![News about Fee Reimbursement Applications - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/3/schlr.jpg.webp?itok=IARxr8xd)
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాల అమలుకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణకు అనుమతివ్వాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రభుత్వాన్ని కోరింది. ముందస్తుగా దర ఖాస్తుల స్వీకరణ ప్రారంభిస్తే.. వేగంగా పరిశీలించి అర్హతలు నిర్ధారించవచ్చని, దీంతో నిధు లు సైతం త్వరగా అర్హుల ఖాతాల్లో జమ చేయవచ్చని పేర్కొంది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వా నికి ప్రతిపాదనలు పంపింది. సాధారణంగా జూలై నెలాఖరు లేదా ఆగస్టు మొదటి వారంలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా 2023–24 సంవత్సరానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ఈ నెల నుంచే ప్రారంభించేందుకు సాంకేతిక అనుమతులను కోరింది.
ప్రస్తుతం ఈ ఫైలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. దీనిపై వారం రోజుల్లోగా ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రభు త్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే సాంకేతిక ఏర్పాట్లు పూర్తి చేసు కుని దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ సన్నాహాలు చేస్తోంది.
నాలుగు నెలలు గడువు..
2023–24 విద్యా సంవత్సరంలో పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నాలుగు నెలల పాటు నిర్వహించాలని ఎస్సీ అభివృద్ధి శాఖ భావిస్తోంది. గతేడాది మొదట మూడు నెలల పాటు అవకాశం కల్పించగా.. విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాల నుంచి వచ్చిన వినతుల మేరకు మరో రెండు నెలలు, చివరగా నెలరోజుల పాటు అవకాశం కల్పించింది.
ఈ సారి విడతల వారీగా దరఖాస్తుల స్వీకరణకు బదులుగా ఒకేసారి నాలుగు నెలల పాటు అవకాశం కల్పించి తర్వాత నిలిపివేయాలని యోచిస్తోంది. దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన వెంటనే వాటి పరిశీలన, అర్హతల ఖరారు ప్రక్రియను కొనసాగించనుంది. ఈ ఏడాది డిసెంబర్ కల్లా దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి ముందుగా ఉపకారవేతనాలను విడుదల చేసే అంశాన్ని సంక్షేమ శాఖలు పరిశీలిస్తున్నాయి.
ఈ క్రమంలో ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు వెంటనే కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకుంటే వేగంగా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారవర్గాలు సూచిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment