తరిమికొట్టడమంటే కొండా మురళీకి తెలుసు..
వరంగల్ : ‘ధర్మారెడ్డి.. తరిమికొట్టడం నీకేం తెలుసు.. తరిమికొట్టడమంటే కొండా మురళీకి తెలుసు.. మా కార్యకర్తలు నిన్ను ఉరికిస్తరు.. మైసమ్మ సాక్షిగా చెబుతున్నా.. పరకాలలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు నిలుచున్నా నిన్ను ఓడిస్తా’ ఖబర్దార్ అంటూ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు చల్లాపై మండిపడ్డారు. మంత్రి కేటీఆర్‌పై కొండామురళి వ్యాఖ్యలను ఖండిస్తూ చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. దీనిపై స్పందిస్తూ మంగళవారం వరంగల్ రత్నహోటల్లో కొండామురళి విలేకరుల సమావేశంలో ప్రతి విమర్శలు చేశారు. ‘ధర్మారెడ్డి నువ్వు నా ఇంటికి వచ్చి బతిమిలాడి రూ. 14 కోట్ల విలువైన ప్రగతి సింగారం బ్రిడ్జి పనులు తీసుకోలేదా’ అని గుర్తు చేశారు. భూపాలపల్లి నియోజకవర్గంలో చలివాగు ప్రాజెక్టు, శాయంపేట మండల కేంద్రంలో 14 ఎకరాల్లో మోడల్ కాలేజీ, ఆత్మకూర్ పోలీస్‌స్టేషన్‌కు స్థలం ఈ పనులన్నీ తానే చేశానని, ఎమ్మెల్యే చేసింది ఏమిటని ప్రశ్నించారు. అక్రమాలను వెలికితీసే జర్నలిస్టులకే ఈ ప్రభుత్వంలో రక్షణ కరువైతే.. సామాన్యుల పరిస్థితి ఏమిటో అర్థమవుతుందన్నారు. మహిళలను అవమానించి కేసులు నమోదు చేయించే సంస్కృతి ధర్మారెడ్డి అయితే.. వారికి అండగా నిలిచే సంస్కృతి తనదన్నారు. ‘పరకాల ప్రజలకు నీ గురించి గొప్పగా తెలుసు.. నువ్వో మట్టి దొంగవు’ అని ఎద్దేవా చేశారు. మట్టి తీయడం, మొరం తీసి అమ్మడం, కాంట్రాక్టు పనుల్లో పర్సంటేజీ నొక్కడం ఇది ఎమ్మెల్యే సంస్కృతి అని మండిపడ్డారు. తూర్పులో కొండా సురేఖను, పరకాలలో కాంగ్రెస్ అభ్యర్థి తానే గెలిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తూర్పు, పరకాల నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
మొగోడివైతే మీసాలు మెలేయాలి.. మెలేయడానికి నీకు మీసాలు లేవు..
రామన్నపేట : ‘కొమ్మాల లక్ష్మీనరసింహస్వామికి మీసాలు ఉంటాయి.. కొండా మురళీకి మీసాలు ఉంటాయి.. మొగోడివైతే మీసాలు మెలేయాలి.. మెలేయడానికి నీకు మీసాలు లేవు శ్రీ.. కేటీఆర్ ఖబర్దార్.. అంటూ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు అన్నారు. వరంగల్‌లో శనివారం జరిగిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పరోక్షంగా చేసిన వ్యాఖ్యాలపై ఆయన ఆదివారం స్పందించారు. పోచమ్మమైదాన్‌లోని రత్నహోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కొండా దంపతులు పారిపోయిల్లు అంటున్నవ్.. వరంగల్‌లో బస్వరాజు సారయ్యను ఓడించాలంటే మీరైతేనే సాధ్యమని మీ అయ్య తూర్పు నియోజకవర్గానికి పంపించింది నిజం కాదా అని ప్రశ్నించారు. కొండా మురళీ గుండా.. రౌడీ అంటున్నావు.. ఆ రోజు ఎమ్మెల్సీ పదవి ఏకగీవ్రంగా ఎన్నికై నప్పుడు గుర్తుకు లేదా అంటూ మండిపడ్డారు. మమ్ముల్ని మీరు పిలిచారా.. మేము నీ దగ్గరికి వచ్చా మా గుర్తు లేదా అంటూ ప్రశ్నించారు. ‘నాకు ఆత్మాభిమానం ఎక్కువ కాబట్టే తరాజు జోకేటోడు(మంత్రి దయాకర్‌రావు) పార్టీలోకి వస్తే మేము బయటికి వచ్చాం. కంపెనీల పేరుతో ఏడేళ్ల కింద రైతుల నుంచి భూములు తీసుకుని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అప్పటి నుంచి చేయనిది.. ఐదు నె లలో పూర్తి చేస్తారా.. మాయమాటలతో ప్రజలను మోసం చే యవద్దంటూ’ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాల్లో మాదిరిగా ఐదు నెలల్లో కాంగ్రెస్ పార్టీ విజయం త థ్యమని పేర్కొన్నారు. ఆ తరువాత విజయమాల్యా మాది రిగి కేటీఆర్ విదేశాలకు పారిపోవడం ఖాయమని చెప్పారు. సిరిసిల్లలోనే నీ పరిస్థితి బాగా లేదు.. ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నవా అంటూ ఎద్దేవా చేశారు. తూర్పు నియోజకవర్గంలో కొండా సురేఖతో పాటు పరకాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యత నాదే అంటూ స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు మీసాల ప్రకాశ్, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కేసీఆర్‌వి దొరహంకార పోకడలు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు తన పదవికి రాజీనామా చేశారు. భార్య కొండా సురేఖతో కలసి శనివారం ఉదయం శాసనమండలికి వచ్చిన ఆయన మండలి చైర్మన్ వి. స్వామిగౌడ్‌కు రాజీనామా లేఖ అందజేశారు. ఆ వెంటనే ఆయన రాజీనామాను ఆమోదిస్తూ స్వామిగౌడ్ నిర్ణయం తీసుకున్నారు. కొండా మురళి 2015 డిసెంబర్లో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొండా దంపతులు టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరగా ఎన్నికల ఫలితాల అనంతరం కొండా మురళి ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. దీంతో మండలి చైర్మన్ కొండా మురళికి నోటీసు జారీ చేశారు. నోటీసు గడువు ఉండగానే కొండా మురళి రాజీనామా చేశారు. అనంతరం అసెంబ్లీ ఆవరణలో భార్యతో కలసి కొండా మురళి విలేకరులతో మాట్లాడారు. ‘వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచిన నాపై బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పోటీ చేయలేదు. ఆ పార్టీలకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా గెలిచిన మొదటి వ్యక్తిని నేనే. విలువలు పాటిస్తున్నా కాబట్టే రాజీనామా చేశా. సీఎం కేసీఆర్ దొరహంకార పోకడలతో రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తున్నారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత మూడు నెలలకు సురేఖ మంత్రి పదవికి, ఆ తర్వాత నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాం. మాకు పదవులు కాదు... ఆత్మాభిమానం ముఖ్యం. ఆత్మాభిమానం చంపుకున్నోళ్లే టీఆర్ఎస్లో చేరతారు. మొదట మంచిగా మాట్లాడతరు. భోజనం పెడతరు. తర్వాత నాలుగేళ్లు అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు. 30 ఏళ్లుగా మాకు శత్రువుగా ఉన్న దయాకర్‌రావును టీఆర్ఎస్లో చేర్చుకోవడం మాకు నచ్చలేదు. ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని చూస్తున్నారు. దొరల పాలనను ప్రతిఘటించి ప్రజల మధ్య ఉంటం’అని మురళి అన్నారు. టీఆర్ఎస్ది అధికార దుర్వినియోగం: సురేఖ కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని ముందే అనుకున్నామని మాజీ మంత్రి కొండా సురేఖ చెప్పారు. ‘ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన బీ ఫారంతో మురళిధర్‌రావు ఎమ్మెల్సీగా గెలవలేదు. ప్రజల అండతోనే గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో అధికార దుర్వినియోగంతో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మాట్లాడే వాళ్లను కేసీఆర్ అసెంబ్లీలోకి రాకుండా చేశారు. మాలాంటి వాళ్లు పోటీ చేసిన నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ గెలుపు కోసం రూ. 50 కోట్లు ఖర్చు చేశారు. శాసనమండలిలో ప్రతిపక్షం లేకుండా కాంగ్రెస్ పక్షాన్ని విలీనం చేసుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. మేము పదవుల కోసం పాకులాడే వాళ్లం కాదు. దయాకర్‌రావుకు మంత్రి పదవి ఇచ్చేందుకు జూపల్లిని ఓడగొట్టారు. గతంలో పార్టీలు మారిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వాళ్లది అనుకున్న పదవి మాకు అవసరం లేదు కాబట్టి రాజీనామా చేశాం. ఏదైనా ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం’ అని కొండా సురేఖ పేర్కొన్నారు. -
ఎమ్మెల్సీ పదవికి కొండా మురళి రాజీనామా
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన కొండా మురళి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. శనివారం ఆయన శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. కొండామురళితో పాటు ఆయన సతీమణి, మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ ఉన్నారు. వరంగల్ స్థానిక సంస్థల ద్వారా కొండా మురళి టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా 2015లో ఎన్నికైన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ తొలుత ప్రకటించిన జాబితాలో కొండా సురేఖ పేరు లేకపోవడంతో మనస్థాపానికి గురైన కొండా దంపతులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ తరఫున పరకాల నుంచి పోటీచేసిన కొండా సురేఖ పరాజయం పాలయ్యారు. ఫిరాయింపు ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ.. శాసనమండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన వివరణ కోరుతూ కొండా మురళికి నోటీసులు జారీ చేశారు. దీంతో 2021వరకు పదవీ కాలం ఉన్నా.. కొండా మురళి తన శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. మరోవైపు కాంగ్రెస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్సీలు శుక్రవారం శాసనమండలి చైర్మన్‌ను కలసి కాంగ్రెస్ శాసనమండలి పక్షాన్ని టీఆర్ఎస్ శాసనమండలి పక్షంలో విలీనం చేయాలని కోరుతూ లేఖ సమర్పించారు. దీంతో శాసనమండలిలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా సైతం లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికల వరకు కాంగ్రెస్‌కు ఏడుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు. మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎం.ఎస్. ప్రభాకర్, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి గతంలోనే టీఆర్ఎస్లో చేరారు. ఇదే పార్టీకి చెందిన ఆకుల లలిత, టి.సంతోష్ కుమార్ గురువారం సీఎం కేసీఆర్‌ను కలవడంతో వారు టీఆర్ఎస్లో చేరడం ఖాయమైపోయింది. ఇక కొండా మురళి రాజీనామాను శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ఆమోదించారు. -
ఆగ్రోస్ చైర్మన్ తనయుడు కాంగ్రెస్‌లో చేరిక
సాక్షి, పరకాల రూరల్: ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావు తనయుడు లింగంపల్లి నేతాజీ శుక్రవారం కాంగ్రెస్‌పార్టీలో చేరారు. హన్మకొండలోని కొండా నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు. లింగంపల్లి కిషన్‌రావు టీఆర్ఎస్లో కీలకంగా వ్యవహరిస్తూ ఆగ్రోస్ చైర్మన్‌గా ఉండగా ఆయన కుమారుడు కాంగ్రెస్‌లో చేరడంతో నియోజకవర్గంలో వేగంగా సమీకరణలు మారుతున్నాయని పలువురు చర్చికుంటున్నారు. కాగా లింగంపల్లి కిషన్‌రావు స్వగ్రామం పరకాల మండలంలోని నర్సక్కపల్లి. -
‘డబ్బులు పెట్టి బెదిరించి ఎమ్మెల్సీ అయ్యాడు’
సాక్షి, హైదరాబాద్ : ఆత్మగౌరవం అనే మాటకు అర్హతలేని వారు కొండా దంపతులని టీఆర్ఎస్ నాయకుడు బస్వరాజ్ సారయ్య విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొండా దంపతులు ఎప్పుడు కూడా ప్రజా సమస్యలపై నియోజకవర్గంలో తిరగలేదన్నారు. కొండా సురేఖ నేతృత్వంలో ఏక్కరు కూడా బాగుపడలేదన్నారు. గతంలో టీడీపీలో ఉండి తుపాకితో కుక్కను కాల్చి సర్పంచ్ అయిన వ్యక్తి కొండా మురళి అని, అలాంటి వారు ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారని విడ్డూరంగా ఉందన్నారు. ఆత్మగౌరవం అంటే ఏమిటో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కొండా మురళి డబ్బులు పెట్టి, బెదిరించి ఎమ్మెల్సీ అయ్యాడని ఆరోపించారు. కొండా దంపతులకు రాజశేఖరరెడ్డి రాజకీయ భిక్ష పెడితే, కేసీఆర్ పునర్జన్మ ఇచ్చారన్నారు. గతంలో ఈ మాట సురేఖనే అన్నారని గుర్తుచేశారు. అలాంటిది ఇప్పుడు కేసీఆర్‌ను విమర్శించడంసబబు కాదన్నారు. తెలంగాణ అని పలికే అర్హత కొండా దంపతులకు లేదన్నారు. కొండా దంపతులను వరంగల్ నుంచి కాదు కదా తెలంగాణ నుంచే తరిమికొట్టాలని వ్యాఖ్యానించారు. హరీశ్ రావు, కేటీఆర్ వేరు వేరు గ్రూపులు కాదన్నారు. కాంగ్రెస్‌లోలాగా టీఆర్ఎస్లో ఎలాంటి గ్రూపులు లేవని సారయ్య పేర్కొన్నారు. లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తాం : నన్నపునేని నరేందర్ ప్రపంచంలో ఆత్మగౌరవం అనే మాటకు అర్హత లేని వారు ఎవరైనా ఉన్నారంటే అది కొండా దంపతులు మాత్రమేనని వరంగల్ నగర మేయర్ నన్నపునేని నరేందర్ ఎద్దేవా చేశారు. దొర పాలన చేసేది సురేఖ కుటుంబమేనని విమర్శించారు. ఈ కాలం పిల్లలకు దొర అంటే మీ భర్తనే చూపించాలని ఎద్దేవా చేశారు. కొండా సురేఖ నాన్న చనిపోతే ఆమె భర్తే రాలేదని, కేసీఆర్ ఎలా వస్తారని ప్రశ్నించారు. తూర్పు నియోజక వర్గంలోని ప్రజలంతా ఆత్మ గౌరవంతోనే బతుకుతున్నారన్నారు. 2019వరకూ కొండా దంపతులు రాజకీయ సమాధి కాబోతున్నారని వ్యాఖ్యానించారు. కొండా దంపతులకు నిజంగా రాజకీయ బలం ఉంటే వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటి చేయాలని సవాల్ చేశారు. టీఆర్ఎస్ నుంచి ఎవరు బరిలోకి దిగినా కొండా సురేఖపై లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ తప్పు చేసింది.. ఆ నూటైదుమంది కన్నాహీనమా నేను! -
పరకాలకు సురేఖ.. తూర్పు నుంచి సుస్మితా!
సాక్షి, వరంగల్ రూరల్: పరకాల నుంచి కొండా సురేఖ, వరంగల్ తూర్పు నుంచి తమ కుమార్తె సుస్మితా పటేల్ బరిలో ఉంటారని కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు చెప్పినట్లు తెలిసింది. సోమవారం కొండా దంపతులు హన్మకొండకు వచ్చారు. వరంగల్ తూర్పు, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల నుంచి వచ్చిన అభిమానులతో మురళీధర్‌రావు సమావేశమయ్యారు. మీకు నేనున్నానని భరోసా ఇచ్చారు. ఈ నెల 23న ఆత్మకూరులో బహిరంగ సభ పెడదామని చెప్పినట్లు తెలిసింది. నేడు బహిరంగ లేఖ! ఈ నెల 8న హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్‌కు కొండా దంపతులు పలు డిమాండ్లు చేశారు. ఈ డిమాండ్లకు సమాధానం చెప్పకపోతే కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాస్తామని ప్రకటించారు. నేడు హైదరాబాద్‌లో ఈ లేఖను విడుదల చేయనున్నారని తెలిసింది. -
తెలంగాణ.. కల్వకుంట్ల ఇల్లు కాదు : కొండా సురేఖ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ కల్వకుంట్ల ఇల్లు కాదని మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. పార్టీ నుంచి పొమ్మన లేక పొగ పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కొండా మురళితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తనపేరు లేకపోవడం బాధనిపించిందన్నారు. గత ఎన్నికల్లో పరకాల పార్టీ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేయాలనుకున్నామని, కానీ పదే పదే వర్తమానాలు పంపి పార్టీలో చేర్చుకున్నారని తెలిపారు. పరకాల నుంచి కాకుండా కేసీఆర్ తమపై ఒత్తిడి చేసి వరంగల్ ఈస్ట్ నుంచి పోటీ చేయించారని, అప్పటి అభ్యర్థి బస్వరాజు సారయ్య ఓడిపోవాలంటే తమే పోటీచేయాలని కన్విన్స్ చేశారన్నారు. పార్టీలో చేరేటప్పుడు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని, కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తానని ఇచ్చారన్నారు. వరంగల్ ఈస్ట్ కొత్త అయినా ప్రజలు మా మీద నమ్మకంతో 55 వేల మేజార్టీతో గెలిపించారని గుర్తు చేశారు. పార్టీ నుంచి ఇప్పటి వరకు పైసా తీసుకోలేదని, సొంత డబ్బులతో కార్పోరేషన్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించామన్నారు. ఏనాడు పార్టీకి వ్యతిరేకంగా ప్రవర్తించలేదన్నారు. మహిళా మంత్రి లేని ప్రభుత్వం.. మహిళా మంత్రి లేని ప్రభుత్వం ఒక్క తెలంగాణనే అని చెప్పారు. తనకు మంత్రి పదవి ఇవ్వక పోయినా కూడా ఎప్పుడు అడగలేదన్నారు. మురళీధర్ రావు ఎమ్మెల్సీ గెలుచుకుని పార్టీకి ఒక ఊపునిచ్చారని, టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫామ్‌లు తప్ప ఎలాంటి లాభం పొందలేదన్నారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తుంటే.. నాలుగు సార్లు గెలిచిన తనకు టికెట్‌ను ఆపడం ఏంటని ప్రశ్నించారు. ఇలా బీసీ మహిళా అయిన తనకు టికెట్ ఇవ్వకపోవడం బీసీలందరిని అవమానపరచడమేనన్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బొడిగే శోభ, బాబు మోహన్, నల్లాల ఓదేలులకు టికెట్లు ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సారయ్య, గుండు సుధారాణి, దయాకర్ రావులను తమకు చెప్పకుండానే పార్టీలో చేర్చుకున్నారని తెలిపారు. తనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. సర్వే రిపోర్టులు బహిర్గతం.. టికెట్లు కేటాయించిన అభ్యర్థుల సర్వే రిపోర్టులను బహిర్గతం చేయాలన్నారు. ఈ 105 మందికి బీఫామ్ ఇస్తామని పత్రికా ప్రకటన ఇవ్వాలన్నారు. పార్టీలో చేరిన సీనియర్ నాయకులు ఒకసారి పునరాలోచించాలని సూచించారు. తాము రెండు స్థానాల్లో టికెట్లు ఆశించామని తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. భూపాలపల్లిలో తమ క్యాడర్‌పై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, దాంతోనే అవకాశం ఉంటే తమ కుటుంబ సభ్యులు పోటీచేస్తారని కోరాం తప్పా డిమాండ్ చేయలేదని స్పష్టం చేశారు. ప్రతి విషయంపై మంత్రి కేటీఆర్, సంతోష్‌లకు సమాచారమిచ్చామన్నారు. తనకు టికెట్ రాకపోవడానికి కేటీఆరే కారణమని ఆరోపించారు. సొంత టీమ్‌ను కేటీఆర్ సిద్దం చేసుకుంటున్నారని, అందుకు తమలాంటి వారిని పక్కన పెట్టారన్నారు. తమ నియోజకవర్గాల్లో సమస్యలు సృష్టించింది ఆయన్నే అని ఆరోపించారు. కేసీఆర్ ముందస్తుకు వెళ్లడం సరైన నిర్ణయం కాదన్నారు. తమ ఫోన్స్ ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. ఇండిపెండెంట్‌గా ఎక్కడ నిలబడ్డా గెలిచే సత్తా తమకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ సమాధానం బట్టి రెండు రోజుల్లో తమ నిర్ణయం ప్రకటిస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే పరకాల, భూపాలపల్లి, వరంగల్ ఈస్ట్ మూడు స్థానాల్లో ఇండిపెండెంట్‌గా పోటీచేస్తామన్నారు. -
సరికొత్తగా...
భరద్వాజ్ బంకుపల్లి, నవీన్ బాబు, విశాల్ కురడా, స్వాతి భీమిరెడ్డి, సాహితి దాసరి, సుష్మ, జెస్సికా, మెర్సీ దాయం ముఖ్య తారలుగా శ్రీకరబాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. శ్యామల గణేష్ సమర్పణలో దగ్గుబాటి వరుణ్ నిర్మిస్తున్నారు. వరంగల్ భద్రకాళీ అమ్మవారి దేవస్థానంలో చిత్రీకరించిన తొలి సీన్‌కి ఎమ్మెల్యే కొండా సురేఖ కెమెరా స్విచ్చాన్ చేయగా, ఎమ్మెల్సీ కొండా మురళీధరరావు క్లాప్ ఇచ్చారు. ఎన్ఎస్ఆర్ గ్రూప్ అధినేత సంపత్‌రావు గౌరవ దర్శకత్వం వహించారు. మంచి కథతో రూపొందుతోన్న ఈ చిత్రం సక్సెస్ అవ్వాలని అతిథులు పేర్కొన్నారు. ఇటీవల వస్తున్న చిత్రాలకు భిన్నంగా సరికొత్త కథతో ఈ సినిమా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ప్రణవ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గుల్లపల్లి శ్రీనివాస్. -
‘కొండా’ గ్రామానికి భారీగా నిధులు
ఆత్మకూరు(పరకాల): గీసుకొండ మండలంలోని కొండా దంపతుల స్వగ్రామం వంచనగిరికి మహర్దశ పట్టనుంది. సీఎం కేసీఆర్ గ్రామ అభివృద్ధి కోసం ఇటీవల రూ.9.50 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నిధులతో పాటు ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సుమారు రూ.70 లక్షలు మంజూరు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గంగదేవిపల్లి తర్వాత ఇంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరైన గ్రామాలు లేవు. వీటితో గ్రామంలోని ప్రతీ వీధిలో సీసీ రోడ్లు, సైడ్ కాల్వల నిర్మాణం చేపట్టనున్నారు. రెండు ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాల్ నిర్మించనున్నారు. ఇప్పటికే వంచనగిరి విద్యా, ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తింపు పొందింది. కొండా దంపతులు స్థలాన్ని విరాళంగా ఇవ్వడంతో కస్తూరిబా విద్యాలయం, మోడల్ స్కూల్ భవనాలను నిర్మించి ఇక్కడే వాటిని నిర్వహిస్తున్నారు. కోటగండి వద్ద కోటమైసమ్మ తల్లి, కొండగిరి సాయినాథ ఆలయాలు భక్తి కేంద్రాలుగా మారాయి. గ్రామంలోని ఎర్రమట్టి గుట్టపై త్వరలో శివాలయం నిర్మిస్తామని కొండా మురళీ ఇటీవలే ప్రకటించారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు శనివారం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు. -
కొండా మురళీధర్‌రావుకు వరుసగా ఇబ్బందులు
ఎదురుగాలి కొండా మురళీధర్‌రావుకు వరుసగా ఇబ్బందులు టీఆర్ఎస్లోకి వచ్చిన ప్రత్యర్థులు కార్పొరేటర్ల టికెట్లలో అనుచరులకు కోత మేయర్ అభ్యర్థి ఎంపికలో చెల్లుబాటుకాని మాట జిల్లాలో కీలక నేతగా గుర్తింపు ఉన్న కొండా మురళీధర్‌రావుకు వరుసగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఈ అభిప్రాయానికి బలం చేకూరుస్తున్నాయి. ఎమ్మెల్సీ పదవితో మురళీధర్‌రావు టీఆర్ఎస్లో తిరుగులేని నేతగా మారారని ఆయన అనుచరులు అప్పట్లో భావించారు. దాని తర్వాత అంతగా ప్రాధాన్యం దక్కడం లేదు. సురేఖకు మంత్రి పదవి రాకపోవడం.. ప్రత్యర్థులు టీఆర్ఎస్లో చేరడం.. కార్పొరేటర్ టికెట్లలో కోత.. ఆ తర్వాత మేయర్ ఎన్నిక.. ఇలా అన్ని విషయాల్లోనూ కొండా మురళికి ఇబ్బందికర పరిస్థితులే ఎదురవుతున్నాయని పార్టీలో చర్చ జరుగుతోంది. 2014 ఎన్నికల ముందు కొండా మురళీధర్‌రావు, కొండా సురేఖ టీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్‌కు చెందిన పలువురు మాజీ కార్పొరేటర్లు, ఇతర ముఖ్య నేతలు వీరితో కలిసి గులాబీ పార్టీలోకి మారారు. సాధారణ ఎన్నికల్లో కొండా సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పోటీ చేసి బస్వరాజు సారయ్యపై ఘన విజయం సాధించారు. టీఆర్ఎస్లో చేరిక సమయంలో పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీ ప్రకారం సురేఖకు మంత్రి పదవి వస్తుందని కొండా వర్గీయులు భావించారు. అప్పట్లో ఇది జరగలేదు. ఏడాది తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో జిల్లా నుంచి అజ్మీరా చందులాల్‌కు అవకాశం వచ్చింది. కొండా కుటుంబానికి రెండోసారి కూడా అవకాశం రాలేదు. వరంగల్ తూ ర్పు నియోజకవర్గానికి చెందిన రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక సమయంలో టీఆర్ఎస్లో చేరారు. మంత్రి పదవి రా కపోవడంతో పాటు తన నియోజకవర్గంలో మరో నేత సుధారాణి చేరడంతో కొండా మురళి కొన్ని నెలలు స్తబ్ధుగా ఉండిపోయారు. గత సంవత్సరం డిసెంబరులో టీఆర్ఎస్ అధిష్టానం కొండా మురళీధర్‌రావుకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది. మురళి తన రాజకీయ చాతుర్యంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పరిణామంతో ఆయన జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల సందర్భంగా జరిగిన పరిణామాలు మళ్లీ పాత పరిస్థితిని గుర్తు చేస్తున్నాయి. కార్పొరేషన్ ఎన్నికలకు ముం దే వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇం చార్జీ బస్వరాజు సారయ్య టీఆర్ఎస్లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొండా సురేఖకు ప్రత్యర్థిగా పోటీచేసిన సారయ్యతో పాటు మురళి చిరకాల రాజకీయ ప్రత్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా టీ ఆర్ఎస్లో చేరడం వీరికి కొంత ఇబ్బందిగా మారింది. కాగా, గ్రేటర్ వరంగల్ ఎన్నికల సందర్భంగా కార్పొరేటర్ల టికెట్ల కేటాయింపు, ప్రచార వ్యూహంపై జిల్లా స్థాయిలో తొమ్మిది మందితో నియమించిన సమన్వయ కమిటీలో ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, ఎమ్మెల్యే కొండా సురేఖకు చోటు కల్పించారు. టికెట్ల కేటాయింపులో తమకు ప్రాధాన్యం దక్కుతుం దని కొండా అనుచరులు భావించారు. కానీ, కొండా మురళీధర్‌రావుతో కలిసి టీఆర్ఎస్లోకి వచ్చిన వారిలో ఐదారుగురికి కార్పొరేటర్ టికెట్లు దక్కలేదు. దీనికితోడు తూర్పు నియోజకవర్గంలోని పలు డివిజ న్లలో స్వతంత్రుల పోటీ విషయంలోనూ ఇబ్బందులు ఎదురయ్యాయి. వీరిని పోటీ నుంచి తప్పించే విషయంలో కొండా మురళి పూర్తిగా సక్సెస్ కాకపోగా, మూడు డివిజన్లలో రెబల్స్ విజయం సాధించడం ఆయనకు ఇబ్బందికరంగా మారింది. చివరికి మేయ ర్ పదవి విషయంలోనూ మురళీధర్‌రావు మాట చెల్లుబాటు కాలేదు. మురళికి అసంతృప్తి కలిగించేలా టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం తీసుకుందని ఆయన వర్గీయులు అంటున్నారు. నన్నపునేని నరేందర్ మే యర్‌గా ఎన్నిక కావడం మురళీధర్‌రావుకు రాజకీయంగా ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం టీఆర్ఎస్లో వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితులలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రాజకీయాలు ఇకపై ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. -
టీఆర్ఎస్ ఖాతాలో ఆరు ఎమ్మెల్సీలు
ఐదు జిల్లాల్లో ఆరు స్థానాలు ఏకగ్రీవం సాక్షి, హైదరాబాద్/నిజామాబాద్/వరంగల్/కరీంనగర్: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ఐదు జిల్లాల్లోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది. శుక్రవారం నాటికే ఆదిలాబాద్, వరంగల్, మెదక్ జిల్లాల్లోని ఎమ్మెల్సీ స్థానాలను ఏకగ్రీవం చేసుకున్న గులాబీ దళం శనివారం కరీంనగర్ జిల్లాలోని రెండు, నిజామాబాద్‌లో ని ఒక స్థానాన్ని తన ఖాతాలో వేసుకుంది. కరీంనగర్ బరిలో మిగిలిన ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు శనివారం నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ఇక్కడ్నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన నారదాసు లక్ష్మణరావు, భానుప్రసాద్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థులతో నామినేషన్లు విరమింపజేయడంలో మంత్రి ఈటల రాజేందర్ కీలక పాత్ర పోషించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు శనివారంతో ముగిసేసరికి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన పురాణం సతీష్(ఆదిలాబాద్), రేకులపల్లి భూపతిరెడ్డి(నిజామాబాద్), కొండా మురళి(వరంగల్), భూపాల్‌రెడ్డి(మెదక్), నారదాసు లక్ష్మణరావు, భాను ప్రసాద్‌రావు(కరీంనగర్) ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్లు ఎన్నికల ప్రధానాధికారి ప్రకటించారు. నల్లగొండ, ఖమ్మంలోనే పోటీ ఐదు జిల్లాల్లో ఏకగ్రీవం చేసుకున్న టీఆర్ఎస్.. మిగిలిన నాలుగు జిల్లాల్లోని ఆరు స్థానాలపై కన్నేసింది. రెండేసి స్థానాలున్న మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఎమ్మెల్సీలను సునాయాసంగా కైవసం చేసుకోవచ్చని ఆ పార్టీ భా విస్తోంది. ఈ రెండు చోట్లా పోటీ నామమాత్రమేనని చెబుతోంది. దీంతో ఖమ్మం, న ల్లగొండ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఖమ్మం లో సీపీఐ అభ్యర్థికి కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఎం మద్దతిస్తున్న నేపథ్యంలో ఇక్కడ పోటీ ఆసక్తిగా మారింది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గెలిచిన టీడీపీ స్థానిక ప్రజాప్రతినిధులు 