స్వామిగౌడ్‌కు రాజీనామా లేఖను అందజేస్తున్న కొండా దంపతులు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు తన పదవికి రాజీనామా చేశారు. భార్య కొండా సురేఖతో కలసి శనివారం ఉదయం శాసనమండలికి వచ్చిన ఆయన మండలి చైర్మన్ వి. స్వామిగౌడ్‌కు రాజీనామా లేఖ అందజేశారు. ఆ వెంటనే ఆయన రాజీనామాను ఆమోదిస్తూ స్వామిగౌడ్ నిర్ణయం తీసుకున్నారు. కొండా మురళి 2015 డిసెంబర్‌లో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొండా దంపతులు టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరగా ఎన్నికల ఫలితాల అనంతరం కొండా మురళి ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని టీఆర్‌ఎస్ ఫిర్యాదు చేసింది. దీంతో మండలి చైర్మన్ కొండా మురళికి నోటీసు జారీ చేశారు. నోటీసు గడువు ఉండగానే కొండా మురళి రాజీనామా చేశారు. అనంతరం అసెంబ్లీ ఆవరణలో భార్యతో కలసి కొండా మురళి విలేకరులతో మాట్లాడారు. ‘వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్ నుంచి బరిలో నిలిచిన నాపై బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పోటీ చేయలేదు.
ఆ పార్టీలకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా గెలిచిన మొదటి వ్యక్తిని నేనే. విలువలు పాటిస్తున్నా కాబట్టే రాజీనామా చేశా. సీఎం కేసీఆర్ దొరహంకార పోకడలతో రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తున్నారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత మూడు నెలలకు సురేఖ మంత్రి పదవికి, ఆ తర్వాత నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాం. మాకు పదవులు కాదు... ఆత్మాభిమానం ముఖ్యం. ఆత్మాభిమానం చంపుకున్నోళ్లే టీఆర్‌ఎస్‌లో చేరతారు. మొదట మంచిగా మాట్లాడతరు. భోజనం పెడతరు. తర్వాత నాలుగేళ్లు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వరు. 30 ఏళ్లుగా మాకు శత్రువుగా ఉన్న దయాకర్‌రావును టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం మాకు నచ్చలేదు. ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని చూస్తున్నారు. దొరల పాలనను ప్రతిఘటించి ప్రజల మధ్య ఉంటం’అని మురళి అన్నారు.
టీఆర్‌ఎస్‌ది అధికార దుర్వినియోగం: సురేఖ
కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని ముందే అనుకున్నామని మాజీ మంత్రి కొండా సురేఖ చెప్పారు. ‘ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన బీ ఫారంతో మురళిధర్‌రావు ఎమ్మెల్సీగా గెలవలేదు. ప్రజల అండతోనే గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో అధికార దుర్వినియోగంతో టీఆర్‌ఎస్ పార్టీ గెలిచింది. మాట్లాడే వాళ్లను కేసీఆర్ అసెంబ్లీలోకి రాకుండా చేశారు. మాలాంటి వాళ్లు పోటీ చేసిన నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ గెలుపు కోసం రూ. 50 కోట్లు ఖర్చు చేశారు. శాసనమండలిలో ప్రతిపక్షం లేకుండా కాంగ్రెస్ పక్షాన్ని విలీనం చేసుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. మేము పదవుల కోసం పాకులాడే వాళ్లం కాదు. దయాకర్‌రావుకు మంత్రి పదవి ఇచ్చేందుకు జూపల్లిని ఓడగొట్టారు. గతంలో పార్టీలు మారిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వాళ్లది అనుకున్న పదవి మాకు అవసరం లేదు కాబట్టి రాజీనామా చేశాం. ఏదైనా ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం’ అని కొండా సురేఖ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment