400 ఎకరాల తాకట్టుతో రూ.10 వేల కోట్ల రుణ సేకరణ
ఇటీవలి కేబినెట్ భేటీలో ‘ప్రభుత్వ గ్యారంటీ’కి ఆమోదం
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల భూములను తాకట్టు పెట్టి మూలధనం, ఇతర అవసరాల కోసం రూ.10వేల కోట్ల రుణ సేకరణ చేయాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఇకపై వేగం పుంజుకోనున్నాయి. ఫైనాన్స్ సంస్థల నుంచి పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ తీసుకునే రూ.10వేల కోట్ల రుణాలకు గ్యారంటీ ఇచ్చింది. గ్యారంటీ ఇవ్వాలన్న నిర్ణయానికి ప్రభుత్వం శనివారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ భేటీలో ఆమోదం (ర్యాటిఫై) తెలిపింది. రుణ మార్కెట్ నుంచి రూ.10వేల కోట్లు అప్పులు తెచ్చేందుకు ఆర్‌బీఐ నిబంధనలు అడ్డుపడుతుండటంతో ప్రభు త్వం కొంతకాలంగా తర్జనభర్జన పడుతోంది.
అప్పుల కోసం ప్రభుత్వం తరఫున ఫైనాన్స్ సంస్థల వద్దకు వెళ్లిన మర్చంట్ బ్యాంకర్లు, సవాలక్ష ప్రశ్నలు ఎదుర్కొన్నారు. రూ.10వేల కోట్ల రుణం కోసం రూ.20వేల కోట్ల విలువ చేసే భూములను తాకట్టు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనా రా ష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తేనే రుణం ఇస్తామని ఫైనాన్స్ సంస్థలు మెలిక పెట్టాయి. ప్రభుత్వం గ్యా రంటీ ఇస్తే భూములు తాకట్టు పెట్టి తీసుకునే రుణా లకు కూడా ‘ద్రవ్య బాధ్యత బడ్జెట్ నిర్వహణ’ (ఎఫ్‌ఆర్‌బీఎం) నిబంధన వర్తిస్తుందని ఆర్‌బీఐ వర్గాలు చెప్పినట్లు సమాచారం. దీంతో ఎఫ్‌ఆర్‌బీ ఎం పరిధికి లోబడే పరిశ్రమల భూములను తాకట్టు పెట్టి తీసుకుంటున్న రుణాలకు గ్యారంటీ ఇవ్వాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది.
400 ఎకరాల తాకట్టు..
హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన కోకాపేట, రాయదుర్గంలోని రూ.20వేల కోట్ల విలువ చేసే సుమారు 400 ఎకరాల భూములను ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలకు తాకట్టు పెట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. భూములను తనఖా పెట్టి రుణం తీసుకున్న అనుభవం ప్రభుత్వ శాఖలకు లేకపోవడంతో మర్చంట్ బ్యాంకర్లకు రుణ సేకరణ బాధ్యత అప్పగించారు. రుణం ఇప్పించే మర్చంట్ బ్యాంకర్‌కు కనీసం ఒక శాతం చొప్పున లెక్క వేసినా రూ.100 కోట్లు కమీషన్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. రుణమార్కెట్ నుంచి అప్పులు తేవడంలో అనుభవం కలిగిన మర్చంట్ బ్యాంకర్లను ఈ ఏడాది జూలైలో ప్రభుత్వం ఎంపిక చేసింది. తాజాగా గ్యారంటీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో న్యాయపరమైన చిక్కులు లేకుండా మర్చంట్ బ్యాంకర్లు రుణ సేకరణ చేయాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment