ex service men
-
మాజీ సైనికుల కోసం ‘జై జవాన్ కిసాన్’
సాక్షి, హైదరాబాద్/ఏజీవర్సిటీ: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ (మేనేజ్) తెలంగాణలోని మాజీ సైనిక ఉద్యోగుల కోసం ‘జై జవాన్ కిసాన్’ కార్యక్రమాన్ని చేపట్టింది. రక్షణ సేవల నుంచి చిన్న వయస్సులో పదవీ విరమణ పొందే సిబ్బందికి పునరావాసం కల్పించేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. రిటైర్డ్ సిబ్బందికి వేతనంతో కూడిన స్థిరమైన ఉపాధి అవకాశాలను సృష్టించడానికి నాబార్డు సహకారంతో మేనేజ్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మాజీ సైనికులకు వ్యవసాయ సంబంధిత నైపుణ్యాన్ని అందించేందుకు 15 రోజుల రెసిడెన్షియల్ శిక్షణ ప్రారంభించనుంది. సెప్టెంబర్ 4 నుంచి 18వ తేదీ వరకు రాజేంద్రనగర్‌లోని మేనేజ్‌లో నిర్వహించే ఈ కోర్సుకు ఎలాంటి ఫీజు లేదు. శిక్షణ అనంతరం సంబంధిత రంగాల్లో అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తారు. దీనికి ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లోని మాజీ సైనికులు, రాష్ట్రంలోని బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, సీఆర్పీఎఫ్ మొదలైన పారామిలిటరీ దళాల నుంచి పదవీ విరమణ పొందిన సిబ్బంది అర్హులు. దరఖాస్తు సమర్పణకు జూలై 15 చివరి తేదీ. వివరాలకోసం 9052028777 నంబర్ సంప్రదించాలని లేదా సంస్థ వెబ్సైట్లో చూడాలని మేనేజ్ ఒక ప్రకటనలో తెలిపింది. -
'జేఎన్‌యూ జాతి వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డా'
ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక జేఎన్‌యూ రణరంగంగా మారింది. పార్లమెంటు దాడి కేసులో దోసి అఫ్జల్ గురును ఉరితీయడానికి వ్యతిరేకంగా క్యాంపస్‌లో జరిగిన సమావేశం, అనంతర పరిణామాలు ఢిల్లీ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. తాజాగా మాజీ సైనికులు కూడా ఈ వివాదంపై స్పందించారు. జేఎన్‌యూలో జాతి వ్యతిరేక కార్యకలాపాలు వెంటనే ఆపకపోతే.. ఆ యూనివర్సిటీ తమకు ఇచ్చిన డిగ్రీలను తిరిగి ఇచ్చేస్తామని హెచ్చరించారు. తాము గతంలో జేఎన్‌యూలో చదివామని చెప్పుకోవడం చాలా ఇబ్బందిగా ఉందని వీసీకి స్పష్టం చేశారు. 1978 ఎన్డీయే బ్యాచ్‌కి చెందిన మాజీ సైనికులు ఈ మేరకు వైస్ చాన్స్‌లర్‌కు లేఖ రాశారు. తమలో చాలామంది జేఎన్యూలోనే చదివామని, కానీ క్యాంపస్‌లో 'అఫ్జల్ గురు డే' సంబరాలు చేసుకోవడం లాంటి జాతి వ్యతిరేక కార్యకలాపాలు జరగడం చూస్తే.. తమ రక్తం ఉడికిపోతోందని చెప్పారు. ఇదే యూనివర్సిటీలో చదివి.. దేశమాత సేవలో ప్రాణాలు అర్పించిన వాళ్ల త్యాగాలు వృథా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ యూనివర్సిటీతో అనుబంధాన్ని తాము కొనసాగించలేమని.. ఇది జాతి వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని, భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగితే మీరిచ్చిన డిగ్రీలను తిరిగి ఇచ్చేస్తామని ఆ లేఖలో పేర్కొన్నారు.