80 శాతానికి పైగా టీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ నేతలు కూడా టీఆర్ఎస్కే అనుకూలం కావడం, తుమ్మల నాగేశ్వర్రావు వంటి బలమైన నేత మంత్రిగా ఉండడంతో ఇక్కడ తమ అభ్యర్థి బాలసాని లక్ష్మీనారాయణ విజయం ఖాయమని టీఆర్ఎస్ భా విస్తోంది. నల్లగొండలో పార్టీ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మధ్య పోటీ తీ వ్రంగా ఉండే అవకాశాలున్నాయి. అయి నా స్థానిక నాయకత్వం టీఆర్ఎస్ వైపే చూస్తోందని ఆ పార్టీ నాయకత్వం భావి స్తోంది. ఈ 4 స్థానాలకు ఈ నెల 27న పోలింగ్ జరగనుండగా, 30న ఫలితాలు వెలువడుతాయి. కరీంనగర్లో 2, నిజామాబాద్‌లో 1... కరీంగనర్ జిల్లాలో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ప్రతిపక్ష పార్టీలేవీ నామినేషన్ల దాఖలు చేయకపోవడం, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవడం తో టీఆర్ఎస్ అభ్యర్థులు నారదాసు లక్ష్మణరావు, భానుప్రసాద్‌రావు ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ప్రకటిం చారు. ఈ ఎన్నికల్లో 2 సీట్లకుగాను మొత్తం 7 నామినేషన్లు దాఖల య్యాయి. ఇందులో ఇద్దరు టీఆర్ఎస్ అభ్యర్థులు కాగా, మిగిలిన ఐదుగురు స్వతంత్రులు. ఇక నిజామాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి రేకులపల్లి భూపతిరెడ్డి ఏకగ్రీవం గా ఎన్నికయ్యారు. శనివారం ఎన్నికల పరిశీలకులు ఎల్.శశిధర్, జిల్లా ఎన్నికల రిట ర్నింగ్ అధికారి ఎ.రవీందర్‌రెడ్డి భూపతిరెడ్డికి ఎమ్మెల్సీ నియామకపత్రాన్ని అందజేశారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణారెడ్డి శుక్రవారమే పోటీ నుంచి తప్పుకోగా.. స్వతం త్ర అభ్యర్థి బత్తిని జగదీశ్ శనివారం నామినేషన్ ఉపసంహరించుకున్నారు. వరంగల్‌లో శనివారం నామినేషన్ల ఉపసంహరణ తర్వాత టీఆర్ఎస్ అభ్యర్థి కొండా మురళీధర్‌రావు ఒక్కరే పోటీలో ఉండడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్రకటించారు. -
నిండా ముంచారు..!
గీసుకొండ, న్యూస్‌లైన్ : తనకు అండగా ఉండి గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పిన మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి, కొండా మురళీధర్‌రావు నిండా ముంచారని టీఆర్ఎస్ పార్టీ నుంచి పరకాల ఎమ్మె ల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన ముద్దసాని సహోదర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం టీఆర్ఎస్ పార్టీ గీసుకొండ మండల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో హన్మకొండలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఓటమికి కారణాలపై సహోదర్‌రెడ్డి విశ్లేషించారు. మండలంలో బూత్‌ల వారీగా ఓటింగ్ తగ్గటానికి దారి తీసిన పరిస్థితులపై పోస్టుమార్టం నిర్వహించారు. పోలింగ్‌కు రెండు రోజుల ముందు నుంచే మొలుగూరి పట్టించుకోలేదని, కొందరు న్యాయవాదుల సహకారంతో ముందుకెళ్లినట్లు సహోదర్‌రెడ్డి చెప్పుకొచ్చారు. కొండా మురళీధర్‌రావు గీసుకొండలో ప్రచారం చేయడానికి వస్తానని చెప్పి రాలేదని, ఆయన స్వగ్రామం వంచనగిరిలోనే టీఆర్ఎస్కు గణనీయంగా ఓటింగ్ తగ్గిందని అన్నారు. గతంలో కొండా సురేఖకు వచ్చిన ఓట్లతో పోలిస్తే ఇంత తక్కువ ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో మొలుగూరి, సురేఖకు వచ్చిన ఓట్లను చూస్తే తాను సునాయసంగా గెలుస్తాననే ధీమాతో ఉన్నానని, అయితే నాయకుల మోసం కారణంగా ఓడి పోయానని కార్యకర్తలు, నాయకుల ఎదుట వాపోయారు. పార్టీ తరఫున టికెట్ కొంత ఆలస్యంగా ఖరారు కావడంతో ఎవరు ఏమిటో తెలియని పరిస్థితుల్లో ఎన్నికలను ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల కన్నా ప్రచారంలో ముందుండడంతోపాటు ఆర్థిక పరమైన విషయాల్లోనూ ఏమాత్రం వేనకడుగు వేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఎంపీ అభ్యర్థి కడియం శ్రీహరికి ఓటు వేసిన వారు ఎమ్మెల్యే విషయానికి వచ్చేసరికి క్రాస్ ఓటింగ్ చేశారని, అందుకే ఓడిపోయినట్లు కొందరు నాయకులు చెప్పిన విశ్లేషణలతో సహోదర్‌రెడ్డి ఏకీభవించలేదు. రాష్ట్రం మొత్తంలో టీఆర్ఎస్ గాలి ఉంటే ఇక్కడ క్రాస్ ఓటింగ్ ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీలోని కొందరు నాయకుల తీరు వల్లే ఓడిపోయామని పలువురు ఆరోపించారు. పాత టీఆర్ఎస్ నాయకులు సరిగా పని చేయలేదని ఓ వ్యక్తి చేసిన ఆరోపణతో సమావేశంలో కొంత సేపు గొడవ జరిగింది. నియోజకవర్గ ఇన్చార్జ్గా నియమించాలి సహోదర్రెడ్డిని పరకాల నియోజకవర్గ ఇన్చార్జ్గా నియమించాలని, ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కోరుతూ మండల కమిటీ తీర్మానించింది. ఈ సందర్భంగా గతంలో పార్టీని వీడి వెళ్లిన అనంతారం గ్రామ నాయకుడు దూడె మొగిలి తిరిగి సహోదర్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. మండల కన్వీనర్ చింతం సదానందం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా నాయకుడు మంద ఐలయ్య, బెంబిరి బాబూరావు, వీరగోని రాజ్‌కుమార్, వీరాటి లింగారెడ్డి, గంగుల రమేశ్. పోలెబోయిన ప్రభాకర్, ఊకల్ సొసైటీ చైర్మన్ రాజు, సర్పంచ్‌లు మానయ్య, బీమగాని సౌజన్య, కొంగ సురేందర్, తరగల ప్రసాద్, సాంబరెడ్డి, ల్యాదళ్ల బాలు, రాంబాబు, తాబేటి సదానందం, ఆలేటి సాంబమూర్తి, రాములు నాయక్, ముంత రాజయ్య తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్‌ను అపార్థం చేసుకున్నా: కొండా సురేఖ
సాక్షి, హైదరాబాద్: కొండా సురేఖ, కొండా మురళీధర్‌రావు దంపతులు మంగళవారం ఉదయం టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుతో ఆయన నివాసంలో సమావేశమై సుమారు గంటన్నరపాటు చర్చించారు. వరంగల్ జిల్లా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణ, వరంగల్ తూర్పు నియోజకవర్గం కేటాయింపు వంటి అంశాలపై కేసీఆర్‌తో వారు చర్చించారు. అనంతరం ఎమ్మెల్యేలు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్‌లతో కలసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను అపార్థం చేసుకున్నానని, ఇప్పటిదాకా ఆయనపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని మాజీ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. ఒక పార్టీలో పనిచేస్తున్నప్పుడు ఆ పార్టీ విధానాలకు అనుగుణంగానే పనిచేయా ల్సి ఉంటుందని, అందులో భాగంగానే మహబూబాబాద్‌లో ఘటన జరిగిందని వివరణనిచ్చారు. మానుకోటలో జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఓదార్పు యాత్రలో భాగంగానే వచ్చారని, సమైక్య నినాదంతో కాదని తెలిపారు. వరంగల్ తూర్పు నుంచి సురేఖ పోటీ: కేటీఆర్ కొండా దంపతుల చేరికతో వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ బలపడిందని ఆ పార్టీ ఎమ్మెల్యే కె.తారకరామారావు అన్నారు. తెలంగాణ వచ్చేదాకా విడిగా ఉన్న వివిధ పార్టీల్లోని నేతలు పునర్నిర్మాణంలో అయినా కలసిరావాలని పిలుపునిచ్చారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి కొండా సురేఖ పోటీచేస్తారని వెల్లడించారు. -
కేసీఆర్‌తో కొండా సురేఖ భేటీ
హైదరాబాద్: రాష్ట్ర మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి టీఆర్ఎస్ చేరేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో కొండా సురే్ఖ దంపతులు ఈరోజు సమావేశమయ్యారు. అయితే కొండా దంపతులు కాంగ్రెస్ పార్టీని వదిలి టీఆర్ఎస్లో చేరడం ఖాయమని, అధికారికంగా ప్రకటించడమే మిగిలిందని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. సురేఖకు వరంగల్ ఈస్ట్ అసెంబ్లీ సీటును కేసీఆర్ ఆఫర్ చేశారని సమాచారం. అయితే గతంలో తాను ప్రాతినిథ్యం వహించిన పరకాల కోసం పట్టుబట్టినా కేసీఆర్ ఒప్పుకోకపోవడంతో వరంగల్ ఈస్ట్ స్థానంలో పోటీ చేసేందుకు ఆమె అంగీకరించినట్టు తెలిసింది. కొండా మురళికి భూపాల్పల్లి టికెట్ ఇచ్చేందుకు కేసీఆర్ అంగీకరించారని సమాచారం. -
కాంగ్రెస్ గూటికి కొండా దంపతులు
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్ర మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. మరో నేత కేకే మహేందర్ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో ఉన్న సీఎం బుధవారం సాయంత్రం కొండా దంపతులు, కేకే మహేందర్లను దిగ్విజయ్ నివాసానికి తీసుకెళ్లారు. దిగ్విజయ్‌కు వారిని పరిచయం చేశారు. అనంతరం వారికి దిగ్విజయ్ కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఆ తర్వాత కొండా సురేఖ విలేకరులతో మాట్లాడుతూ.. తమకు రాజకీయ భిక్ష పెట్టిందని కాంగ్రెస్సేనని, పార్టీ తమకు పుట్టిల్లులాంటిదని అన్నారు. తెలంగాణ ప్రజలు, నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకే కాంగ్రెస్‌లో చేరానన్నారు. సోనియా నాయకత్వంలో తెలంగాణ రావడాన్ని అందరూ హర్షిస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కృషి చేస్తామన్నారు. త్వరలోనే వరంగల్‌లో సభ నిర్వహిస్తామని, దానికి దిగ్విజయ్‌ను ఆహ్వానించగా, సానుకూలంగా స్పందించారని తెలిపారు.