సాక్షి, హైదరాబాద్: వానాకాలం ఇక జోరందుకోనుంది. రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో రాష్ట్రంలో వర్షపాతం ఆశించిన స్థాయిలో లేదు. నైరుతి రుతుపవనాల సీజన్ జూన్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు పరిగణిస్తారు. అయితే జూన్ నెలలో మూడు వారాల తర్వాత రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో వానలు ఆలస్యమయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వానలు జోరందుకున్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది.
ఈనెలలో సాధారణ వర్షపాతం 24.44 సెంటీమీటర్ల మేర నమోదు కావాల్సి ఉంది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల కదలికలు చురుకుగా ఉండటంతో ఈ నెలలో సాధారణంకంటే ఎక్కువగా వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. జూలై నెలకు సంబంధించి దేశవ్యాప్తంగా వర్షపాతం నమోదు అంచనాలను వాతావరణ శాఖ విడుదల చేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో సాధారణం కంటే 10 శాతం అధికంగా వర్షాలు కురుస్తాయని వివరించింది.
ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులు పలుచోట్ల మోస్తరు నుంచి భారీవర్షాలు, ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షాలు నమోదు కావొచ్చని వాతావరణ వాఖ సూచించింది. ఈనెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
జూన్‌లో 46 శాతం లోటు....
జూన్ 22న రాష్ట్రంలోకి వచ్చిన నైరుతి వచ్చినప్పటికీ చాలాచోట్ల మోస్తరు వానలే కురిశాయి. జూన్‌లో 12.93 సెంటీమీటర్ల సగటు వర్షం కురవాల్సి ఉండగా, నెలా ఖరు నాటికి 7.27 సెంటీమీటర్లు మాత్రమే నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే 46శాతం లోటు వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో 7 జిల్లాల్లో మాత్రమే సాధా రణ వర్షపాతం నమోదైంది.
సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, నాగర్‌కర్నూల్, నల్లగొండ, నారాయణపేట్ జిల్లాల్లో జూన్ నెల సా ధారణ వర్షపాతం నమోదైంది. 18 జిల్లాల్లో లోటు వర్షపాతం, మరో 8 జిల్లాల్లో అత్యంత లోటు వర్ష పాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. జూలైలో మాత్రం వర్షాలు ఆశించిన స్థాయిలో కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment