సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. త్వరలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుతో పాటు ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ నియామకం, ఇతర మార్పులు జరగనున్నాయనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం సమావేశమైన సీనియర్ నేతలు కొందరు ప్రచార కమిటీ చైర్మన్‌గా ఈటల నియామకంతో పాటు రాష్ట్ర అధ్యక్షుడి మార్పు వంటి అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ మేరకు తమ అభిప్రాయాన్ని జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం.
వారం క్రితం ‘అసంతృప్తి’ సెగ
దాదాపు వారం రోజుల క్రితం కొందరు అసంతృప్త నేతలు సమావేశమై, సీనియర్లమైన తమకు పార్టీలో తగిన ప్రాధాన్యత, గుర్తింపు లభించడం లేదని, పార్టీ ముఖ్యనేత ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తూ పార్టీకి నష్టం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నేతల మధ్య సమన్వయం కొరవడటం లాంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని జాతీయ నాయకత్వాన్ని కోరారు.
ఈ నేపథ్యంలోనే బీజేపీ కమిటీల్లో మార్పులు, బండి సంజయ్‌కి కేంద్ర మంత్రి పదవి, ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా ఈటల నియామకం అనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శనివారం రాత్రి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పార్టీలో మార్పులపై జరుగుతున్నది ప్రచారం మాత్రమేనని అన్నారు. తాను పార్టీ కోసం కమిట్‌మెంట్‌తో కష్టపడి పనిచేస్తానని, బీజేపీలో ఏ పదవీ శాశ్వతం కాదని, నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా పాటించేందుకు బిస్తర్ రెడీగా పెట్టుకున్నానంటూ వ్యాఖ్యానించారు.
తాజాగా అనుకూల వర్గం భేటీ..
ఆదివారం పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో జాతీయ కార్యవర్గసభ్యులు జి.వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, మాజీ ఎంపీలు రవీంద్రనాయక్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డా.బూర నర్సయ్యగౌడ్, డా.విజయ రామారావు, సుద్దాల దేవయ్య, సీహెచ్ విఠల్, రచనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బండి సంజయ్‌కు అనుకూల వర్గంగా భావిస్తున్న ఈ నేతలు.. ఇతర అంశాలతో పాటు రాష్ట్ర నాయకత్వ మార్పు, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించడంపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బండి సంజయ్‌ను మార్చొద్దని, ఈటలకు కీలక పదవి ఇవ్వొద్దంటూ అధిష్టానాన్ని గట్టిగా కోరాలని నిర్ణయించినట్లు సమాచారం.
తాము కూడా ఉద్యమకారులమేనని, జాతీయ కార్యవర్గసభ్యులుగా ఉన్నామని, సీనియర్ నేతలైన తమకు తెలియకుండానే కీలక నిర్ణయాలు ఎలా తీసుకుంటారంటూ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈటలకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని వ్యతిరేకించడంతో పాటు, ఆయనకు కీలక పదవి ఇవ్వొద్దని, తాము ఆయన కంటే సీనియర్లమని, తమకు కూడా తగిన గుర్తింపునిచ్చే పదవులు ఇవ్వాలని అభిప్రాయ పడినట్లు సమాచారం.
జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉన్న తమకు పార్టీలో జరుగుతున్న పరిణామాలు తెలియడం లేదని కొందరు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ అంశాలన్నీ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు. తమతో కలిసి భోజనం చేసేందుకు రావాలనే ఆహ్వానంతో ఒక మాజీ ఎంపీ అక్కడకు వెళ్లగా, కొంతకాలంగా అంతగా చురుగ్గా లేని ఒకరిద్దరు నేతలు కూడా ఇదే విధమైన ఆహ్వానంతో అక్కడకు వెళ్లారని తెలుస్తోంది.
అసలు ఆ పోస్టే ఉండదు..
బీజేపీలో ప్రచార కమిటీ చైర్మన్ అనే పదవి లేదని సమావేశానంతరం జితేందర్‌రెడ్డి మీడియాతో అన్నారు. ‘రాష్ట్ర నేతలతో చర్చించకుండా అధ్యక్షుడి మార్పుపై జాతీయ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. పదవులు ఇచ్చే ముందు లీకులు ఇచ్చే సంస్కృతి బీజేపీలో ఉండదు. దీనిపై సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో వస్తున్న లీకులను పార్టీ క్యాడర్ నమ్మొద్దు. బీజేపీ స్టేట్ చీఫ్‌ను మారుస్తున్నారని కేసీఆర్ లీకులు ఇప్పిస్తున్నారు.
బీజేపీ బలం తగ్గిందని చెప్పడానికే కాంగ్రెస్‌పై కేసీఆర్ విమర్శలు చేస్తున్నారు. క్యాడర్‌ను కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది. మాకు ఎలాంటి రహస్య అజెండా లేదు. బీజేపీ బలోపేతమే మాకు ముఖ్యం. పొంగులేటి, జూపల్లి కూడా బీజేపీలో చేరాలని కోరుతున్నా. శత్రువుకు శత్రువు.. మిత్రుడు అన్నట్టు కేసీఆర్‌ను కొట్టాలంటే పొంగులేటి, జూపల్లి బీజేపీ వైపు రావాలి..’ అని వ్యాఖ్యానించారు.
భేటీపై స్పందించేందుకు ఈటల నిరాకరణ..
బీజేపీ సీనియర్ నేతలు ప్రత్యేకంగా భేటీ కావడంపై స్పందించేందుకు ఈటల రాజేందర్ నిరాకరించారు. ఇలాంటి వాటిపై తాను మాట్లాడనని, ఎలాంటి చిట్‌చాట్ చేయనని తన నివాసం వద్ద ఆయన మీడియాతో చెప్పారు.
అధిష్టానం ఎలా స్పందిస్తుందో?
సీనియర్ల భేటీ బీజేపీలో చర్చకు దారితీసింది. ఇది దేనికి సంకేతం? దీనిపై అధిష్టానం ఎలా స్పందిస్తుంది? సీనియర్ల అభ్యంతరాలను ఎలా తీసుకుంటుంది? ప్రచార కమిటీ చైర్మన్‌గా ఈటల నియామకంపై ఈ సమావేశం ఎఫెక్ట్ పడుతుందా? అనే దానిపై పార్టీ నేతల్లో ఆసక్తి నెలకొంది.
మీడియా ద్వారా లీకులు సరికాదు: విజయశాంతి
బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి మార్పుపై మీడియా ద్వారా లీకులు సరికాదని విజయశాంతి అన్నారు. బీజేపీలో వార్తలు లీక్ చేసే పద్ధతి ఉండదని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలు పూర్తి అయ్యేవరకూ బండి సంజయ్ కొనసాగుతారని రాష్ట్రపార్టీ ఇన్‌చార్జి తరుణ్ చుగ్ గతంలో చెప్పారని గుర్తు చేశారు. ఇప్పటివరకు ఇదే అధికారిక ప్రకటన అని, ఊహాగానాలతో మీడియాలో వచ్చే కథనాలు అధికారిక ప్రకటనలు కావని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment