Industrial lands
-
భూముల తాకట్టుకు ఓకే!
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల భూములను తాకట్టు పెట్టి మూలధనం, ఇతర అవసరాల కోసం రూ.10వేల కోట్ల రుణ సేకరణ చేయాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఇకపై వేగం పుంజుకోనున్నాయి. ఫైనాన్స్ సంస్థల నుంచి పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ తీసుకునే రూ.10వేల కోట్ల రుణాలకు గ్యారంటీ ఇచ్చింది. గ్యారంటీ ఇవ్వాలన్న నిర్ణయానికి ప్రభుత్వం శనివారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ భేటీలో ఆమోదం (ర్యాటిఫై) తెలిపింది. రుణ మార్కెట్ నుంచి రూ.10వేల కోట్లు అప్పులు తెచ్చేందుకు ఆర్బీఐ నిబంధనలు అడ్డుపడుతుండటంతో ప్రభు త్వం కొంతకాలంగా తర్జనభర్జన పడుతోంది.అప్పుల కోసం ప్రభుత్వం తరఫున ఫైనాన్స్ సంస్థల వద్దకు వెళ్లిన మర్చంట్ బ్యాంకర్లు, సవాలక్ష ప్రశ్నలు ఎదుర్కొన్నారు. రూ.10వేల కోట్ల రుణం కోసం రూ.20వేల కోట్ల విలువ చేసే భూములను తాకట్టు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనా రా ష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తేనే రుణం ఇస్తామని ఫైనాన్స్ సంస్థలు మెలిక పెట్టాయి. ప్రభుత్వం గ్యా రంటీ ఇస్తే భూములు తాకట్టు పెట్టి తీసుకునే రుణా లకు కూడా ‘ద్రవ్య బాధ్యత బడ్జెట్ నిర్వహణ’ (ఎఫ్ఆర్బీఎం) నిబంధన వర్తిస్తుందని ఆర్బీఐ వర్గాలు చెప్పినట్లు సమాచారం. దీంతో ఎఫ్ఆర్బీ ఎం పరిధికి లోబడే పరిశ్రమల భూములను తాకట్టు పెట్టి తీసుకుంటున్న రుణాలకు గ్యారంటీ ఇవ్వాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది.400 ఎకరాల తాకట్టు..హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన కోకాపేట, రాయదుర్గంలోని రూ.20వేల కోట్ల విలువ చేసే సుమారు 400 ఎకరాల భూములను ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలకు తాకట్టు పెట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. భూములను తనఖా పెట్టి రుణం తీసుకున్న అనుభవం ప్రభుత్వ శాఖలకు లేకపోవడంతో మర్చంట్ బ్యాంకర్లకు రుణ సేకరణ బాధ్యత అప్పగించారు. రుణం ఇప్పించే మర్చంట్ బ్యాంకర్‌కు కనీసం ఒక శాతం చొప్పున లెక్క వేసినా రూ.100 కోట్లు కమీషన్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. రుణమార్కెట్ నుంచి అప్పులు తేవడంలో అనుభవం కలిగిన మర్చంట్ బ్యాంకర్లను ఈ ఏడాది జూలైలో ప్రభుత్వం ఎంపిక చేసింది. తాజాగా గ్యారంటీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో న్యాయపరమైన చిక్కులు లేకుండా మర్చంట్ బ్యాంకర్లు రుణ సేకరణ చేయాల్సి ఉంటుంది. -
పారిశ్రామిక భూముల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పారిశ్రామిక భూముల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పరిశ్రమల విస్తరణ, అభివృద్ధి నేపథ్యంలో టీఎస్ఐఐసీ విభాగపు అధికారులతో మంత్రి శ్రీధర్‌బాబు బషీర్‌బాగ్‌లోని సంస్థ కార్యాలయంలో శనివారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంస్థ కార్యకలాపాలు, విభాగాల పనితీరు, ల్యాండ్ బ్యాంకు, భూ కేటాయింపులు, వాటి వినియోగం తదితర అంశాలపై పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, సంస్థ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి, అధికారులతో కలిసి సమీక్షించారు. రాష్ట్ర విభజనకు ముందు, తర్వాత జరిగిన కేటాయింపులపై మంత్రి దృష్టిసారించారు. 2014 తర్వాత జరిగిన భూ కేటాయింపులు, ఏయే కంపెనీలు ఎంత మేర, ఏ అవసరాల కోసం భూమి పొందిందీ.. ప్రస్తుత వినియోగం ఎంత, నిరుపయోగంగా ఉన్న భూముల వ్యవహారాలపై మంత్రి ఆరా తీశారు. ఏళ్లు గడిచినా సంబంధిత కంపెనీలు భూములు వినియోగించుకోకపోవడం.. భూములు పొందిన సంస్థలు వారి ప్రయోజనాలకు కాకుండా థర్డ్ పారీ్టలకు లీజుకు ఇచ్చిన అంశాలపై అధికారుల ద్వారా ఆరా తీశారు, అలా థర్డ్ పారీ్టలకు జరిగిన లీజు అగ్రిమెంట్లు, పొందుతున్న ఆదాయం అంశాలపై నివేదిక సమర్పించాలని సంస్థ ఉన్నతాధికారులను ఆదేశించారు. గతంలో భూములు పొంది, ఈడీ , సీబీఐ లాంటి సంస్థలు జప్తు చేసిన భూములపై హక్కు తిరిగి పొందేలా న్యాయస్థానాల్లో పోరాటం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని మంత్రి అధికారులకు సూచించారు. జాయింట్ వెంచర్లో భాగంగా పలు సంస్థలు, కంపెనీలు డివిడెండ్, షేర్ హోల్డ్ అమౌంట్ చెల్లించని అంశాలపై నివేదిక అందించాలని ఆదేశించారు. రాష్ట్ర అభివృద్ధిలో పరిశ్రమల శాఖ అధికారుల కృషి చాలా ఉందని, మరింతగా సంస్థ అభివృద్ధి కోసం సూచనలు, సలహాలతో పాటు సమస్యలు కూడా లిఖిత పూర్వకంగా ఇవ్వాలని ఉద్యోగులకు మంత్రి చెప్పారు. ప్రతి అధికారి ఫీల్డ్ విజిట్ చేసి సంబంధిత కంపెనీలకు సంబంధించిన భూములపై అన్ని వివరాలతో త్వరితగతిన నివేదిక అందించాలని సంస్థ ఎండీని మంత్రి ఆదేశించారు. -
పరిశ్రమల భూములు వెనక్కి
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల ఏర్పాటు కోసం భూములు తీసుకుని నిర్ణీత గడువులోగా కార్య కలాపాలు ప్రారంభించని వ్యక్తులు, సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. పరిశ్రమల కోసం ప్రభుత్వం భూములు కేటా యించినా అందులో ఎలాంటి కార్యకలాపాలు లేకుండా నిరుపయోగంగా ఉన్న వాటిపైనా చర్యలు తీసుకోవాలన్నారు. మంగళవారం పరిశ్రమల శాఖ కార్యకలాపాలపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి పరిశ్రమలు రప్పించడం ద్వారా స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. భూ కేటాయింపులు పొందిన కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం కోరుకుంటోందన్నారు. ‘చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్’పేరిట మార్పిడి చేసుకుని సంబంధిత భూముల్లో ఇతర కార్యకలాపాలను నిర్వహిస్తున్న వారి వివరాలను కూడా సేకరించాలని మంత్రి ఆదేశించారు. అన్ని రకాల పరిశ్రమల సమగ్ర సమాచారాన్ని సేకరించి ‘బ్లూ బుక్’ తయారు చేయాలని అధికారులకు సూచించారు. అన్ని రంగాలకు చెందిన సూక్ష్మ, చిన్న, మధ్య, భారీ తరహా పరిశ్రమల వివరాలు సమగ్రంగా ఉండేలా చూడాలని, తద్వారా రాష్ట్ర పారిశ్రామిక సమ్మిళిత స్ఫూర్తి ఇతర కార్యక్రమాలకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఎస్ఎఫ్సీ విస్తరణకు ప్రణాళిక.. తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (టీఎస్ఎఫ్సీ) కార్యకలాపాల విస్తరణకు ప్రణాళికలు రూపొందించాలని, దీనికి అవసరమైన సాయాన్ని అందిస్తామని కేటీఆర్ ప్రకటించారు. ఎస్ఎఫ్సీ విభజనకు సంబంధించి మంత్రి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా టీఎస్ఎఫ్సీ ‘ఈ–ఎస్ఎఫ్సీ డిజిటల్ ప్లాట్‌ఫాం’ను మంత్రి ఆవిష్కరించారు. -
నాయకుల డైరెక్షన్లో రాజీకి యత్నం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: షాబాద్ మండలం చందనవెళ్లి పారిశ్రామికవాడ భూ పరిహారం పంపిణీలో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చేందుకు రాజకీయ నేతలు యత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితులు రెండు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి మధ్య రాజీ కుదిర్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయా.. పెద్దల డైరెక్షన్లోనే స్థానిక పోలీసులు మధ్యవర్తిత్వం నెరుపుతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. పోలీసుల తీరు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల వ్యవహారశైలి ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. పారిశ్రామికవాడ కోసం చేపట్టిన భూసేకరణలో రైతులకు పరిహారం పంపిణీలో దాదాపు రూ.2.6 కోట్ల మేర అక్రమాలు జరిగిన విషయం తెలిసిందే. రాజకీయ పలుకుబడి, అధికారుల అండతో అనర్హులు పరిహారాన్ని అందిన కాడికి మెక్కేశారు. స్థానిక సర్పంచ్, ఆయన కుటుంబ సభ్యులు, తన సన్నిహితులే అక్రమంగా లబ్ధిపొందారని జిల్లా యంత్రాంగం ప్రాథమికంగా గుర్తించి 15 మంది జాబితా విడుదల చేసింది. అయితే, వీరు తమను బెదిరించి పరిహారం తీసుకుని అన్యాయం చేశారని ఐదుగురు బాధితులు ఈనెల 24న షాబాద్ పోలీసులను ఆశ్రయించారు. ఐదుగురి వ్యక్తుల పేర్లను పేర్కొంటూ సీఐ నర్సయ్యకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే, రెండు రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శని, ఆదివారం సెలవులని, సోమవారం తప్పకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని పోలీసులు ఫిర్యాదు చేసిన రోజు బాధితులకు నచ్చజెప్పి ఇంటికి పంపించారు. ఇంకా కేసు నమోదు చేయకపోవడంపై వారి వ్యవహారశైలిపై పలు విమర్శలు వస్తున్నాయి. నేతల అక్షింతలు అక్రమంగా పరిహారం కొట్టేసిన వ్యవహారంలో రాజకీయ పెద్దల హస్తం ఉందని పేర్కొంటూ ‘పెద్దలే.. గద్దలై’ శీర్షికన ఈనెల 25న ‘సాక్షి’ ప్రచురించిన కథనం కలకలం రేపింది. దీంతో జిల్లాకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. షాబాద్ మండలంలో అధికార పార్టీ నేతలపై ఈమేరకు వారు సీరియస్ అయినట్లు వినికిడి. మీడియాలో విస్తృతంగా కథనాలు వస్తున్నా.. కనీసం ఖండించడం లేదని, ఫలితంగా పరిహారాన్ని నిజంగా నొక్కేశారనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తున్నాయని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి అక్షింతలు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే నాయకులంతా ఒక్కటై సోమవారం ప్రెస్‌మీట్ పెట్టి ఆరోపణలను ఖండించారు. తాము న్యాయబద్ధంగానే పరిహారం తీసుకున్నామని, ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. నేడు కలెక్టర్‌కు వివరణ.. పరిహారాన్ని అక్రమంగా నొక్కేశారని కలెక్టర్ లోకేశ్‌కుమార్ చేపట్టిన ప్రాథమిక విచారణలో తేలిన విషయం తెలిసిందే. ఎలాంటి అర్హత లేకున్నా మొత్తం 15 మంది రూ.2.6 కోట్లు కాజేశారని పేర్కొంటూ వారికి ఈనెల 23న నోటీసులు జారీ చేశారు. ఈనెల 27 లోపు దీనిపై వివరణ ఇవ్వాలని సూచించారు. లేదంటే రికవరీ యాక్ట్ అమలు చేసి సొమ్మును వెనక్కి తీసుకుంటామని హెచ్చరించారు. ఈక్రమంలో తమ వద్ద ఉన్న ఆధారాలతో మంగళవారం కలెక్టర్‌కు వివరణ ఇచ్చేందుకు 15 మంది సిద్ధమైనట్లు తెలిసింది. అనంతరం ఏం జరుగుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజీ కోసం కబురు.. రాజకీయ నేతల డైరెక్షన్లో స్థానిక పోలీసులు రాజీ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఫిర్యాదు చేసిన బాధితులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి షాబాద్ పోలీసులు సోమవారం ఫోన్ చేసి ఠాణాకు రావాలని చెప్పినట్లు తెలిసింది. మంగళవారం ఇరు పక్షాలు తమ వద్ద ఉన్న ఆధారాలతో హాజరుకావాలని సూచించినట్లు సమాచారం. ఆధారాలను బట్టి తదుపరి చర్యల కోసం ఆలోచిస్తామన్నారని వినికిడి. చదవండి: రాజకీయ అండతో పెద్దలే.. గద్దలై! -
రాజకీయ అండతో పెద్దలే.. గద్దలై!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: షాబాద్ మండలం చందనవెల్లి పారిశ్రామికవాడలో భూములు కోల్పోయిన రైతులకు అందాల్సిన పరిహారాన్ని రాజకీయ పెద్దలే గద్దలుగా భోంచేశారు. 170 మంది రైతులకు రూ.60.20 కోట్ల పరిహారం అందజేయగా.. ఇందులో సుమారు రూ.4 కోట్ల వరకు అనర్హుల పేర్లతో మెక్కేశారు. ఇప్పటికే 15 మంది రూ.2.6 కోట్లు అక్రమంగా నొక్కినట్లు యంత్రాంగం గుర్తించి వివరణ కోసం నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. ఇదిగాక మరో రూ.2 కోట్ల వరకు పక్కదారి పట్టినట్లు సమాచారం. ఈ మొత్తంలో ఎవరెవరికి.. ఎంత దక్కిందనేది విచారణలో తేలనుంది. స్థానిక సర్పంచ్ కొలాన్ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, అతని సన్నిహితులు, మాజీ సర్పంచ్‌లు జట్టుగా ఏర్పడి కొల్లగొట్టినట్లు విచారణలో వెల్లడవుతున్నట్లు సమాచారం. మరణించిన మాజీ సైనికుడి పేరు మీద ఉన్న ఐదెకరాల భూమిని సర్పంచ్ సోదరుడు కొలాన్ సుధాకర్‌రెడ్డి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తద్వారా రూ.45 లక్షల పరిహారాన్ని కాజేశారని ప్రచారం జరుగుతోంది. సైనికులకు ప్రభుత్వం పంపిణీ చేసిన పదేళ్ల తర్వాత సదరు భూమిని విక్రయించుకునే వీలుంది. అయితే ఇందుకు తప్పనిసరిగా యంత్రాంగం జారీచేసిన నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఉండాలి. ఎన్ఓసీ లేకుండానే ఎలా కొనుగోలు చేశారన్నది, రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందన్న అంశంపై యంత్రాంగం విచారణ జరుపుతోంది. అంతేగాక అసలు భూమి లేకున్నా చాలా మంది పేర్లు డిక్లరేషన్ జాబితాలో చేర్చి పరిహారం పొందారు. కాగా, తమకు న్యాయం జరిగేంతవరకు దీక్షను కొనసాగిస్తామని బాధితులు స్పష్టం చేస్తున్నారు. బాధితుల రిలే నిరాహార దీక్ష శనివారం నాటికి 26వ రోజుకు చేరుకుంది. శిబిరంలో అర్ధనగ్న ప్రదర్శన చేయడంతోపాటు నోటికి నల్లరిబ్బన్ ధరించి మౌనప్రదర్శన చేశారు. పోలీసులకు బాధితుల ఫిర్యాదు.. షాబాద్ (చేవెళ్ల): చందనవెళ్లి భూముల పరిహారంలో అక్రమాలకు పాల్పడిన వ్యక్తులపై బాధిత రైతులు షాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను బెదిరించి పరిహారాన్ని దౌర్జన్యంగా తీసుకున్నారని వివరించారు. చందనవెల్లి ప్రస్తుత సర్పంచ్ కొలాన్ ప్రభాకర్‌రెడ్డి, కొలన్ సుధాకర్‌రెడ్డి, శ్రీలత, బషీర్, వెంకటయ్యలపై సీఐ నర్సయ్యకు బాధిత రైతులు ఎం.సత్యనారాయణ, ఎం.రాజు, జరినాబేగం, ఎ.సత్తమ్మ, అజహర్ ఫిర్యాదు చేశారు. తమ భూములకు సంబంధించిన నష్టపరిహారాన్ని తమకు తెలియకుండా సర్పంచ్ కుటుంబీకులు పొందారని తెలిపారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. తమకు న్యాయం చేయాలని గత 26 రోజులుగా రిలే నిరహార దీక్ష చేపడుతుంటే ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. బాధితులకు తెలియకుండానే వారి చెక్కులను మద్యవర్తులు మార్చుకుని తమ ఖాతాల్లో వేసుకున్నట్లు చెప్పారు. తనకు వచ్చిన రూ.12లక్షలను మాజీ సర్పంచ్ కుమారుడు వెంకటయ్య తన ఖాతాలో వేసుకుని డబ్బులు ఇవ్వనని బెదిరించాడని జరినాబేగం ఫిర్యాదులో పేర్కొంది. చందనవెల్లి భూముల పరిహారంలో జరిగిన అక్రమాలపై సరైన విచారణ జరిపించి అర్హులైన రైతులకు న్యాయం చేయాలని, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్న సీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. కలెక్టర్, తన పైఅధికారు దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. -
పరిశ్రమల భూములు తనఖాకు అనుమతి
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల ఏర్పాటునకు కేటాయించే ప్రభుత్వ భూములను ఆ సంస్థలు తనఖా పెట్టుకోవడానికి అనుమతించడం తదితర అంశాలపైన, అలాగే గతంలో ఏ రంగం పరిశ్రమలకు ఎంత భూమి కేటాయించాలనే దానిపై ప్రభుత్వం జారీ చేసిన జీవోల్లో సవరణలకు ముగ్గురు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేశారు. గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఏ రంగానికి చెందిన పరిశ్రమలకు ఎంత భూమి కేటాయించాలి, అలాగే ప్రభుత్వ భూములను నిధుల కోసం విక్రయించరాదని, అసైన్డ్ భూములను ఎవరైనా అనధికారికంగా కొనుగోలుచేస్తే అలాంటి భూములను ప్రభుత్వ స్వాధీనం చేసుకోవడం తదితర అంశాలతో జీవోలు 571, 607లను జారీ చేసింది. ఇప్పుడు ఆ జీవోలను పూర్తి స్థాయిలో సమీక్షించి ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఆ జీవోల్లో సవరణలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజస్ట్రేషన్ శాఖ) కేఈ కృష్ణమూర్తి, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడులతో కమిటీ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు సోమవారం జీవో జారీ చేశారు.