సాక్షి, హైదరాబాద్: విద్యాసంస్థల బస్సులు పూర్తిగా దారి తప్పాయి. విద్యార్థులను భద్రంగా ఇళ్లకు చేర్చేందుకు ఉద్దేశించిన నిబంధనల విషయంలో పట్టీపట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయి. సోమవారం నుంచి విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ నిర్లక్ష్యం మరోసారి తేటతెల్లమైంది. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికల్లా ఫిట్‌నెస్‌ను రెన్యూవల్ చేసుకోవాల్సి ఉన్నా, ఆదివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 20 శాతం వాహనాలు మాత్రమే దాన్ని పూర్తిచేసుకున్నాయి. అధికారులు బస్సుల ఫిట్‌నెస్ పరిశీలించి అవి రోడ్డుపై నడిచేందుకు యోగ్యంగా ఉన్నదీ లేనిదీ తేలుస్తారు. ఆ మేరకు ఫిట్నెస్ రెన్యూవల్ చేస్తారు. ఇప్పుడు ఫిట్‌నెస్ రెన్యూవల్ లేకుండానే 80 శాతం బస్సులు రోడ్డెక్కితే పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 29 వేల పైచిలుకు విద్యాసంస్థల బస్సులు తిరుగుతున్నాయి. వీటిల్లో ఇప్పటివరకు 6 వేల బస్సులు మాత్రమే ఫిట్‌నెస్ రెన్యూవల్ చేయించుకున్నాయని సమాచారం. విద్యాసంస్థలు ప్రారంభమవుతున్న వేళ పరిస్థితిని ముందే గుర్తించి హెచ్చరించాల్సిన రవాణాశాఖ పెద్దగా స్పందించలేదు. సోమవారంలోపు రెన్యూవల్ చేయించుకోని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలైనా జారీ చేయలేదు.
సాధారణంగా విద్యాసంవత్సరం ప్రారంభం అవుతూనే రవాణాశాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తారు. ఫిట్‌నెస్ రెన్యూవల్ లేని బస్సులను గుర్తించి వాటి గుర్తింపు రద్దు చేయటం లాంటివి చేస్తారు. విద్యాసంస్థలకు పెనాల్టీలు విధిస్తుంటారు. కానీ, ముందుగానే హెచ్చరికలు జారీ చేయటం ద్వారా విద్యాసంస్థల్లో భయాన్ని పెంచే అవకాశం ఉంటుంది. ప్రారంభమయ్యాక పట్టుబడితే పెనాల్టీలు విధించటం వరకు సరే, అసలు ఫిట్‌నెస్ లేక బస్సు ప్రమాదానికి గురైతే విద్యార్థుల పరిస్థితి ఏమిటన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
శిక్షణ ఏది..?
విద్యాసంవత్సరం ప్రారంభం అయ్యేలోపు విద్యాసంస్థల బస్సులు నడిపే డ్రైవర్లకు ఒకరోజు శిక్షణ ఇవ్వాలన్న నిబంధన ఉంది. సఫర్ పేరుతో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో ఈ శిక్షణ కార్యక్రమాలుంటాయి. డ్రైవింగ్ నైపుణ్యం, బస్సు నిబంధనలు, విద్యార్థుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించే తీరు.. ఇలా అన్ని అంశాలు అందులో ఉంటాయి. కానీ ఇప్పటివరకు ఆ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించలేదు. విద్యార్థులు ఆ బస్సుల్లో ఎక్కడం ప్రారంభమయ్యేలోపే ఈ శిక్షణ పూర్తి చేస్తే ఉపయోగం ఉంటుంది. తర్వాత ఎప్పటికో శిక్షణ ఇస్తే, ఈలోపు అనుకోని ప్రమాదం చోటు చేసుకుంటే ఏంటన్నది తల్లిదండ్రు ఆందోళన.
Comments
Please login to add a commentAdd a comment