
సాక్షి, హైదరాబాద్/ఏజీవర్సిటీ: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (మేనేజ్) తెలంగాణలోని మాజీ సైనిక ఉద్యోగుల కోసం ‘జై జవాన్ కిసాన్’ కార్యక్రమాన్ని చేపట్టింది. రక్షణ సేవల నుంచి చిన్న వయస్సులో పదవీ విరమణ పొందే సిబ్బందికి పునరావాసం కల్పించేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. రిటైర్డ్ సిబ్బందికి వేతనంతో కూడిన స్థిరమైన ఉపాధి అవకాశాలను సృష్టించడానికి నాబార్డు సహకారంతో మేనేజ్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
మాజీ సైనికులకు వ్యవసాయ సంబంధిత నైపుణ్యాన్ని అందించేందుకు 15 రోజుల రెసిడెన్షియల్ శిక్షణ ప్రారంభించనుంది. సెప్టెంబర్ 4 నుంచి 18వ తేదీ వరకు రాజేంద్రనగర్‌లోని మేనేజ్‌లో నిర్వహించే ఈ కోర్సుకు ఎలాంటి ఫీజు లేదు. శిక్షణ అనంతరం సంబంధిత రంగాల్లో అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తారు. దీనికి ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లోని మాజీ సైనికులు, రాష్ట్రంలోని బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, ఐటీబీపీ, సీఆర్‌పీఎఫ్ మొదలైన పారామిలిటరీ దళాల నుంచి పదవీ విరమణ పొందిన సిబ్బంది అర్హులు. దరఖాస్తు సమర్పణకు జూలై 15 చివరి తేదీ. వివరాలకోసం 9052028777 నంబర్ సంప్రదించాలని లేదా సంస్థ వెబ్‌సైట్‌లో చూడాలని మేనేజ్ ఒక ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment