సాక్షి, న్యూఢిల్లీ: పాత్రికేయులందరికీ వీలైనంత త్వరగా ఇళ్ల స్థలాలు ఇస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ ప్రక్రియను మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు అప్పగించామని తెలిపారు. ఢిల్లీ టీయూడబ్ల్యూజే–143 అధ్యక్షుడు నాగిళ్ల వెంకటేష్ అధ్యక్షతన శనివారం పాత్రికేయుల బృందం మంత్రి కేటీఆర్ తో సమావేశమైంది. ఈ సందర్భంగా ఢిల్లీలో పనిచేస్తున్న తెలంగాణ పాత్రికేయులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.
దీనికి ఆయన సానుకూలంగా స్పందిస్తూ.. హైదరాబాదు లోని పాత్రికేయులందరికీ స్థలాలు ఇస్తామని స్పష్టం చేశారు. ఇందులోనే ఢిల్లీలో పనిచేస్తున్న తెలంగాణ పాత్రికేయుల్ని సైతం చేరుస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు జీవోలో ఆ అంశాలను పొందుపరుస్తామన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్టు సొసైటీకి, హైదరాబాద్ పాత్రికేయులకు ఒకేసారి ఇళ్ల స్థలాలు ఇస్తామని స్పష్టం చేశారు. భేటీలో బీఆర్‌ఎస్ ఎంపీలు గడ్డం రంజిత్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment